వేదాంత లాభం17 శాతం వృద్ధి
• క్యూ2లో రూ.1,251 కోట్లుఆదాయంలో తగ్గుదల
• స్టీల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు సిద్ధమని ప్రకటన
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 1,251 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.1,069 కోట్లతో పోలిస్తే లాభంలో 17 శాతం వృద్ధి నమోదైంది. నిర్వహణ పనితీరు మెరుగుపడడం లాభాల వృద్ధికి కారణమైంది. ఆదాయం మాత్రం రూ.18,898 కోట్ల నుంచి రూ.18,029 కోట్లకు పడిపోయింది. భవిష్యత్తులో స్టీల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు సిద్ధమని కంపెనీ ప్రకటించింది.
నిర్వహణ పనితీరు కారణంగానే అధిక లాభం వచ్చినట్టు వేదాంత ప్రెసిడెంట్ (ఫైనాన్స్), గ్రూపు సీఎఫ్‌వో జీఆర్ అరుణ్‌కుమార్ వెల్లడించారు. అధిక ఇబిటా, మంచి ధరలు కూడా కలసివచ్చినట్టు చెప్పారు. కాగా, భారత్‌లో భవిష్యత్తులో స్టీల్ డిమాండ్ పెరిగితే తమ వ్యాపారానికి అదనపు విలువ చేకూర్చేందుకు వీలుగా ఆ అవకాశాలను పరిశీలిస్తామని వేదాంత లిమిటెడ్ సీఈవో టామ్ ఆల్బనీస్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం తమ ఐరన్‌వోర్ వ్యాపారం చాలా బలంగా ఉందని, ఈ దృష్ట్యా ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తామన్నారు. భారత్ 8-9 శాతం వృద్ధిని పదేళ్లపాటు నమోదుచేస్తే పెద్దఎత్తున స్టీల్‌ను వినియోగించే దేశంగా మారుతుందని వివరించారు.