
న్యూఢిల్లీ: దేశీయంగా వివిధ లోహాలు, ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించిన విధానాలను సరళీకరించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక దిగ్గజం వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. మన దగ్గర లోహాలు, ఖనిజాల నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటిని దిగుమతి చేసుకునేందుకు భారీగా వెచ్చించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.
స్థానికంగా ఉత్పత్తి పెరిగితే అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం మనపై అంతగా ఉండదని, దేశీయంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు.. గణనీయంగా ఉద్యోగాలు కల్పించేందుకు ఇది తోడ్పడగలదని అగర్వాల్ చెప్పారు. దిగుమతి చేసుకునే ధరలో పావు వంతుకే భారత్‌లో ముడిచమురును ఉత్పత్తి చేయొచ్చని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా కమోడిటీల రేట్లు పెరగడం, రూపాయి మారకం విలువ పతనమవడం వంటి కారణాలతో క్రూడాయిల్ తదితర దిగుమతుల భారం పెరిగిన నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంధనాలు, ఖనిజాల అన్వేషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి కొత్త టెక్నాలజీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు.