తవ్వేకొద్దీ నాణేలే
Published Mon, Mar 27 2017 6:49 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
► కొట్టూరులో 90 కేజీలకు చేరిన పురాతన నాణేలు
► జిల్లాలో చర్చనీయాంశంగా మారిన వైనం
బళ్లారి: ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో హంపీలో అమూల్యమైన మణులు-వజ్ర వైఢూర్యాలు రాశులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెబుతోంది. హంపీకి దగ్గరలోనే ఉన్న కొట్టూరు పట్టణంలో పాతకాలం నాణేలు కుప్పలు కుప్పలుగా బయటపడుతుండడం అంతటా ఆసక్తికరంగా మారింది.
ఈ నెల 24న శ్రీకొట్టూరేశ్వరస్వామి మఠం సమీపంలోని గిరిజమ్మ అనే మహిళకు చెందిన పురాతన ఇంటిని పడగొట్టి కొత్త ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా సుమారు 25 కేజీల పురాతన నాణేలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే శని, ఆదివారాలు కూడా పాత ఇంటిని కూల్చుతుండగా పెద్ద సంఖ్యలో పురాతన నాణేల నిధి వెలుగుచూసింది. ప్రస్తుతం 90 కేజీల వరకు పురాతన నాణేలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
తహసీల్దార్, సీఐ తనిఖీ
తహసీల్దార్ కృష్ణమూర్తి, కొట్టూరు సీఐ రాజానాయక్ ఘటనాస్థలంలో పురాతన నాణేలను పరిశీలిస్తున్నారు. నాణేలను తిలకించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. 1915–20వ సంవత్సరానికి చెందిన కాలంలో బ్రిటిషప్రభుత్వం ముద్రించినవిగా అధికారులు తెలిపారు. నాణేలపైన కింగ్ జార్జ్- ఫోర్త్ అనే అక్షరాలతో పాటు బ్రిటన్ రాజు చిత్రం ఉంది. వాటిపై అణా పైసలు, దమ్మిడీలు అనే పదాలు కన్పిస్తున్నాయి. ఆ ఇంటి పూర్వీకులే గోడలు, పునాదుల్లో దాచి ఉంటారని భావిస్తున్నారు. తవ్వకాలు జరిగేకొద్దీ మరిన్ని నాణేలు బయటపడవచ్చని చెబుతుననారు.
Advertisement