
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరం(2025–26)లో రూ. 1,100 కోట్ల నికర లాభం ఆర్జించగలమని ట్రావెల్ టెక్ స్టార్టప్ ఓయో అంచనా వేసింది. ఈ బాటలో రూ. 2,000 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించగలమని భావిస్తున్నట్లు యూనికార్న్ సంస్థ ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇందుకు ఆదాయంలో వృద్ధి దోహదపడగలదని అభిప్రాయపడ్డారు.
ఇటీవల కొనుగోలు చేసిన మోటెల్ 6 తాజా అంచనాలకు దన్నుగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఈ కాలంలో మోటెల్ 6 ఇబిటా రూ. 630 కోట్లకు చేరగలదని ఓయో ఊహిస్తోంది. ఓయో కొనుగోలు చేశాక తొలిసారి మోటెల్ 6 పూర్తి ఏడాది పనితీరును వెల్లడించనుంది. వెరసి ఓయో సంయుక్త ఇబిటా రూ. 2,,000 కోట్లను తాకనున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో ఓయో రూ. 166 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో నమోదైన రూ. 25 కోట్లతో పోలిస్తే నికర లాభం ఆరు రెట్లు ఎగసింది. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) రూ. 457 కోట్ల నికర లాభం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ. 111 కోట్ల నష్టం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment