వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనం
పూర్తిగా షేర్లరూపంలోనే డీల్;
విలువ 2.3 బిలియన్ డాలర్లు
- కెయిర్న్ వాటాదారులకు 1:1 నిష్పత్తిలో వేదాంత షేర్ల కేటాయింపు
- రూ.10 ముఖవిలువగల వేదాంత ప్రిఫరెన్షియల్ షేరు కూడా
- విలీనానికి ఇరు కంపెనీల బోర్డులు ఓకే...
- దేశంలో అతిపెద్ద సహజ వనరుల
- కంపెనీగా నిలవనున్న వేదాంత!
ముంబై: దేశీ ప్రైవేటు మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్‌లో కెయిర్న్ ఇండియా విలీనం ఖరారైంది. ఈ రెండు కంపెనీల మాతృ సంస్థ అయిన అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూప్ తన రుణ భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ ఒప్పందానికి తెరతీసింది. పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో జరగనున్న ఈ డీల్ విలువ 2.3 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.15,000 కోట్లు). ఒప్పందానికి ఇరు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు ఆదివారం ఆమోదముద్ర వేశాయి. డీల్ ప్రకారం.. కెయిర్న్ ఇండియా వాటాదారులకు ఒక్కో షేరుకి ప్రతిగా ఒక వేదాంత షేరు లభించనుంది. అంతేకాకుండా రూ.10 ముఖ విలువ గల ఒక రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ షేరు(7.5 శాతం వడ్డీ ప్రకారం) దక్కుతుంది. మొత్తంమీద చూస్తే.. కెయిర్న్ ఇండియా గత శుక్రవారం నాటి షేరు ముగింపు ధర(రూ.180)తో పోలిస్తే కంపెనీ షేర్‌హోల్డర్లకు 7.3 శాతం మేర అధిక ధర(ప్రీమియం) లభిస్తున్నట్లు లెక్క. ఈ డీల్ ద్వారా భారత్‌లో అతిపెద్ద సహజవనరుల(విభిన్న విభాగాల్లో) కంపెనీగా వేదాంత అవతరించనుంది.
లండన్ స్టాక్‌ఎక్స్ఛేంజీలో లిస్టయిన మాతృ సంస్థ వేదాంత రిసోస్సెస్ పీఎల్‌సీకి వేదాంతలో ప్రస్తుతం 62.9 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఈ విలీన డీల్ పూర్తయితే ఈ వాటా 50.1 శాతానికి తగ్గనుంది. 2011లో కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాను దాదాపు 8.67 బిలియన్ డాలర్ల మొత్తానికి వేదాంత రిసోర్సెస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తమ కార్పొరేట్ స్వరూపాన్ని సరళీకరించే దిశగా 2013లో ప్రారంభించిన చర్యల్లో ఇది రెండో కీలక విలీన చర్యగా వేదాంత లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ అల్బనీస్ పేర్కొన్నారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2013లో సెసాగోవాను స్టెరిలైట్ ఇండస్ట్రీస్‌లో విలీనం చేసిన విషయం విదితమే. ఈ డీల్ తర్వాత సెసాస్టెరిలైట్‌గా మారిన విలీనకంపెనీ పేరు తదనంతరం వేదాంత లిమిటెడ్‌గా మార్పు చెందింది. కాగా, తాజా విలీన ఒప్పందం దీర్ఘకాలంలో వేదాంత వాటాదార్లకు మేలుచేకూర్చనుందని.. మరోపక్క, కెయిర్న్ ఇండియా షేర్‌హోల్డర్లకు కూడా ఇది మంచి డీల్‌గా అల్బనీస్ చెప్పారు. చమురు-గ్యాస్ రంగంలో కెయిర్న్ ఇండియాకు చాలా పటిష్టమైన బ్రాండ్ విలువ ఉందని.. విలీనం తర్వాత కూడా ఈ బ్రాండ్‌ను యథాతథంగా కొనసాగించనున్నట్లు అల్బనీస్ వెల్లడించారు. అంతేకాకుండా కంపెనీలో ఎలాంటి ఉద్యోగాల కోతలూ ఉండబోవని కూడా స్పష్టం చేశారు.
కెయిర్న్ నగదు నిల్వలే లక్ష్యం...
