- బీజేపీలో బీఎస్‌ఆర్ సీపీ విలీనం..
- కార్యకర్తల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
- ప్రజల హితం కోసమే ఈ నిర్ణయం : శ్రీరాములు
- మోడీని పీఎం చేయడమే లక్ష్యం
- విలీనం తేదీ ఖరారు కాలేదు
- పదవుల కోసం బీజేపీలో చేరలేదు
- అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటా
సాక్షి, బళ్లారి : స్వాభిమానం పేరుతో రెండున్నర సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన బీఎస్‌ఆర్‌సీపీ బీజేపీలోకి విలీనం కానుంది. బళ్లారిలో బుధవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ, కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు ఏకగీవంగా తీర్మానించారు. బీఎస్‌ఆర్‌సీపీని బీజేపీలోకి విలీనం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రతినిధి రవీంద్ర రేష్మీ సందేశాన్ని చదివి వినిపించారు. పార్టీ అధినేత బీ.శ్రీరాములు కార్యకర్తలు, నాయకులు చేతులు పెకైత్తి తమ ఆమోదం తెలిపారు. అనంతరం బీ.శ్రీరాములు మాట్లాడుతూ..
దేశ ప్రజల హిత ద ృష్టితో బీఎస్‌ఆర్‌సీపీని బీజేపీలోకి విలీనం చేయడానికి తీర్మానించామన్నారు. తాను తీసుకున్న నిర్ణయానికి కార్యకర్తలు, నాయకులు ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. అయితే బీజేపీలోకి ఎప్పుడు చేరేది తేదీ ఇంకా ఖరారు కాలేదన్నారు. పదవులకు ఆశపడి తాను బీజేపీలోకి చేరడం లేదన్నారు. యావత్ దేశం నరేంద్ర మోడీ వైపు చూస్తోందని, ఆయనను ప్రధాన మంత్రిని చేయడానికి తాను తిరిగి బీజేపీలోకి చేరుతున్నానని అన్నారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోడీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, అరుణ్‌జైట్లీ తదితర ప్రముఖులందరూ తమను పార్టీలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. తనకు ఎంపీగా పోటీ చేయాలనే ఆసక్తి లేదని, అయితే హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.
బళ్లారి ఎంపీగా శ్రీరాములు పోటీ : గాలి సోమశేఖరరెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా శ్రీరాములు పోటీ చేయడం ఖాయమని కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. తామంతా శ్రీరాములు వెంట నడుస్తామని, ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలని అన్నారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి, శ్రీరాములు కేంద్ర మంత్రి అవుతారని జోస్యం చెప్పారు. సోదరుడు గాలి జనార్దనరెడ్డి జైలు నుంచి బయటకు వచ్చే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. అయితే శ్రీరాములు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.
భగవంతుడి కృపతో జూన్ లేదా జూలైలో గాలి జనార్దనరెడ్డి బయటకు వస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఎంపీలు శాంత, సన్న పక్కీరప్ప మాట్లాడుతూ.. యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిప్పేస్వామి, విధాన పరిషత్ సభ్యుడు వృత్యుంజయ జినగా, బీఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నేతలు రవీంద్ర రేష్మీ, మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి, మాజీ జెడ్పీ అధ్యక్షురాలు అరుణా తిప్పారెడ్డి, సినీనటి పూజాగాంధీ తదితరులు పాల్గొన్నారు.