
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ప్రమోటర్లపై ఆరోపణలు గుప్పించిన ఓసీసీఆర్‌పీ తాజాగా పారిశ్రామిక దిగ్గజం అనిల్ అగర్వాల్‌కి చెందిన కంపెనీలు వేదాంత, కెయిర్న్ ఇండియాను టార్గెట్ చేసింది. పర్యావరణ చట్టాలను అనుకూలంగా మార్చుకునేందుకు వేదాంత కోవర్టు లాబీయింగ్ నడిపినట్లు కొత్తగా మరో నివేదికలో ఆరోపించింది. ప్రభుత్వం కూడా ప్రజలను సంప్రదించకుండా నిబంధనల మార్పులను ఆమోదించి, ‘అక్రమ పద్ధతుల్లో’ అమలు చేసినట్లు పేర్కొంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్టు (ఓసీసీఆర్‌పీ) విడుదల చేసిన నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు..
► కొత్తగా పర్యావరణ అనుమతుల అవసరం లేకుండా దేశీయంగా ఉత్పత్తిని 50% వరకు పెంచుకునేందుకు మైనింగ్ కంపెనీలకు అనుమతినిస్తే ఆర్థిక వ్యవస్థ రికవరీ మరింత వేగవంతం కాగలదని 2021 జనవరిలో వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖ రాశారు.
► ‘‘2022 తొలినాళ్లలో పలు దఫాల సమావేశాల అనంతరం పర్యావరణ శాఖ నిబంధనలను సడలించింది. ప్రజాభిప్రాయాల సేకరణ నిర్వహించాల్సిన అవసరం లేకుండా మైనింగ్ కంపెనీలు 50 శాతం వరకు ఉత్పత్తిని పెంచుకునేందుకు అనుమతించింది’’ అని ఓసీసీఆర్‌పీ తెలిపింది.
► వేదాంత తరహాలోనే దాని అనుబంధ సంస్థ కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా వ్యవహరించింది. చమురు అన్వేషణ ప్రాజెక్టుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిబంధనను ఎత్తివేసేందుకు లాబీయింగ్ చేసింది.
► అధికార బీజేపీకి వేదాంత గణనీయంగా విరాళాలు కూడా ఇచి్చనట్లు (2016–2020 మధ్య కాలంలో రూ.43.5 కోటు)్ల ఆధారాలు ఉన్నాయని ఓసీసీఆర్‌పీ తెలిపింది.
వేదాంత స్పందన ఇదీ..
ఓసీసీఆర్‌పీ ఆరోపణలను నిర్దుష్టంగా ఖండించకుండా వేదాంత స్పందించింది. ‘దిగుమతులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి అనుకూలమైన విధానాల్లో దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనేది మా లక్ష్యం. దానికి అనుగుణంగా దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, సహజ వనరుల విషయంలో భారత్ స్వావలంబన సాధించడంలో తోడ్పాటు అందించే ఉద్దేశంతో ప్రభుత్వ పరిశీలన కోసం పలు విజ్ఞప్తులు చేశాము‘ అని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.