వేదాంత లిమిటెడ్‌కు దాదాపు 77,752 కోట్ల భారీ రుణ భారం ఉంది. దీంతోపాటు కెయిర్న్ ఇండియా నుంచి వేదాంత 1.25 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.8,000 కోట్లు) అంతర్గత రుణం కూడా తీసుకుంది. అయితే, దీనిపై అప్పట్లో ఇన్వెస్టర్ల నుంచి కొంత ప్రతికూలత కూడా ఎదురైంది. కాగా, ఇప్పుడు కెయిర్న్ ఇండియాను విలీనం చేసుకోవడం ద్వారా దానిదగ్గరున్న దాదాపు రూ.17,000 కోట్ల నగదు నిల్వలను రుణభారాన్ని కొంత మేర తగ్గించుకోవడానికి వేదాంత ఉపయోగించుకోనుంది. కెయిర్న్ ఇండియాకు ఇప్పుడు ఎలాంటి రుణాలు లేవు. అల్యూమినియం, కాపర్ ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్ కంపెనీగా వేదాంత లిమిటెడ్ నిలుస్తోంది. దేశీయంగా ఉన్న ఏడు బ్లాకుల్లో మూడింట్లో కెయిర్న్ ఇండియా చమురు-గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇదిలాఉండగా.. భారీగా నగదు నిల్వలున్న(దాదాపు రూ.31,000 కోట్లు) మరో సబ్సిడరీ హిందుస్థాన్ జింక్‌ను కూడా విలీనం చేసుకోవడానికి వేదాంత రిసోర్సెస్ సిద్ధంగా ఉంది. అయితే, దీనిలో ప్రభుత్వానికి 29.5 శాతం వాటా ఉండటంతో ఈ ప్రతిపాదన జాప్యమవుతూ వస్తోంది.
అనుమతులే కీలకం...
వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనానికి ఇప్పుడు వివిధ భాగస్వామ్య పక్షాలు, నియంత్రణపరమైన అనుమతులు కీల కంగా మారనున్నాయి. అయితే, వచ్చే ఏడాది మార్చి 31కల్లా డీల్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అల్బనీస్ తెలిపారు. కాగా, కెయిర్న్ ఇండియాలో 50 శాతం వాటా మైనారిటీ వాటాదారుల వద్ద ఉంది. ఇందులో దీని పూర్వపు మాతృ సంస్థ బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ(9.8 శాతం) ప్రధానమైనది. దీంతోపాటు మరో 9 శాతం వాటా ప్రభుత్వ రంగ బీమా అగ్రగామి ఎల్‌ఐసీకి చెందనుంది. డీల్ పూర్తవ్వాలంటే ఈ సంస్థల ఆమోదం తప్పనిసరి. విలీన ఒప్పందం ప్రతిపాదనను పూర్తిగా పరిశీలించిన తర్వాత తమ సంస్థ వాటాదారుల ప్రయోజనాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కెయిర్న్ ఎనర్జీ ప్రతినిధి ఈ డీల్‌పై వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ.. నియంత్రణ సంస్థ సెబీతో పాటు హైకోర్టు అనుమతి కూడా అవసరమే.
మరోపక్క, రాజస్థాన్‌లోని బామర్ ఆయిల్ బేసిన్, కేజీ బేసిన్‌లో రవ్వ చమురు-గ్యాస్ క్షేత్రంలోని కెయిర్న్ ఇండియా హక్కులను వేదాంతకు బదలాయించాలంటే కేంద్ర పెట్రోలియం శాఖ ఆమోదించాలి ఉంటుంది. ఇదిలాఉండగా.. గతం లో కెయిర్న్ ఎనర్జీ నుంచి వాటా కొనుగోలు డీల్‌లో కెయిర్న్ ఇండియా రూ.20,495 కోట్ల మేర పన్ను చెల్లించాలంటూ ఇప్పటికే ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాత లావాదేవీలను తిరగదోడి(రెట్రాస్పెక్టివ్) ఇలా పన్నులు వేయ డం పట్ల తాము చాలా విసుగు చెందామని.. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ప్రతిష్టకు నష్టం కలిగిస్తాయని వేదాంత చీఫ్ ఎగ్జిక్యూటివ్ అల్బనీస్ వ్యాఖ్యానించారు.