సూపర్ స్టార్ రజనీకాంత్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన అమానుష పోలీసు కాల్పులపై రాజకీయ నాయకుడిగా మారిన సినీ నటుడు రజనీకాంత్ మాట మార్చి ప్రజల ముందు, ముఖ్యంగా సోషల్ మీడియాలో అభాసు పాలయ్యారు. పోలీసుల కాల్పుల సంఘటన జరిగిన మే 22వ తేదీన వారి అమానుషత్వాన్ని విమర్శిస్తూ రజనీకాంత్ ఓ చిన్న వీడియాను విడుదల చేశారు.
పోలీసు కాల్పుల్లో గాయపడి తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి ఆయన బుధవారం అక్కడికి వెళ్లినప్పుడు ఓ బాధితుడి నుంచి ఆయనకు ఊహించని ప్రశ్న ఎదురయింది. ‘ఎవరు నువ్వు?’ అన్నదే ఆ ప్రశ్న. దీంతో కంగుతిన్న రజనీకాంత్, అక్కడ తన పేరు చెప్పుకొని త్వరత్వరగా పరామర్శ కార్యక్రమాన్ని ముగించుకొని ఆస్పత్రి బయటకు వచ్చారు.
‘సంఘ వ్యతిరేక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు నిరసనలో పాల్గొన్నారు. వారు పోలీసులపై రాళ్లు రువ్వడం వల్ల పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది’ అని రజనీకాంత్ తన అంతుకుముందటి వైఖరి మార్చుకొని మీడియా ముందు వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన పాలనలో ఇలాంటి శక్తులు తలెత్తకుండా చేశారని, ఆమె తరహాలో ప్రస్తుత ఏఐఏడిఎంకే ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
నిరసన ప్రదర్శనలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నారన్న విషయం తమకు ఎలా తెలుసు, ఎలా ధ్రువీకరించుకున్నారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు తడబడిన ఆయన ‘ఆ...నాకు తెలుసు’ అంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇలా మాట మార్చడంపై సోషల్ మీడియాలో రజనీకాంత్‌కు వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘పక్కా బీజేపీ తొత్తువి’, ‘ఏలియన్ హిందూత్వ’ అంటూ ట్వీట్లు పేలాయి.
వేదాంత గ్రూప్‌నకు చెందిన తూత్తుకుడి స్టెరిలైట్ కాపర్ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో టెర్రరిస్టులు, నక్సలైట్లు పాల్గొన్నారని బీజేపీ నాయకులు విమర్శించడం తెల్సిందే. మోదీకి, బీజేపీకి వేదాంత గ్రూప్ ఇష్టమైన సంస్థ అవడమే వారి విమర్శలకు కారణం ఏమో! అయినా మాట మార్చడం రజనీకాంత్‌కు కొత్త కాదు. జయలలిత తుదిశ్వాస వరకు ఆమెను నిజమైన ‘అమ్మ’ అంటూ ప్రశంసించిన ఆయన 1996లో జయలలితకు ఓటు వేయరాదంటూ తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె గనుక గెలిస్తే తమిళనాడు రాష్ట్రాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేరంటూ విమర్శించారు.
రీల్ హీరోగా, రియల్ హీరోగా వేరు
చాలా మందిలాగానే సినిమాలో హీరోగా కనిపించే రజనీకాంత్ వేరు. నిజ జీవితంలో రజనీ వేరు. జూన్ ఏడవ తేదీన విడుదలవుతున్న ‘కాలా’ చిత్రంలో రజనీ ప్రజల నిరసన ప్రదర్శనలను ప్రోత్సహిస్తారు. పేద వారి శరీరాలే ఆయుధాలంటారు. తూత్తుకుడిలో ప్రదర్శన జరిపిన ప్రజలనేమో సంఘ విద్రోహశక్తులన్నారు. ‘ఎవరు నువ్వు’ అంటూ ఓ బాధితుడు అన్నందుకు కోపం వచ్చి రజనీకాంత్ మాటమార్చారని అనుకోరాదు.
ఒకవేళ అదే కారణం అయితే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న ఆయన ఇక రాణించలేరు. అరాచకవాదులు, తీవ్రవాదులు, సంఘ విద్రోహశక్తులు తూత్తుకుడి ప్రదర్శనలో ఉన్నారని రజనీకాంత్ అత్యంత సన్నిహితుడు, ఆరెస్సెస్ సభ్యుడు, తుగ్లక్ మాగజైన్ ఎడిటర్ ఎస్. గురుమూర్తి ఆరోపించారు. రజనీ కూడా సంఘ విద్రోహ శక్తులంటూ మాట మార్చడంతో ఆయన ట్వీట్ల మీద ట్వీట్లతో రజనీకాంత్‌ను ప్రశంసించారు.
‘ఎవరు నువ్వు?’ అంటూ బాధితుడు వేసిన ప్రశ్న రజనీకాంత్‌కు సరిగ్గా అర్థం కానట్లు ఉంది. తనదీ ఆద్యాత్మిక రాజకీయమంటూ చెప్పుకుంటున్న రజనీకాంత్ ఎవరి పక్షమని, ఏ పార్టీ పక్షం అన్నదే ప్రశ్న. ఆధ్యాత్మికమంటే హిందూత్వమనేదే అర్థమని, రజనీకాంత్ బీజేపీ పక్షమంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ఒప్పుకోవాలన్నదే బాధితుడి ప్రశ్న.
Comments
Please login to add a commentAdd a comment