లేకపోతే పార్టీ పదవులకు ప్రమాదం: బీజేపీ రాష్ట్ర సభ్యత్వ ఇన్‌చార్జి అభయ్ పాటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకోకపోతే తిప్పలు తప్పవని బీజేపీ అధిష్టానం నాయకులకు హెచ్చరికలు జారీచేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యనేతలు మొదలు కిందిస్థాయి కార్యకర్తల దాకా అందరూ.. పూర్తిస్థాయిలో నిమగ్నం కావాల్సిందేనని జాతీయ నాయకత్వం స్పష్టంచేసింది. సభ్యత్వ నమోదులో నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించింది. పార్లమెంట్ ఎన్నికల్లో.. రాష్ట్రంలో పోటీచేసిన బీజేపీ అభ్యర్థులకు 77 లక్షల ఓట్లు పోలైనందున, వాటిలో 60 నుంచి 65 లక్షల దాకానైనా ఓటర్లను పార్టీ సభ్యులుగా చేర్చుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించని నాయకులను పార్టీ పదవుల్లో నుంచి తొలగిస్తామని తెలంగాణ సభ్యత్వ ఇన్‌చార్జి అభయ్ పాటిల్ స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సభ్యత్వ నమోదు సాగుతున్న తీరును పర్యవేక్షించారు. శని, ఆదివారాల్లోనూ ఆయన రాష్ట్రంలోని వివిధచోట్ల పర్యటించి సభ్యత్వ నమోదును పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా పాల్గొంటున్నారనే అంశంపై సమాచారాన్ని సేకరించి, నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో పారీ్టనేతలు అప్రమత్తం అయ్యారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment