క్యూ2లో 10 శాతం పెరిగిన ఐటీసీ లాభం
• క్యూ2లో రూ.2,500 కోట్లు
• కలసివచ్చిన సిగరెట్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: సిగరెట్ల అమ్మకాలు అధిక స్థాయిలో ఉండడంతో ఐటీసీ లిమిటెడ్ స్టాండలోన్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 10% వృద్ధి చెంది రూ.2,500 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం రూ.2,262 కోట్లుగా ఉంది. ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.13,616 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.12,611 కోట్లు. ఈ మేరకు ఐటీసీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. కేవలం సిగరెట్లు, ఎఫ్‌ఎంసీజీ ద్వారా ఆదాయం 8.51 శాతం వృద్ది చెంది రూ.11,200గా నమోదైంది.
కేవలం సిగరెట్ల విక్రయాల ద్వారా ఆదాయం 7 శాతం పెరిగి రూ.8,528 కోట్లుగా నమోదైంది. ఇన్‌పుట్ వ్యయం పెరిగిపోవడం, అమ్మకాలపై ఒత్తిళ్లు, ఎఫ్‌ఎంసీజీ రంగంలో డిమాండ్ మందగించడం వంటి సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచినట్టు ఐటీసీ తెలిపింది. రెండో త్రైమాసికంలో ఇబిటా 7.3 శాతం వృద్ధి చెందింది. మార్జిన్ల శాతం 26.8 శాతం నుంచి 26.7 శాతానికి తగ్గింది. ఐటీసీ హోటల్స్ వ్యాపారం 2.50 శాతం వృద్ధి సాధించింది. హోటల్స్ ద్వారా రూ.297 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అగ్రి వ్యాపారం ద్వారా ఆదాయం 2 శాతం వృద్ధితో రూ.1,880కోట్లుగా నమోదైంది. పేపర్ బోర్డ్, పేపర్, ప్యాకేజింగ్ ద్వారా వచ్చిన ఆదాయం పెద్దగా మార్పు ఏమీ లేకుండా రూ.1,331 కోట్లుగా నమోదైంది.