రాహుల్ రాజకీయ అజ్ఞాని
- శ్రీరాములు ధ్వజం
- ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడమే అతనికి తెలుసు
- ఆయన పర్యటనతో కాంగ్రెస్‌కు ఒరిగేది శూన్యం
- వ్యక్తిగత విమర్శలకు దిగడం అతని కుసంస్కారానికి నిదర్శనం
- తాత పేరు చెప్పుకొని రాజకీయాల్లో సాగుతున్నారు
- స్థాయిని మరచి విమర్శిస్తున్న సిద్ధు
- వారి మంత్రివర్గంలోనే కళంకితులు
సాక్షి, బళ్లారి : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ రాజకీయ అజ్ఞానిగా బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు అభివ ర్ణించారు. శనివారం ఆయన బళ్లారి తాలూకా కంప్లి నియోజకవర్గంలోని సిరివార, కప్పగల్లు, శ్రీధరగడ్డ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివడమే తప్ప.. ప్రాక్టికల్‌గా ఆయనకు ఎలాంటి రాజకీయ పరిజ్ఞానమూ లేదని విమర్శించారు.
కర్ణాటకలో రాహుల్ పర్యటనలతో కాంగ్రెస్‌కు ఒరిగేది శూన్యమని తెల్చిచెప్పారు. బీజేపీ అవినీతి గురించి మాట్లాడే రాహుల్‌కు.. కాంగ్రెస్ కుంభకోణాల గురించి తెలియదా? అని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. మాజీ ప్రధాని మనవడిగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారే తప్ప.. కింది స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి కాదని అన్నారు. కుటుంబ నేపథ్యంలో పైకొచ్చిన పెద్దలకు రాజకీయాలు, ప్రజల కష్టాలు తెలియవన్నారు.
మంత్రివర్గంలోనే కళంకితులు..
సీఎం సిద్ధరామయ్య ఆయన స్థాయికి తగినట్లుగా మాట్లాడటం లేదని శ్రీరాములు ధ్వజమెత్తారు. అవినీతి గురించి మాట్లాడే సిద్దరామయ్య కళంకితులను మంత్రివర్గంలో చేర్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా దేశంలో మోడీ గాలిని ఆపలేరన్నారు. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.