
సుస్థిర అభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదిశగా కీలక అడుగు వేసింది. కాలుష్యంలేని ఇంధనం ఉత్పత్తే లక్ష్యంగా రెండు మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకోసం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ రెండు ప్రాజెక్టులను అదానీ గ్రీన్ ఎనర్జీ నెలకొల్పనుంది. ఇందులో 3,700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుకాగా, 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు.
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఈరెండు ప్రాజెక్టులు అత్యంత కీలకం కానున్నాయి. రెండు ప్రాజెక్టులకోసం దాదాపుగా రూ.60వేల కోట్ల రూపాయలను ఖర్చుచేయనున్నట్టు ఎంఓయూలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు రాకతో రాష్ట్రంలో 10వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
డబ్ల్యూఈఎఫ్ సదస్సు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న అదానీతో సమావేశమయ్యారు. వరుసగా రెండోరోజుకూడా సమావేశమై ఈ ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి, సీఎం వైఎస్ జగన్, అదానీ గ్రూపు సంస్థల అధిపతి గౌతం అదానీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్‌చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, అదానీ గ్రీన్ ఎనర్జీ తరఫున ఆశిష్ రాజ్‌వంశీ ఎంఓయూపై సంతకాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment