చెన్నై : సూపరస్టార్ రజనీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రాంతాలకతీతంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈ ‘బాషా’ పాపులారిటీ గురించి 1989లో వచ్చిన ‘రాజా చిన్న రోజ’ సినిమాలో ఒక పాట ఉంది. ఆ పాటలో ‘సూపర్‌స్టార్ ఎవరని చిన్న పిల్లలను అడిగిన సమాధానం చెప్తారు’ అనే చరణం అప్పట్లో బాగా పాపులర్. అయితే తూత్తుకుడికు చెందిన సంతోష్ కుమార్(21) ఆ సినిమా విడుదల నాటికి ఇంకా పుట్టలేదేమో అందుకే ఏకంగా సూపర్‌స్టార్‌ను పట్టుకుని ‘ఎవరు నువ్వు...?’ అంటూ ప్రశ్నించాడు. అందుకు సూపర్ స్టార్ ‘నేను రజనీకాంత్‌ను...’ అంటూ పరిచయం చేసుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూత్తుకుడి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన రజనీని ఓ యువకుడు ‘ఎవరు మీరు..?’ అని ప్రశ్నించాడు. అందుకు ఈ సూపర్‌స్టార్ చిరునవ్వుతో ‘నేను రజనీకాంత్’ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో గతంలో ఎప్పుడు లేనంతగా నెటిజన్లు రజనీని ట్రోల్ చేస్తున్నారు.
‘నాన్‌థాన్‌పా రజనీకాంత్’(నేను రజనీకాంత్‌ను), ‘యాంటీతమిళ్ రజనీకాంత్’ హ్యాష్ టాగ్స్ క్రియేట్ చేసి ఓ ఆట ఆడేసుకుంటున్నారు. తూత్తుకూడికి చెందిన సంతోష్ బీకామ్ చదువుతున్నాడు. స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేయాలని కృషి చేసిన వారిలో ఇతనొకడు. ఇటీవల స్టెరిలైట్ బాధితులను పరామర్శించడానికి ఓ మంత్రి ఆస్పత్రికి వచ్చినప్పుడు కూడా సంతోష్ ఆయన్ని ఇలాంటి వింత ప్రశ్నలే అడిగాడట. ఇప్పుడు ఏకంగా తలైవానే ‘ఎవరు నువ్వు..?’ అని అడిగాడు. తూత్తుకుడిలో మే 22న జరిగిన విధ్వంసానికి సంఘ విద్రోహశక్తులే కారణమని రజనీకాంత్ అన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment