నాటు కోళ్లు, జాతి (పందెం) కోళ్ల పెంపకం మారుమూల గ్రామాల్లో సైతం రైతుకు ఆధారపడదగినంత స్థాయిలో నిరంతర ఆదాయాన్ని అందిస్తుందని ఓ యువజంట రుజువు చేస్తున్నారు. గత పదేళ్లుగా శ్రద్ధగా ఈ పని చేస్తే ప్రజలకు ఆరోగ్యదాయకమైన మాంసం, గుడ్లను అందించటంతోపాటు స్వగ్రామంలోనే స్వయం ఉపాధి కల్పించుకుంటున్నారు రైతు దంపతులు ఉపేందర్‌రావు, జ్యోతి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడేనికి చెందిన నిరుద్యోగులైన మూలగుండ్ల ఉపేందర్‌రావు, వజ్జా జ్యోతి పదేళ్ల క్రితం ఇంటి వద్ద ఒక షెడ్డును ఏర్పాటు చేసుకొని నాటు, పందెం కోళ్ల పెంపకం చేపట్టారు. చుట్టూ కోళ్ల ఎగిరి పోకుండా ఎత్తు జాలీ ఏర్పాటు చేశారు. నీడ కోసం పరిసర ప్రాంతంలో వివిధ రకాల చెట్లను పెంచారు.
కోళ్ల మధ్యకు మాములు రాకుండా చూసేందుకు సీమ కోళ్లను, రెండు కుక్కలను పెంచారు. కొన్నేళ్ల క్రితం 20 జాతి (పందెం) కోడి పిల్లలను పలు ప్రాంతాల నుంచి సేకరించి పెంచటం మొదలుపెట్టారు. వీటి గుడ్లను సాధారణ కోళ్లకు వేసి పొదిగించి పిల్లలు తీసి సంతతిని పెంచారు. తదనంతరం ఇంక్యుబేటర్‌ను సమకూర్చుకొని పందెం కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. పిల్లల సైజును బట్టి వివిధ ధరలకు అమ్ముతున్నారు.
8 రకాల జాతి కోళ్లు
కోళ్లను 24 గంటలూ కనిపెట్టుకొని ఉండి అన్ని పనులూ ఉపేందర్‌రావు, జ్యోతి చేసుకుంటారు. వీరి వద్ద మార్కెట్‌లో మార్కెట్‌లో గిరాకీ ఉన్న నెమలి, కాక, డేగ, రసంగి, అబ్రాస్, సీత్వాల్, కెక్కర, ఎర్ర కెక్కర వంటి అనేక రకాల జాతి కోళ్లను వీరు పెంచుతున్నారు. రెండు వందల పెట్టలు, పుంజులు ఉన్నాయి.
ఇవి దాణా కంటే ఆకుకూరలను ఎక్కువగా తింటున్నాయి. ఇంటి పరిసరాల్లో పలు రకాల ఆకుకూరలను,మునగాను పెంచి వీటికి మేపుతున్నారు. ఫామ్ హౌస్ యజమానులు జాతి కోళ్లను ఆసక్తితో పెంచుతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేసుకెళుతున్నారు. కిలో బరువు గల జాతి కోడి రూ. 4 నుంచి 5 వేలు పలుకుతోంది. నెలలోపు చిన్న పిల్లలైతే రూ. 300 వరకు పలుకుతోందని ఉపేందర్ రావు తెలిపారు.
మునగాకుతో జబ్బులకు చెక్!
మొదట్లో కడక్‌నా«ద్ కోళ్ల పెంపకం చేపట్టాం. మారుమూల ప్రాంతం కావటంతో వాటికన్నా జాతి (పందెం) కోళ్ల పెంపకంతోనే అధిక ఆదాయం వస్తోంది. జాతి కోడిగుడ్లను ఇంక్యుబేటర్ ద్వారా పోదిగించి పిల్లలను అమ్మటం వల్ల మంచి ఆదాయం పొందుతున్నాం. రెండు, మూడు సార్లు మందులు వాడితే ఈ కోళ్లకు ఎలాంటి జబ్బులు రావు. ముఖ్యంగా మునగ ఆకు తినిపిస్తే కోళ్లకు జబ్బులు వచ్చే ఛాన్సే లేదని ఉపేందర్‌రావు(95023 48987) అనుభవపూర్వకంగా చెబుతున్నారు.
– ఇల్లెందుల నాగేశ్వరరావు, సాక్షి, ఇల్లెందు
(చదవండి: పాదాల నొప్పి తగ్గడానికి పొట్టలోని కొవ్వును ఇంజెక్ట్ చేస్తే చాలు!!)
Comments
Please login to add a commentAdd a comment