న్యూఢిల్లీ: భారత్‌లో సెమీకండక్టర్ల ప్లాంటు నెలకొల్పేందుకు దేశీ దిగ్గజం వేదాంతతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ (జేవీ) నుంచి హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) తప్పుకుంది. మరిన్ని వైవిధ్యమైన అవకాశాలను అన్వేషించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘పరస్పర అంగీకారం మేరకు, వేదాంతతో జాయింట్ వెంచర్ విషయంలో ముందుకు సాగరాదని నిర్ణయించుకున్నాం.
వేదాంత యాజమాన్యంలోని సంస్థకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు. మా పేరును జోడించి ఉంచడం వల్ల గందరగోళానికి దారి తీస్తుంది కాబట్టి దాన్ని తొలగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం‘ అని ఫాక్స్‌కాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా ఆకాంక్షల సాకారానికి పూర్తి తోడ్పాటు అందిస్తామని, స్థానిక అవసరాల మేరకు భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని పేర్కొంది.
తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్ ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్, వేదాంత .. గుజరాత్‌లో దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దేశీయంగా తొలి సెమీకండక్టర్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు గతేడాది జేవీ కుదుర్చుకున్నాయి. ఏడాది పైగా దీనిపై కసరత్తు చేశాయి. సాంకేతిక భాగస్వామిగా యూరప్ సంస్థ ఎస్‌టీ మైక్రోఎలక్ట్రానిక్స్‌తో జట్టు కట్టేందుకు ప్రయత్నించినా చర్చలు ముందుకు సాగలేదు. దీంతో ప్రస్తుతం వేదాంత–ఫాక్స్‌కాన్ జేవీకి బ్రేక్ పడింది.
ఫోన్లు, ఫ్రిజ్‌లు, కార్లలో ఉపయోగించే చిప్‌లు కేవలం కొన్ని దేశాల్లోనే తయారవుతున్నాయి. భారత్ కూడా చిప్‌ల తయారీలోకి ప్రవేశించడంపై దృష్టి పెట్టి ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనికి స్పందనగా వేదాంత–ఫాక్స్‌కాన్, ఐఎస్‌ఎంసీ, ఐజీఎస్‌ఎస్ దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, వేదాంత జేవీ మినహా మిగతా రెండింటి విషయంలో పెద్దగా పురోగతి లేదు.
ప్రాజెక్టుకు కట్టుబడి ఉన్నాం..
కాగా సెమీకండక్టర్ ప్రాజెక్టుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని వేదాంత స్పష్టం చేసింది. చిప్ ప్లాంటు ఏర్పాటులో భాగస్వాములయ్యేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ‘సెమీకండక్టర్ల విషయంలో ప్రధాని విజన్‌ను సాకారం చేసేందుకు, మరింతగా కృషి చేస్తాం’ అని వేదాంత పేర్కొంది.
సైయంట్ డీఎల్‌ఎం లిస్టింగ్ భళా
ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్విసుల కంపెనీ సైయంట్ డీఎల్‌ఎం భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 265తో పోలిస్తే బీఎస్‌ఈలో 51 శాతం ప్రీమియంతో రూ. 401 వద్ద లిస్టయ్యింది. ఆపై ఒక దశలో 61% దూసుకెళ్లి రూ. 426ను అధిగమించింది. చివరికి 59 శాతం(రూ. 156) లాభంతో రూ. 421 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో సైతం రూ. 403 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 427 వరకూ ఎగసి చివరికి రూ. 422 వద్ద స్థిరపడింది. వెరసి రూ. 157 లాభంతో ముగిసింది.
భారత్ లక్ష్యాలపై ప్రభావం ఉండదు
వేదాంతతో జేవీ నుంచి ఫాక్స్‌కాన్ వైదొలగడమనేది భారత్ నిర్దేశించుకున్న చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఏర్పాటు లక్ష్యాలపై ప్రభావం చూపబోదు. – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment