ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు బళ్లారి జిల్లాలో చట్టంపై అవగాహన, మొబైల్ సాక్షరత రథం పర్యటిస్తున్నట్లు జిల్లా జడ్జి సీ.వీ.మరగూరు తెలిపారు.
బళ్లారి అర్బన్: ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు బళ్లారి జిల్లాలో చట్టంపై అవగాహన, మొబైల్ సాక్షరత రథం పర్యటిస్తున్నట్లు జిల్లా జడ్జి సీ.వీ.మరగూరు తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గ్రామీణ ప్రజల్లో చట్టపరమైన హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు రాష్ట్ర న్యాయ సలహా ప్రాధికార మండలి ఆదేశాల మేరకు ఈనెల 7 నుంచి 9 వరకు బళ్లారి తాలూకాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి న్యాయ సలహా మండలి హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు.
7న ఉదయం 9 గంటలకు వేణివీరాపురం సముదాయ భవనం వద్ద, మధ్యాహ్నం 1 గంటకు కుడితిని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద, సాయంత్రం సిద్ధమ్మనహళ్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8న ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, మధ్యాహ్నం మోకా ప్రభుత్వ పాఠశాలలో, సాయంత్రం 5 గంటలకు కప్పగల్ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద చట్టంపై అవగాహన కల్పిస్తామన్నారు.
9న ఉదయం బళ్లారి పోలీసు జింఖానా కార్యాలయంలో, మధ్యాహ్నం 1.30కు ఎస్‌ఆర్ కాలనీలో, సాయంత్రం 5 గంటలకు ఎస్‌జీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు పాటిల్ సిద్దారెడ్డి, ప్రధాన సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎం.హెచ్.శాంత తదితరులు పాల్గొన్నారు.