సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకుడిలో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయాసపడుతోంది. వేదాంత స్టెరిలైట్ కంపెనీ విస్తరణను వ్యతిరేకిస్తూ మంగళవారం ప్రజలు జరిపిన నిరసన ప్రదర్శన హింసాకాండకు దారితీయడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ రోజు 11 మంది మరణించడం కొన్ని వందల మంది గాయపడడం తెల్సిందే. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపక తప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటోందిగానీ, పోలీసుల అనుచిత చర్యను సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలతోపాటు సోషల్ మీడియా తీవ్రంగా ఖండిస్తోంది. పోలీసుల రాక్షసత్వాన్ని ఎండగడుతూ పలు మీడియాలో కార్టూన్లు దర్శనమిస్తున్నాయి.
పోలీసులు జరిపిన కాల్పులకు సంబంధించిన వీడియో దృశ్యాలను చూస్తూంటే వారి అనాగరిక చర్య, అనుచిత ప్రవర్తన స్పష్టంగా కనిపిస్తోంది. ఓ పోలీసు వ్యాన్‌పై పడుకొని ఓ పోలీసు జవాను ప్రదర్శకులపైకి తుపాకీ ఎక్కుపెట్టడం, ‘కనీసం ఒక్కరైనా చావాల్సిందే’నంటూ మరో పోలీసు వ్యాఖ్యానించడం వీడియో దృశ్యాల్లో స్పష్టంగా వినిపించింది. మరోచోట తీవ్ర గాయాలపాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడి చుట్టూ పోలీసులు ఉన్నా అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ‘నటించకు, లే’ అంటూ హేళన చేశారు. కలియప్పన్ అనే ఆ 22 ఏళ్ల యువకుడిని ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మరణించారు.
కాల్పుల్లో మరణించిన వారి ముఖాలపై, మొండాలపైనే ఎక్కువగా బుల్లెట్ గాయాలున్నాయంటూ సామాజిక కార్యకర్తలు చూపిన ఫొటోలు ‘పరిస్థితిని అదుపుచేసేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు’ ఏవీ పోలీసులు పాటించలేదనే విషయాన్ని సూచిస్తున్నాయి. విధ్వంసానికి దిగిన గుంపును చెదరగొట్టేందుకు ముందుగా పోలీసులు లాఠీఛార్జి చేయాలి. పరిస్థితి అదుపులోకి రాకపోతే భాష్పవాయువు గోళాలను ప్రయోగించాలి. అయినా ఫలితం లేకపోతే గాలిలోకి కాల్పులు జరపాలి.
అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఆందోళనాకారుల పాదాలు, కాళ్లకు తగిలేలా మాత్రమే కాల్పులు జరపాలి. లాఠీచార్జి చేసినా ఫలితం లేనప్పుడు భాష్ప వాయువు గోళాలను, వాటర్ క్యానన్లు ఉపయోగించాలని, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే రబ్బర్ బుల్లెట్లు కాల్చాలని, అవసరమైతే పెల్లెట్ గనులు ఉపయోగించాలని, పెల్లెట్ గున్నుల వల్ల మనుషులు గాయపడతారు తప్ప చనిపోరని తమిళనాడు మాజీ డీజీపీ ఆర్. నటరాజ్ వివరించారు. తూత్తుకుడిలో ముందుగా ప్రజలు రెచ్చిపోయి హింసాకాండకు దిగలేదని, తొలుత దారిని అడ్డుకున్న పోలీసులపైకి రాళ్లు మాత్రమే రువ్వారని, పోలీసులు ఎకాఎకి కాల్పులు జరపడంతోనే ప్రజలు రెచ్చిపోయారని స్థానికులు చెబుతున్నారు. తమిళనాడు కాల్పుల సంఘటనను జాతీయ మానవ హక్కుల సంఘటనను తనంతట తానే తీవ్రమైన అంశంగా పరిగణించి తమిళనాడు ప్రభుత్వానికి, పోలీసు శాఖకు నోటీసులు జారీ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment