- ఫలించిన డీకేశి ఎత్తులు
సాక్షి, బళ్లారి : బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై. గోపాలకృష్ణ 33,104 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 50,795 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై గోపాలకృష్ణకు 83,899 ఓట్లు లభించడంతో భారీ మెజార్టీతో గెలుపొందినట్లయింది. ఈ నెల 21న జరిగిన బళ్లారి ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపును సోమవారం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు.
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా, అందులో ఇరు పార్టీలకు సమానంగా వచ్చాయి. తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్‌లోను కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై. గోపాలకృష్ణ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఓబుళేసుపై మెజార్టీ ప్రదర్శిస్తూ వచ్చారు. మొత్తం 15 రౌండ్లు ఓట్లు లెక్కించగా అందులో ప్రతి రౌండ్‌లోను బీజేపీపై కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించింది. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ గెలుపొందాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది.
అయినా మూడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి శ్రీరాములు హ్యాట్రిక్ సాధించారు. అయితే ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీరాములు కోటలో కాంగ్రెస్ పాగా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారని తెలియడంతో కౌంటింగ్ కేంద్రం వద్దకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బళ్లారి జిల్లా ఓటర్లు రెండు సార్లు ఎన్‌వై హనుమంతప్పను తిరస్కరించారు.
మూడోసారి అయినా తమను బళ్లారి ప్రజలు ఆశీర్వదిస్తారనే ఆశతో ఆయన సోదరుడు గోపాలకృష్ణ ఈ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. బళ్లారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్ ఇన్‌ఛార్జిగా పని చేశారు. డీకే శివకుమార్ వ్యూహాత్మంగా ఎన్నికల్లో తనదైన శైలిలో పని చేశారు. బీజేపీ, జేడీఎస్ నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంతోపాటు అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడంతో ఎన్నికల్లో ఘన విజయం కారణమైందని చెప్పవచ్చు.
కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించడంతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, డీసీసీ అధ్యక్షుడు జేఎస్. ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ కే.ఎస్. ఎల్‌స్వామి, స్థానిక కాంగ్రెస్ నేతలు రాంప్రసాద్, అసుండి వన్నూరప్ప తదితరులు కౌంటింగ్ సెంటర్‌కు చేరుకుని ఎన్‌వై. గోపాలకృష్ణను అభినందించారు. అనంతరం టాప్ లేని వాహనంపై నగర వీధుల గుండా ఊరేగింపు చేపట్టారు.