గత కొంత కాలంగా వేదాంత చైర్మన్ అనిల్‌అగర్వాల్ తన జీవిత అనుభవాలను ప్రజలతో పంచుకుంటున్నారు. బిజినెస్‌మేన్‌గా ఎదిగే క్రమంలో పడిన ఇబ్బందులు, ఎదురైన ఆటుపోట్లు ప్రజలకు వివరిస్తున్నారు. అందులో భాగంగా ముంబైలో అడుగుపెట్టినప్పుడు తాను కన్న కల నిజమైన క్షణాల్లో తాను పొందిన భావోద్వేగాన్ని ఆయన పంచుకున్నారు.
ఇంగ్లీష్ రాదు
ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల బాటలోనే పయణిస్తున్నారు అనే కంటే ఫ్యూయల్ సెక్టార్‌లో వాళ్లిద్దరికి గట్టి పోటీ ఇస్తున్నారు బిజినెస్‌మేన్ అనిల్ అగర్వాల్. వేదాంత కంపెనీ యజమానిగా గ్రీన్ ఎనర్జీ, రియల్ ఎస్టేట్, మెటల్, పవర్ జనరేషన్, ఆయిల్ ఇలా ఒకటేమిటి అనేక రంగాల్లో అడుగుపెట్టి విజయం సాధించాయన. పాట్నాను వదిలి ముంబైకి వచ్చినప్పుడు యస్, నో తప్ప మరో ముక్క ఇంగ్లీష్ ఆయనకు రాదు. కానీ నేడు రూ. 33.60 వేల కోట్లకు అధిపతి. చేతిలో చిల్లిగవ్వ లేని దశలో తన జీవితాన్ని మలుపు తిప్పిన ఓ సంఘటనను అనిల్ అగర్వాల్ ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు.
స్క్రాప్‌తో మొదలు
అనిల్ అగర్వాల్ స్వస్థలం పాట్నా. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ అనిల్ అగర్వాల్ ఒకే స్కూలు, ఒకే కాలేజీ. కానీ వంశపార్యంపరంగా వస్తున్న వ్యాపారం వదులకుని తన కలలు నిజం చేసుకునేందుకు ముంబైలో అడుగు పెట్టాడు అనిల్. కేబుల్ తయారీ కంపెనీల్లో మిగిలిపోయిన స్క్రాప్‌ను అమ్మే వ్యాపారంతో తన జీవితం ప్రారంభించాడు.
షంషేర్ కావాలనే కల
ఆ రోజుల్లో ముంబైలో కేబుల్ వ్యాపారంలో షంషేర్ స్టెర్లింగ్ కేబుల్ కంపెనీ చాలా ఫేమస్. ఆ కంపెనీకి సంబంధించిన స్క్రాప్‌ను అనిల్ అగర్వాల్ అమ్మేవాడు. ఎప్పుడైనా ఇలాంటి కంపెనీకి యజమాని కావాలనే కలలు కనేవాడు. ఈ క్రమంలో ఈ కంపెనీ బ్యాంకు రుణం చెల్లించలేక దివాళా తీయబోతుందనే సమాచారం అందింది అనిల్‌కి. షంషేర్ త్వరలో అమ్మకానికి వస్తుందని తెలిసినా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి.
ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్
డబ్బులు లేవని నిరాశ చెందలేదు అనిల్. ప్రతీరోజు బ్యాంకు దగ్గరికి, ఈ దిశాల కేసు చూస్తున్న లాయర్ దగ్గరికి, ఇంకా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని అనిల్ కలిసేవాడు. అలా రోజుల తరబడి చేసిన ప్రయత్నంతో షంషేర్ కంపెనీ కొనాలంటే తక్కువలో తక్కువ రూ.16 లక్షలు కావాలనే సమాచారం సేకరించగలిగాడు. అంత డబ్బు తన జీవితంలో ఎప్పుడు చూడలేదు. కానీ చేతిలో డబ్బు లేదనే సాకుతో ప్రయత్నం ఆపదలచుకోలేదు.
నిద్రలేని రాత్రులు
కంపెనీకి సంబంధించిన సమస్త సమాచారం తెలిసిన తర్వాత అతను కంటున్న కలలు అతనికి నిద్రను దూరం చేశాయి. మెలకవుతో కలలు కంటూనే ప్రణాళికలు రూపొందించాడు. రెగ్యులర్‌గా బ్యాంకు అధికారులను కలుస్తూ కొంత రుణం వచ్చేలా చేసుకోగలిగాడు. బ్యాంకు రుణం వస్తుందనే నమ్మకంతో బంధువుల దగ్గర అప్పు తెచ్చాడు. అలా కిందా మీద పడుతూ సొంతగా ఒక్క రూపాయి లేకపోయినా మొత్తానికి రూ.16 లక్షలు కూడబెట్టాడు అనిల్ అగర్వాల్.
టర్నింగ్ పాయింట్
తెలిసిన అన్ని మార్గాల ద్వారా పోగు చేసిన రూ. 16 లక్షల రూపాయల సొమ్ముతో 1976 మేలో షంషేర్ స్టెర్లింగ్ కంపెనీని సొంతం చేసుకున్నాడు అనిల్ అగర్వాల్. ఈ సందర్భంగా సంతకాలు చేస్తున్న సమయంలో కళ్ల వెంట నీళ్లు వచ్చాయని అదే సమయంలో విజయ గర్వంతో నవ్వు కూడా ఆపుకోలేకపోయానంటూ ఆనాటి ఉద్వేగభరిత క్షణాలను పంచుకున్నారు అనిల్ అగర్వాల్.
When you move forward, new doors open and you meet new people who come to help you. I discovered that when you try, really try to reach your dreams, then the universe works in mysterious ways to make it happen…(4/6)
— Anil Agarwal (@AnilAgarwal_Ved) March 21, 2022
ప్రయత్నిస్తేనే అద్భుతాలు
మనం ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తే తప్పకుండా కొత్త మార్గాలు కనిపిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు మన ప్రయత్నాలకు తమ వంతు సాయం అందిస్తారు. నా విషయంలో ఇది జరిగింది. మీరు ప్రయత్నించండి ప్రతికూల పరిస్థితుల మధ్య పట్టుదలతో వ్యవహరిస్తే మన కలను సాకారం చేసేందుకు ఊహించని పద్దతిలో ప్రకృతి కూడా సాయం చేస్తుంది. కాబట్టి కలలను నిజం చేసుకోండంటూ నేటి యువతలో ఆయన స్ఫూర్తి నింపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment