భూములన్నీ బీళ్లే!
- దిక్కుతోచని స్థితిలో రైతన్న
బళ్లారి టౌన్ : నైరుతి వర్షాలపై ఆశతో నెలన్నర క్రితమే రైతులు పదును చేసుకున్న భూములు బీళ్లుగా మారుతున్నాయి. మూడు రోజలుగా ఆకాశం మబ్బులు కమ్ముకుని ఊరిస్తోంది. వర్షం కురుస్తుందనుకుంటే కనీసం చినుకు కూడా నేల రాలక పోవడంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. బళ్లారి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
వర్షాధార భూములను పంట సాగు కోసం రైతులు ముప్పయి రోజుల క్రితమే సిద్ధం చేసి ఉంచారు. విత్తనాలు శుద్ధి చేసుకున్నారు. ఈ పరిస్ధితుల్లో వర్షం మొహం చాటేయడంతో రైతుల ఆవేదనకు అంతం లేకుండపోయింది. ఈ పరిస్థితి ఆయకట్టు రైతుల్లోనూ నెలకొంది. వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది తుంగభద్ర డ్యాం నిండలేదు. దీంతో కాలువకు నీరు వదలడం లేదు.
బళ్లారి తాలూకాలో ఆయకట్టు భూములు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే భూములన్నీ దుక్కి దున్ని పదును చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వేసిన విత్తనం మొలక దశలోనే ఎండిపోతోంది. వర్షాభావ పరిస్థితులు రైతులను కుదేలు చేస్తున్నాయి.