సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకూడిలో కాలుష్యానికి కారణమవుతున్న వేదాంత స్టెరిలైట్ కాపర్ కంపెనీని 1996లో ఏర్పాటు చేశారు. రోజుకు 1200 టన్నుల అనోడ్స్ (విద్యుత్ గ్రాహక రాగి రాడ్లు)ను ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతమున్న ఈ సామర్థ్యాన్ని కంపెనీ రెండింతలు చేయాలనుకుంటోంది. దీని వల్ల అధిక సాంద్రత గల అక్కడి జనాభాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. కంపెనీకి పది కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో ఎనిమిది పట్టణాలు, 27 గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 4.6 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కంపెనీ నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, రేణువులు కాలుష్యానికి కారణం అవుతున్నాయని ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావం అంచనా నివేదిక 2015 సంవత్సరంలోనే వెల్లడించింది. కంపెనీ కారణంగా నీరు, వాయు కాలుష్యం ఏర్పడుతోందని గత రెండు దశాబ్దాలుగా స్థానిక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కొన్నేళ్ల వరకు కంపెనీ నుంచి కాలుష్యం ప్రభావాన్ని తాము అంచనా వేయలేకపోయామని, కొన్నేళ్ల క్రితం నుంచే ఆ ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్యం కారణంగా ప్రతి ఇంటిలో కనీసం ఇద్దరు అస్వస్థులవుతున్నారని, ముఖ్యంగా పిల్లలపై కాలుష్యం ప్రభావం ప్రాణాంతకంగా ఉంటోందని వారు చెబుతున్నారు.
కంపెనీని మరింత విస్తరిస్తున్నట్లు సమీపంలోని కుమారెడ్యార్‌పురం గ్రామస్థులకు ముందుగా తెల్సింది. మొదట చిన్న స్థాయిలో ప్రజల నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అవి ఊపందుకున్నాయి. మంగళవారం నాడు తూత్తుకూడిలో వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శన జరిపారు. అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టాలని నెల రోజుల క్రితమే నిర్ణయించామని, ఈ విషయం కలెక్టర్‌కు తెలిసి ఆయన ఆదివారం నాడు తమతో శాంతి చర్చలు జరిపారని సెల్వరాజ్ అనే స్థానికుడు తెలిపారు. తమకు కావాల్సింది శాంతి కాదని, కంపెనీ విస్తరణను అడ్డుకోవడమే ముఖ్యమంటూ తాము కలెక్టర్‌కు కూడా స్పష్టం చేశామని సుందరరామమూర్తి అనే మరో గ్రామస్థుడు తెలిపారు.
ఆదివారం నాడు కలెక్టర్ శాంతి సమావేశాన్ని నిర్వహించిన తర్వాత కూడా మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలియజేయాలని గ్రామస్థులు నిర్ణయించారని వారు తెలిపారు. అందుకు కలెక్టర్ కార్యాలయంలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమావేశం అయ్యేందుకు కూడా ముందుగా కలెక్టర్ కార్యాలయం అనుమతి ఇచ్చిందని వారు తెలిపారు. ఆ తర్వాత అనూహ్యంగా సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారని వారు తెలిపారు. శాంతియుతంగానే తాము కలెక్టర్ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లాలని అనుకున్నామని, హింసాకాండకు దిగాలన్న ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని వారు చెప్పారు.
కలెక్టర్ కార్యాలయానికి పది కిలోమీటర్ల దూరంలోనే పిల్లాపాపలతో సహా వేలాది మంది ప్రజలు గుమిగూడారని, అక్కడి నుంచే పోలీసు బారికేడ్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతోనే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని, అది చివరకు పోలీసు కాల్పులదాకా వెళ్లిందని గ్రామస్థులు వివరించారు. వారు కాల్పుల్లో మరణించిన వారి ఫొటోలను మీడియాకు చూపించారు. వారిలో ఎక్కువ మందికి కడుపులో, పొత్తి కడుపులో బుల్లెట్లు దిగిన గాయాలున్నాయి. ప్రస్తుతం అక్కడ వాడవాడలా పోలీసు బందోబస్తు కనిపిస్తోంది. కలెక్టర్‌గానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ మీడియాకు అందుబాటులో లేరు.
Comments
Please login to add a commentAdd a comment