కెయిర్న్ ఇండియా 20,495 కోట్లు కట్టాల్సిందే
ఐటీ శాఖ తాజా నోటీసులు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ తాజాగా ఇంధన రంగ సంస్థ కెయిర్న్ ఇండియాకు దాదాపు రూ. 20,495 కోట్ల పన్ను నోటీసులు జారీ చేసింది. ఎనిమిదేళ్ల క్రితం షేర్ల బదలాయింపు లావాదేవీలపై కంపెనీ గత ప్రమోటరు కెయిర్న్ ఎనర్జీ అప్పట్లో పన్నులు చెల్లించని కారణంగా అసలు, వడ్డీ కలిపి ఇప్పుడు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది.
డిమాండ్ నోటీస్‌లో రూ. 10,248 కోట్లు పన్నులు కాగా, మిగతా రూ. 10,247 కోట్లు వడ్డీ రూపంలో ఉంది. 2006లో భార త్‌లోని అసెట్స్‌ను కెయిర్న్ ఇండియాకు బదలాయించడం ద్వారా వచ్చిన రూ. 24,500 కోట్ల మేర క్యాపిటల్ గెయిన్స్‌పై పన్నులు కట్టలేదంటూ ఇటీవలే కెయిర్న్ ఎనర్జీకి రూ. 10,247 కోట్ల ట్యాక్స్ నోటీసులు ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు, పన్ను నోటీసులను తాము వ్యతిరేకిస్తున్నామని, తమ ప్రయోజనాలు పరిరక్షించుకునేందుకు అన్ని మార్గాలు పరిశీలిస్తామని కెయిర్న్ ఇండియా పేర్కొంది. రెట్రాస్పెక్టివ్ ట్యాక్సులు (గత కాలపు డీల్స్‌ను తిరగదోడి పన్నులు విధించడం) బాధిత వొడాఫోన్ గ్రూప్, రాయల్ డచ్ షెల్ తదితర సంస్థల సరసన కొత్తగా కెయిర్న్ ఇండియా కూడా నిల్చినట్లయింది. ట్యాక్స్ నోటీసుల వార్తలతో శుక్రవారం బీఎస్‌ఈలో కెయిర్న్ ఇండియా షేరు 3 శాతం క్షీణించి రూ. 226 వద్ద ముగిసింది.