తూత్తుకూడిలో ఈనెల 22వ తేదీన అత్యాధునిక తుపాకీతో కాల్పులు జరుపుతున్న పోలీసు (ఫైల్)
తమిళనాడులోని దక్షిణాది జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్న పోలీసు కాల్పుల వెనుక హృదయాంతరాలను తడిచేసే కన్నీటిగాథలు దాగి ఉన్నాయి. సమస్యల పరిష్కారంపై సాగుతున్న ఆందోళనల్లో అమాయకులే అధికశాతం అశువులు బాస్తున్నారు. దక్షిణాది జిల్లాలో చోటుచేసుకున్న పెద్ద సంఘటనల్లో మూడోదిగా చరిత్రకెక్కిన తూత్తుకూడిలో పోలీసు కాల్పులు ఇందుకు మినహాయింపు కాదు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: కరువు కాటకాలు, నిరుద్యోగం, కుల, మత, జాతి విధ్వేషాలు వంటి కారణాలతో ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలను అణిచివేసే క్రమంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం విధ్వంసాలకు దారితీస్తోంది. విధ్వంసాలు వికటించి ఆమాయకులు అర్ధాయుష్షులుగా మరణిస్తున్నారు. వేతనాలు పెంచాలని కోరుతూ తిరునెల్వేలిలోని తేయాకు తోటల కార్మికులు 1999 జూలై 23వ తేదీన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు చేసిన లాఠీచార్జి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో కొందరు తామిరభరణి నదిలోకి దూకారు. ఒకటిన్నర ఏడాది వయసు చిన్నారి విఘ్నేష్‌తోపాటు మొత్తం 16 మంది నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు కలుపుకుని సుమారు 500 మంది గాయపడ్డారు. తిరువారూరు జిల్లా పరమకుడిలో 2011 సెప్టెంబరు 11వ తేదీ జరిగిన ఇమ్మానువేల్ గురుపూజ ప్రజల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ సమయంలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. అలాగే ఇటీవల తూత్తుకూడిలో స్టెరిలైట్ ఆందోళనలు 13 మందిని పొట్టనపెట్టుకున్నాయి.
తాజా కాల్పుల్లోనూ కన్నీటి వెతలు
తూత్తుకూడిలో ఆందోళనకారుల్లో విధ్వంసాలు సృష్టించేవారే లక్ష్యంగా గురిపెట్టిన తుపాకులు అమాయకుల ప్రాణాలను బలిగొన్న కన్నీటి గాథలు వెలుగులోకి వస్తున్నాయి. తూత్తుకూడి అన్నైవేళాంగణి నగర్‌లో నివసించే సెల్వరాజ్ (46) జిల్లాకలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఒక ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అతని కుమార్తె జెన్నిఫర్ ఇటీవలే పుష్పవతి కావడంతో బంధుమిత్రుల మధ్య వేడుక జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈనెల 22వ తేదీన సెల్వరాజ్ ఆఫీసుకు వెళుతూ.. ‘సాయంత్రం ముందుగా వస్తాను, ఇద్దరం కలిసి బంధువులకు ఆహ్వానపత్రికలు పంచుతాం’ అని భార్యతో చెప్పి బయలుదేరాడు. సాయంత్రం విధులు ముగించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదుగా ఇంటికి వస్తుండగా పోలీసు తూటా సెల్వరాజ్ గుండెను చీల్చేసి ప్రాణాలను హరించింది. పదోతరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వెనిస్టా (17) అనే బాలిక కూడా ప్రాణాలు కోల్పోయింది. అలాగే గ్రేస్‌పురానికి చెందిన ప్రభు (36) అనే మత్స్యకారుడు పొరపాటున నిరసనకారుల మధ్య చిక్కుకున్నాడు. లాఠీదెబ్బలు, తూటా గాయాలతో రక్తం ఓడుతూ ఇంటికి చేరిన అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
రబ్బర్ తూటాల మాటేమిటి
ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలు మానవహక్కులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ చట్టాలను కఠినంగా మార్చడంతోపాటు ఖచ్చితంగా అమలు చేస్తున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడినపుడు తప్పనిసరై కాల్పులు జరపాల్సివచ్చినా ముందుగా రబ్బర్ తూటాలను ప్రయోగిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా అందోళనలు జరిగినపుడు, రష్యా తదితర దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చోటుచేసుకున్నపుడు రబ్బర్ తూటాలనే వినియోగించారు. రబ్బర్ తూటాలు శరీరంలోకి ప్రవేశించినా గాయాలు తగులుతాయేగానీ ప్రాణాపాయం ఏర్పడదు. పైగా రబ్బర్ తుటాలను ఎన్ని రౌండ్లయినా ప్రయోగించవచ్చు, బుల్లెట్లకు పరిమితి ఉంటుంది. ఇటీవలి కాలంలో భారత్‌లో రబ్బర్ తూటాలను వాడుతున్నారు. ముఖ్యంగా ఘర్షణలకు నెలవైనా జమ్మూ కాశ్మీర్‌లో పోలీసులు, ఇతర భద్రతా దళాలు సరిహద్దు ఆందోళన కారులపై రబ్బర్ తుటాలనే ప్రయోగిస్తున్నారు. మరి ఇలాంటి వెసులుబాటు ఉండగా తూత్తుకూడి ఆందోళనల్లో రబ్బర్ తూటాలను ఎందుకు వినియోగించలేదనే ప్రశ్న తలెత్తింది. పైగా కిలోమీటరు దూరం వరకు బుల్లెట్ దూసుకుపోగల ఏకే 47, తదితర అత్యాధునిక తుపాకులను తూత్తుకూడి కాల్పులకు వినియోగించినట్లు సమాచారం. కాల్పులు జరిగి మూడురోజులైనా తూత్తుకూడిలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. వాహనాలు తిరగడం లేదు. అంగళ్లు తెరుచుకోలేదు. ప్రజలు స్వేచ్ఛగా బయటతిరిగే పరిస్థితి లేదు. పైగా స్టెరిలైట్, తుపాకీ కాల్పులపై నిరసనలు రాష్ట్రం నలుమూలకు పాకాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర బలగాలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. మరోసారి కాల్పులు చోటుచేసుకుంటే అమాయకుల ప్రాణాల మాటేమిటనే భయాందోళనలు నెలకొన్నాయి.
సుమోటా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
తూత్తుకూడి కాల్పుల ఘటన దేశం మొత్తాన్ని కదిలించివేయగా జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ కాల్పుల ఘటనను సుమోటాగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ర్యాలీగా వెళుతున్న వారిపై తుపాకీ కాల్పులకు ఆదేశించింది ఎవరు, కాల్పులకు ముందు హెచ్చరికలు జారీచేశారా, తుపాకీ కాల్పుల్లో నిబంధనలను పాటించారా అనే మూడు ప్రధాన ప్రశ్నలను కమిషన్ సంధించింది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిందంటే కాల్పుల సమయంలో నిబంధన ఉల్లంఘనను ఊహించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment