బ్లాక్ మార్కెట్‌లో ‘క్షీరభాగ్య’
- తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న గ్రామస్తులు
సాక్షి, బళ్లారి : నగర శివార్లలోని గుగ్గరహట్టి ప్రభుత్వ పాఠశాల నుంచి క్షీరభాగ్య పాల ప్యాకెట్లును బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వ్యక్తిని గ్రామస్తులు బుధవారం పట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం క్షీర భాగ్య పథకం కింద పాలు పొడి ప్యాకెట్లను సరఫరా చేస్తోంది. అయితే వాటిని కొందరు హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
గుగ్గరహట్టిలోని ప్రభుత్వ పాఠశాలలో ఇదే తంతు జరుగుతోంది. ఆ పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయురాలి భర్త బుధవారం 50 కిలోల పాలపొడిని బైక్‌లో తీసుకొని వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పాఠశాల హెడ్‌మాస్టర్ ఈ సంచిని తీసుకెళ్లి వేరే చోట పెట్టాలని ఆదేశించడంతో తాను తీసుకెళ్తున్నానని, అందులో ఏముందో తనకు తెలీదని పోలీసులకు ఆయన తెలిపారు.
కాగా విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు స్కూల్ నుంచి జారుకున్నారు. నిజానిజాలు తేల్చడానికి బళ్లారి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా పాల పొడిని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక నవ నిర్మాణ వేదిక కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.