
వేదాంత
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంత ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.2,173 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.2,133 కోట్లు)తో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించామని వేదాంత తెలిపింది. ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని వేదాంత సీఈఓ కుల్దీప్ కౌర్ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.21,405 కోట్ల నుంచి 19 శాతం వృద్ధి చెంది రూ.24,934 కోట్లకు పెరిగిందని వివరించారు. అల్యూమినియమ్ వ్యాపారం పునర్వ్యవస్థీకరణ, జింక్ ఇంటర్నేషనల్ విక్రయాలు అధికంగా ఉండడం తదితర అంశాల కారణంగా ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు.
క్యూ4లో మరింత జోరు..
కంపెనీ ఆర్థిక స్థితిగతులను పటిష్టంగా కొనసాగిస్తున్నామని, మూలధన కేటాయింపుల ప్రణాళికకు కట్టుబడి ఉన్నామని కుల్దీప్ పేర్కొన్నారు. నాలుగో క్వార్టర్‌లో మరింత మెరుగైన ఫలితాలను సాధించనున్నామని, మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో నగదు నిల్వలు పుష్కలంగా ఉండనున్నాయని వివరించారు. ఈ క్యూ3లో ఇబిటా 13 శాతం వృద్ధితో రూ.6,780 కోట్లకు పెరిగిందని, కమోడిటీ ధరలు అధికంగా ఉండటం కలసివచ్చిందని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి స్థూల రుణ భారం రూ.55,218 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. నికర రుణ భారం రూ.16,295 కోట్లుగా ఉందని, క్వార్టర్ ఆన్ క్వార్టర్‌తో పోల్చితే పెరిగిందని తెలిపారు. అవాన్‌స్ట్రాటే కంపెనీని కొనుగోలు చేశామని, అయితే ఈ క్యూ3లో నగదు నిల్వలు పటిష్టంగా ఉండడంతో ఈ కంపెనీ కొనుగోలు ప్రభావం ఒకింత తగ్గిందని వివరించారు. నిర్వహణ మార్జిన్ 30.2 శాతం నుంచి 27.8 శాతానికి తగ్గిందని తెలిపారు. ఇనుప ఖనిజం వ్యాపార ఆదాయం 42 శాతం తగ్గగా, అల్యూమినియమ్ వ్యాపారం ఆదాయం 69 శాతం, రాగి వ్యాపార ఆదాయం 8 శాతం చొప్పున పెరిగాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో వేదాంత షేర్ 0.2 శాతం నష్టంతో రూ.340 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment