సాక్షి, బళ్లారి : పది సంవత్సరాలుగా యూపీఏ ప్రభుత్వం భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో పూర్తిగా విఫలమైందని నరేంద్ర మోడీ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు అన్నారు. ఆయన గురువారం నగరంలోని కౌల్‌బజార్‌లోని టైలర్ వీధి, జవారి వీధి, దానప్ప కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఆయా కాలనీల్లో కలియ తిరుగుతూ బీజేపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు.
ఎన్నికల సమయంలో ప్రజలు ముందుకు వచ్చే నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. హిందూ-ముస్లింల మధ్య భేదభావం సృష్టించి కాంగ్రెస్ పార్టీ ఓట్లు పొందాలని చూస్తోందన్నారు. ముస్లింల సంక్షేమం కోసం నరేంద్రమోడీ కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. కులమతాలకతీతంగా యావత్ భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఏకైక నాయకుడు నమో అని గుర్తు చేశారు.
వచ్చే నెల 17వ తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ మూడు ముక్కలు కావడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఈ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు ఏకం కావడంతో కాంగ్రెస్ ఆటలు సాగవన్నారు. కేజేపీ, బీఎస్‌ఆర్‌సీపీలు బీజేపీలోకి విలీనం కావడంతో రాష్ట్రంలోనే మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందుతారన్నారు.
తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకు వచ్చి బళ్లారిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గోవిందరాజులు, బీజేపీ నాయకుడు గురులింగనగౌడ తదితరులు పాల్గొన్నారు.
‘నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యం’
Published Fri, Mar 28 2014 3:41 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement