
కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకువద్దాం
రాష్ట్రంలో 75 లక్షలు, బళ్లారి జిల్లాలో 5 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యం
బళ్లారి ఎంపీ శ్రీరాములు
బళ్లారి : కర్ణాటకలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని బళ్లారి ఎంపీ శ్రీరాములు తెలిపారు. ఆయన బుధవారం స్థానిక బసవేశ్వర నగర్‌లోని సంగమేశ్వర ఆలయంలో బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదును పెంచి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది, కర్ణాటకలో 75 లక్షల మంది, బళ్లారి జిల్లాలో 5 లక్షల మందిని పార్టీ సభ్యులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఉత్తర కర్ణాటకలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో తాను స్వయంగా పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు.
బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి యువత పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని తెలిపారు. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మోడీ గాలికి కాంగ్రెస్ కొట్టుకుపోయిందని, ఇక వచ్చే ప్రతి ఎన్నికలోనూ మోడీ గాలికి కాంగ్రెస్ నిలవదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, ఎమ్మెల్సీ మృత్యుంజయ జినగ, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, బుడా మాజీ అధ్యక్షుడు గురులింగనగౌడ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నందీష్, రాష్ట్ర స్లం మోర్చా ఉపాధ్యక్షుడు సంజయ్, బీజేపీ నేతలు అశోక్ గస్తీ, బీజేపీ నేతలు విరుపాక్షిగౌడ, రామలింగప్ప తదితరులు పాల్గొన్నారు.