13 తులాల బంగారు గొలుసులు అపహరణ
పోలీసులమని నమ్మించి బంగారు గొలుసులు లాక్కొన్న వైనం
భయాందోళనలో మహిళలు
బళ్లారి : బళ్లారి నగరంలో పట్టపగలే, జన సంచారం ఉన్న ప్రాంతాల్లో మహిళల మెడలో బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన ఘటనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో నగరంలోని పార్వతీనగర్, నెహ్రు కాలనీల్లో ఏకకాలంలో ఇద్దరు మహిళల మెడలలోని గొలుసులను చాకచక్యంగా దోచుకెళ్లారు. నగరంలోని ప్రగతి కృష్ణా గ్రామీణ బ్యాంకు ఎదురుగా నెహ్రుకాలనీలో పార్వతమ్మ అనే మహిళ వద్ద ఇద్దరు వ్యక్తులు ఆగి తాము పోలీసులమని నమ్మించి, నగరంలో చోరీలు జరుగుతున్నాయని, బంగారు ఆభరణాలను ఎందుకు వేసుకుని తిరుగుతారని హెచ్చరిస్తూనే ఆమె మెడలోని బంగారు ఆభరణాలను చాకచక్యంగా లాక్కొని పరారయ్యారు. ఆమె గట్టిగా ఆరిచేలోపు దొంగలు ద్విచక్ర వాహనంలో పరారయ్యారు. అదే సమయంలో నగరంలో పార్వతీనగర్‌లోని టీవీఎస్ షోరూం సమీపంలో సిద్దమ్మ అనే మహిళపై ఇద్దరు వ్యక్తులు బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యారు. ఈ విషయం తెలిసిన జిల్లా ఎస్‌పీ ఆర్.చేతన్, ఏఎస్‌పీ, డీఎస్‌పీ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని బాధితుల వద్ద వివరాలు సేకరించారు. ఈ ఘటనలపై గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నగర మహిళల్లో ఆందోళన :
బళ్లారి నగరంలో పట్టపగలే మహిళల మెడలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లుతుండటంతో మహిళలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. నగరంలో ఇటీవల మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దోచుకెళుతున్న సంఘటనలు పదే పదే చోటు చేసుకుంటుండటంతో నగర ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పోలీసులకు కూడా దొంగలు సవాల్ విసురుతూ తమ పని తాము చేసుకుని వెళుతున్నారు. అసలే భగభగ మండుతున్న ఎండలకు రాత్రిళ్లు ఇళ్ల లోపల పడుకునేందుకు చేతకాకపోవడంతో ఇంటి బయట, మిద్దెలపైన కొందరు నిద్రిస్తున్నారు. దీంతో ఇప్పటికే బళ్లారి నగరంలోని ఏదో ఒక కాలనీలో ప్రతి రోజు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో దొంగతనాలను ఆరికట్టేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.