b.sriramulu
-
మంత్రి శ్రీరాములుకు కరోనా
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బీ శ్రీరాములు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కొద్దిరోజులుగా జ్వరం రావడంతో ఆదివారం కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు ఆయన ట్విటర్లో తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు వచ్చిననాటి నుంచి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించానని తెలిపారు. తనకు పరీక్షా సమయం ఎదురైందని, ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటానని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా కోలుకుని మరింత ప్రజాసేవ చేయడానికి శక్తిని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కర్ణాటకలో ఇప్పటికే సీఎం యెడియూరప్ప, సీఎల్పీ నేత సిద్ధరామయ్యలకు కోవిడ్ సోకి బెంగళూరులోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. (సీఎం కుమార్తెకు కరోనా పాజిటివ్) -
ప్లాస్మా దాతలకు కర్ణాటక ప్రోత్సాహకం
బెంగుళూరు : దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. వ్యాధి తీవ్రమయి ఆరోగ్యం క్షీణించిన వారిలో ప్రయోగాత్మకంగా అందిస్తోన్న ప్లాస్మా థెరపీకి ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే దానికి తగ్గట్లు ప్లాస్మా దాతలు తగినంతగా లభించకపోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నా అవసరాలకు తగ్గట్లుగా ప్లాస్మా లభించడం లేదు. దీంతో దాతలు ముందుకు రావాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్లాస్మాదాతలు లేక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా అధికమవుతుంది. ఈ నేపథ్యంలో దాతలను ప్రోత్సహించేలా కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మాను దానం చేస్తే 5000 రూపాయలను ప్రోత్సాహకంగా అందిస్తామని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి బి శ్రీరాములు ఓ ప్రకటన విడుదల చేశారు. (‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’) దేశంలో అత్యధిక ప్లాస్మా పద్ధతిని ఉపయోగిస్తున్న రెండవ రాష్ర్టం కర్ణాటక అని మంత్రి అన్నారు. దాదాపు 80 శాతం కరోనా రోగులు ఈ పద్ధతి ద్వారా త్వరగా కోలుకున్నారని తెలిపారు. అయితే ప్రాణదాతలుగా గొప్ప దాతృత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయంలో దీన్ని కూడా డబ్బుతో పోల్చడంపై వస్తున్న విమర్శలను మంత్రి కొట్టిపారేశారు. ఇది ఎవరినీ అవమానించడం కాదని కేవలం దాతలను ప్రోత్సహించే ఉద్దేశం మాత్రమేనని అన్నారు. రాష్ర్ట రాజధాని బెంగుళూరులో కరోనా తీవ్రరూపం దాలుస్తుంది. అన్‌లాక్ 1 ప్రారంభ దశలో 600 కన్నా తక్కువ ఉన్న కరోనా కేసుల తీవ్రత ఇప్పడు 22 వేలు దాటింది. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 47,000 దాటింది. గత 24 గంటల్లోనే అత్యధికంగా 3176 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. (బాదేసే బిల్లు) -
15 రోజుల్లో కేసులు రెట్టింపు కావొచ్చు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాబోయే 15 నుంచి 30 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు కావొచ్చని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. రాబోయే రెండు నెలలు కరోనాకు అడ్డుకట్టవేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుంది. అయితే ప్రజలు ఎటువంటి భయాందోళలకు గురికావాల్సిన పనిలేదు. సవాళ్లను అధిగమించడానికి అందుకు సంబంధించిన అన్ని రకాల చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. మనమంతా సురక్షితంగా ఉండటానికి కోవిడ్-19కు నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆయన ట్విటర్ ద్వారా కోరారు. కాగా.. శనివారం నాటికి రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 36,216కు చేరుకుంది. మరణాల సంఖ్య 613గా ఉంది. గత కొద్దిరోజులుగా కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తున్న కారణంగా బెంగళూరు నగరంతో పాటు, రూరల్ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 22వ వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి శ్రీరాములు తెలిపారు. (గుర్రాలు తెంచుకున్నాకే మనం మేల్కొంటామా!) -
ఘనంగా రక్షిత వివాహం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం గురువారం అట్టహాసంగా జరిగింది. నగరంలోని బెంగుళూరు ప్యాలెస్‌లో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త శెట్టిపల్లి లలిత్ సంజీవరెడ్డితో రక్షిత వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి కర్ణాటక గవర్నర్ వజుభాయి వాలా, సీఎం బీఎస్ యడియూరప్ప, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, పలువురు. మంత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి వచ్చిన అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు. (రక్షిత పెళ్లికూతురాయనే !) -
రక్షిత పెళ్లికూతురాయనే !
సాక్షి, బళ్లారి : కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు ఇంట పెళ్లి సందడి మొదలైంది. శ్రీరాములు పెద్ద కుమార్తె రక్షిత వివాహం ఈ నెల 5న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో హైదరాబాద్‌కు చెందిన లలిత్ సంజీవ్‌రెడ్డితో జరగనుంది. సోమవారం బళ్లారి హవంబావిలో శ్రీరాములు స్వగృహంలో పెళ్లి వేడుకలను సంప్రదాయబద్ధంగా ప్రారంభించి రక్షితను పెళ్లి కుమార్తెను చేశారు. శ్రీరాములు దంపతులు కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరు ప్యాలెస్‌లోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా కళా దర్శకులు వివాహ మంటపాన్ని తీర్చిదిద్దారు. (రక్షిత వివాహానికి ప్రధానికి ఆహ్వానం) -
ఈ గెలుపు బళ్లారి జిల్లా ప్రజలకు అంకితం
జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటా బళ్లారి లోక్‌సభ అభ్యర్థి బీ.శ్రీరాములు సాక్షి, బళ్లారి : నా గెలుపు బళ్లారి జిల్లా ప్రజలకు అంకితం ఇస్తున్నానని బళ్లారి లోక్‌సభ మెంబర్‌గా గెలుపొందిన బీ.శ్రీరాములు అన్నారు. ఆయన శుక్రవారం బళ్లారిలోని రావ్ బహదూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం కుంభకోణాల్లో మునిగిపోయి దేశాన్ని తిరోగమనంలోకి నెట్టిందన్నారు. యూపీఏ పాలనపై విసిగిపోయిన ప్రజలు నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి కంకణం కట్టుకుని ఆ దిశగా మంచి విజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. బళ్లారి జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. బళ్లారి జిల్లా ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. బళ్లారి జిల్లాలోని తుంగభద్ర డ్యాం పూడికతీతకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించిన బళ్లారి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. అన్ని మతాలు వారు తన గెలుపునకు సహకరించారని గుర్తు చేశారు. ముఖ్యంగా తన నియోజకవర్గ పరిధిలోని మంచినీటి సమస్యతోపాటు రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాన న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ అధ్యక్షుడు రుద్రగౌడ, న్యాయవాది పాటిల్ సిద్దారెడ్డి, జెడ్పీ సభ్యుడు రాజశేఖరగౌడ తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్ రాజకీయ అజ్ఞాని
శ్రీరాములు ధ్వజం ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడమే అతనికి తెలుసు ఆయన పర్యటనతో కాంగ్రెస్‌కు ఒరిగేది శూన్యం వ్యక్తిగత విమర్శలకు దిగడం అతని కుసంస్కారానికి నిదర్శనం తాత పేరు చెప్పుకొని రాజకీయాల్లో సాగుతున్నారు స్థాయిని మరచి విమర్శిస్తున్న సిద్ధు వారి మంత్రివర్గంలోనే కళంకితులు సాక్షి, బళ్లారి : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ రాజకీయ అజ్ఞానిగా బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు అభివ ర్ణించారు. శనివారం ఆయన బళ్లారి తాలూకా కంప్లి నియోజకవర్గంలోని సిరివార, కప్పగల్లు, శ్రీధరగడ్డ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివడమే తప్ప.. ప్రాక్టికల్‌గా ఆయనకు ఎలాంటి రాజకీయ పరిజ్ఞానమూ లేదని విమర్శించారు. కర్ణాటకలో రాహుల్ పర్యటనలతో కాంగ్రెస్‌కు ఒరిగేది శూన్యమని తెల్చిచెప్పారు. బీజేపీ అవినీతి గురించి మాట్లాడే రాహుల్‌కు.. కాంగ్రెస్ కుంభకోణాల గురించి తెలియదా? అని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. మాజీ ప్రధాని మనవడిగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారే తప్ప.. కింది స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి కాదని అన్నారు. కుటుంబ నేపథ్యంలో పైకొచ్చిన పెద్దలకు రాజకీయాలు, ప్రజల కష్టాలు తెలియవన్నారు. మంత్రివర్గంలోనే కళంకితులు.. సీఎం సిద్ధరామయ్య ఆయన స్థాయికి తగినట్లుగా మాట్లాడటం లేదని శ్రీరాములు ధ్వజమెత్తారు. అవినీతి గురించి మాట్లాడే సిద్దరామయ్య కళంకితులను మంత్రివర్గంలో చేర్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా దేశంలో మోడీ గాలిని ఆపలేరన్నారు. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యం’
సాక్షి, బళ్లారి : పది సంవత్సరాలుగా యూపీఏ ప్రభుత్వం భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో పూర్తిగా విఫలమైందని నరేంద్ర మోడీ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు అన్నారు. ఆయన గురువారం నగరంలోని కౌల్‌బజార్‌లోని టైలర్ వీధి, జవారి వీధి, దానప్ప కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఆయా కాలనీల్లో కలియ తిరుగుతూ బీజేపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఎన్నికల సమయంలో ప్రజలు ముందుకు వచ్చే నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. హిందూ-ముస్లింల మధ్య భేదభావం సృష్టించి కాంగ్రెస్ పార్టీ ఓట్లు పొందాలని చూస్తోందన్నారు. ముస్లింల సంక్షేమం కోసం నరేంద్రమోడీ కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. కులమతాలకతీతంగా యావత్ భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఏకైక నాయకుడు నమో అని గుర్తు చేశారు. వచ్చే నెల 17వ తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ మూడు ముక్కలు కావడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఈ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు ఏకం కావడంతో కాంగ్రెస్ ఆటలు సాగవన్నారు. కేజేపీ, బీఎస్‌ఆర్‌సీపీలు బీజేపీలోకి విలీనం కావడంతో రాష్ట్రంలోనే మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందుతారన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకు వచ్చి బళ్లారిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గోవిందరాజులు, బీజేపీ నాయకుడు గురులింగనగౌడ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో మోడీ ప్రభంజనం
గంగావతి, న్యూస్‌లైన్ : దేశంలో మోడీ గాలి బలంగా వీస్తోందని కొప్పళ లోక్‌సభ మాజీ సభ్యులు, బీఎస్ఆర్ పార్టీ నేత కే.విరుపాక్షప్ప అన్నారు. ఆయన శుక్రవారం స్థానిక ఎస్ఎస్ మోటర్స్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను కొప్పళ నియోజకవర్గంలోని 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించి వారి అభిప్రాయానికి అనుగుణంగా ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకుంటానన్నారు. బీఎస్ఆర్ పార్టీ నేత బీ.శ్రీరాములు సైతం బీజేపీలో చేరతారని, అయితే అంతిమ నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని, అయితే ఏ పార్టీలో చేరాలన్నది త్వరలో నిర్ణయిస్తానని చెప్పారు. సీఎం సిద్ధరామయ్యను కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఉద్దేశంతోనే కలిసింది వాస్తవమని ఒప్పుకున్న విరుపాక్షప్ప, ఆ పార్టీలో స్థానికుల వ్యతిరేకతను బట్టి ఆ పార్టీలోకి వెళ్లదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు తమ్మినేని రామచంద్ర, విఠలాపుర యమనప్ప, పక్కీరయ్య పాల్గొన్నారు. ‘కొప్పళ లోక్‌సభ టికెట్ ఆశిస్తున్నా’ శ్రీరామనగర్, న్యూస్‌లైన్ : బీజేపీ తరపున కొప్పళ లోక్‌సభ టికెట్‌ను తాను ఆశిస్తున్నట్లు కొప్పళ మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప తెలిపారు. బీజేపీ హైకమాండ్ ఆశీస్సులతో స్థానిక నాయకులను తమ మద్దతుదారులు కలుస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం రాయచూరులో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ దేశ్‌పాండే, కనకగిరి బ్లాక్ బీజేపీ అధ్యక్షులు కే.సత్యనారాయణరావులను కలిసినట్లు తెలిపారు.