సాక్షి, చెన్నై: తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. సినీ దిగ్గజాలు కమలహాసన్, రజనీకాంత్ రంగంలోకి దిగడంతో రాజకీయాలు రసకందాయకంగా మారాయి. 25 ఏళ్లుగా రాజకీయాల్లోకి వస్తానంటూ అభిమానులను ఊరిస్తూ వచ్చిన రజనీ ఇనాళ్లకు రాజకీయ రంగస్థలంలోకి దూకడానికి సిద్ధం అవుతున్నారు. ఆయన సమకాలీన నటుడు కమలహాసన్ అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశంతో పాటు పార్టీ పేరు, జెండానూ కూడా ప్రకటించేసి జనాల్లోకి చొచ్చుకుపోతున్నారు. కమల్,రజనీలిద్దరూ రాజకీయాల్లోనూ భిన్న రాజకీయాలతో ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు.
ఈ నట ఘటికులిద్దరూ తమ అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చి, అభిమానుల ద్వారా తమిళనాడులో అధికారాన్ని చేపట్టాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ లక్ష్యంగా రాజకీయ అడుగులు వేస్తున్న కమలహాసన్, రజనీకాంత్‌ల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉండడం గమనార్హం. రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలంటూ, విద్యార్థులు రాజకీయాలకు దూరంగా చదువుపై దృష్టి సారించాలి అని పేర్కొంటే.. కమల్ అందుకు భిన్నంగా విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపునిచ్చారు. ఇలా పలు విషయాల్లో కమల్, రజనీ విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
స్టెరిలైట్ పోరాటంపైనా..
తమిళనాడును కుదిపేసిన తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటం వ్యవహారంలో రజనీకాంత్, కమలహాసన్ భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అక్కడి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన రజనీకాంత్ పోరాటంలో సంఘవిద్రోహులు చొరబడి దాడికి పాల్పడడమే సమస్యకు కారణం అనీ, ఈ సంఘటనలో పోలీసులపై దాడి ఖండించదగ్గదని పేర్కొన్నారు. ప్రతి విషయానికి పోరాటాలు చేసుకుంటూ పోతే తమిళనాడు శ్మశానంగా మారుతుందని రజనీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేనూ సంఘ విద్రోహినే
తూత్తుకుడి ఘటనపై రజనీకాంత్ వ్యాఖ్యలను కమలహాసన్ ఖండించారు. ఆయనపై వ్యతిరేక గళం ఎత్తారు. పోరాటం చేసేవారు సంఘ విద్రోహులైతే తానూ సంఘ విద్రోహుడినేనని కమల్ పేర్కొన్నారు. పోరాటాలు ఆగకూడదని అన్న కమల్ తూత్తుకుడి పోరాటం మంచి మార్గం అని, తుపాకీలు గురిపెట్టినా వాటిని ఎదిరించే పరిపక్వతను చూశామని అన్నారు. పోరాటాలతో తమిళనాడు శ్మశానంగా మారుతుందని రజనీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు. తాను మహాత్మా గాంధీ శిష్యుడినని అన్నారు. కత్తులు, తుపాకులతో చేసేది పోరాటం కాదని, అహింసా విధానంలో పోరాటాలు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment