‘అదానీ గ్రూప్‌ సంస్థలతో ఏపీ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు’ | Adani Row: YSRCP Gives Clarity On AP Agreement With Adani Company, Check Out Complete Details Inside | Sakshi
Sakshi News home page

Adani Controversy: ‘అదానీ గ్రూప్‌ సంస్థలతో ఏపీ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు’

Published Fri, Nov 22 2024 7:00 AM | Last Updated on Fri, Nov 22 2024 9:28 AM

Adani Row: YSRCP Clarity On AP Agreement With Adani Company

7 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు సెకీతో ఒప్పందం

తేల్చిచెప్పిన వైఎస్సార్‌సీపీ

భారం మోపింది గత చంద్రబాబు సర్కారే!

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. సెకీ (సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)తో మాత్రమే ఒప్పందం చేసుకుందని, అదానీ గ్రూప్‌తో ఏపీ డిస్కమ్‌లు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది. విద్యుత్‌ కొనుగో­లుకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో వీసమెత్తు వాస్తవం లేదని తేల్చి చెప్పింది. 

ఈ మేరకు గురువారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను రైతులకు హక్కుగా కల్పించాలనే లక్ష్యంతో 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను అత్యంత చౌకగా యూ­ని­ట్‌ రూ.2.49 చొప్పున కొనుగోలుకు సెకీతో 2021 డిసెంబర్‌ 1న ఏపీ డిస్కమ్‌­లు ఒప్పందం చేసు­కు­న్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో వ్యవసా­యానికి ఉచిత విద్యుత్‌ రూపంలో ఏటా సుమారు 12,500 మిలియన్‌ యూనిట్లను డిస్క­మ్‌లు సరఫరా చేస్తాయని తెలిపింది. ఈ ఛార్జీలను డిస్కమ్‌లకు రాయితీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పింది. 

👉 గత చంద్రబాబు ప్రభుత్వం అనాలోచిత విధానాలతో చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్‌ సరఫరా ధర యూనిట్‌­కు రూ.5.10కి చేరింది. ఇది డిస్కమ్‌లపై తీవ్ర భారం పడటానికి దారి­తీసింది. దీని వల్ల ప్రభుత్వంపై రాయితీ భారం కూడా పెరిగింది.

👉ఈ సమస్యను పరిష్కరించేందుకు పది వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్‌ పార్క్‌లను అభివృద్ధి చేయా­లని 2020లో ప్రభుత్వం ప్రతిపాదించింది. 

👉ఈ క్రమంలో 2020 నవంబర్‌లో 6,400 మెవాగాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ టెండర్లు పిలిచింది. యూనిట్‌ రూ.2.49–­రూ.2.58 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొస్తూ 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్న­మవడం వల్ల ఆ టెండర్‌ ప్రక్రియ రద్దయింది.

👉అంతరాష్ట్ర విద్యుత్‌ సరఫరా ఛార్జీలు (ఐఎస్‌టీఎస్‌) మినహాయించి యూనిట్‌ రూ.2.49 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ సెకీ ప్రతిపాదించింది. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ.. సెకీ. 2019 జూన్‌ 25న నిర్వహించిన టెండర్ల ద్వారా ఏర్పాటైన సౌర విద్యుత్‌ కేంద్రాల నుంచి సెకీ విద్యుత్‌ కొనుగోలు చేస్తుంది. 

👉ఈ నేపథ్యంలోనే యూనిట్‌ రూ.2.49 చొప్పున ఏడు వేల మెగావాట్ల విద్యుత్‌ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో 2024–25లో మూడు వేలు, 2025–26లో మూడు వేలు, 2026–27లో వెయ్యి మెగావా­ట్లను అంతర్రాష్ట్ర విద్యుత్‌ సరఫరా ఛార్జీలను మినహాయించుని సరఫరా చేయడానికి సెకీ అంగీకరించింది. ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్‌ 11న ఏపీఈఆర్‌సీ ఆమోదించింది. ఆ తర్వాత 2021 డిసెంబర్‌ 1న విద్యుత్‌ కొనుగోలుకు సెకీతో డిస్కమ్‌లు ఒప్పందం చేసుకున్నాయి. 

👉సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి అత్యంత చౌకగా విద్యుత్‌ అందు­బాటులోకి వస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.3,700 కోట్ల మేర ఆదా అవుతుంది. 25 ఏళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉండటం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదా అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement