Chain Snacing
-
వనస్థలిపురంలో చైన్‌స్నాచింగ్
వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌లో బుధవారం ఉదయం చైన్‌స్నాచింగ్ జరిగింది. రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న శాంతమ్మ మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును వెనుక నుంచి బైక్‌పై వేగంగా వచ్చిన దుండగులు తెంపుకుని పోయారు. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవటంతో ఆమె కేకలు వేసినా ఫలితం లేకపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
స్నాచింగ్‌కు పాల్పడిన బీటెక్ స్టూడెంట్ అరెస్ట్
జల్సాలకు అలవాటపడి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం నగరంలోని ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగుడు గొలుసు లాక్కెళ్లాడు. ఈ సంఘటన పై బాధితురాలు పోలీసులను ఆశ్రయించండంతో.. పోలీసులు సమీపంలోని సీసీ టీవీ ఫూటేజిల ఆధారంగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తులాల మంగళ సూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. రవికుమార్ నగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. -
మీర్పేట్లో చైన్ స్నాచింగ్
మీర్పేట్ పరిధిలోని భూపేష్ గుప్త నగర్లో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నాగమణి అనే మహిళ మెడలోని గొలుసును గుర్తుతెలియని దుండగుడు లాక్కెళ్లాడు. చోరీ కాబడిన గొలుసు 5 తులాలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేల్పూరు లో చైన్ స్నాచింగ్
రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం అమీనాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
ఎల్బీనగర్లో చైన్ స్నాచింగ్..
3.5 తులాల బంగారు గొలుసు అపహరణ హైదరాబాద్‌సిటీ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాధవ నగర్ కాలనీలో చైన్‌స్నాచింగ్ జరిగింది. గుర్తుతెలియని దుండగులు లక్ష్మమ్మ అనే వృద్ధురాలి మెడలోని 3.5 తులాల బంగారు గొలుసును తస్కరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మీర్పేట్లో చైన్‌స్నాచింగ్
మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో చైన్‌స్నాచింగ్ చోటుచేసుకుంది. స్కూలు నుంచి కుమారుడిని తీసుకువస్తోన్న శిరీష అనే మహిళ మెడలోని గొలుసును గుర్తుతెలియని దుండగులు లాకె ్కళ్లారు. చోరీకి గురైన బంగారు గొలుసు రెండుతులాలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘సింగిల్ హ్యాండ్ స్నాచర్’..మోసిన్
స్నాచింగ్... ఈ పేరు చెప్పగానే ఓ ద్విచక్ర వాహనం, దానిపై హెల్మెట్/మాస్క్‌లతో దూసుకువచ్చే ఇద్దరు వ్యక్తులు గుర్తుకువస్తారు. దీనికి భిన్నంగా సిటీలో సింగిల్ హ్యాండ్ స్నాచింగ్ సైతం జరిగింది. మధ్య మండలంలోని అబిడ్స్ ఠాణా పరిధిలో గతేడాది ఈ ‘సింగిల్ హ్యాండర్’ పంజా విసిరాడు. ఓ ఆటోను వెంబడిస్తూ వచ్చిన దుండగుడు... అదును చూసి అందులోని ప్రయాణికురాలి మెడలో గొలుసు తెంచుకుపోయాడు. ఎనిమిది నెలలుగా మిస్టరీగా ఉన్న ఈ నేరగాడు మరెవరో కాదు... మహ్మద్ మోసిన్ అలీ షాగా తేలింది. శనివారం పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన రెండు ముఠాలకు చెందిన నలుగురిలో ఇతడొకడు. పండిత పుత్ర... మాదిరిగా నగరానికి చెందిన మహ్మద్ సర్వర్ అలీ షా వత్తిరీత్యా వైద్యుడు. ప్రస్తుతం దుబాయ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఈయన కుమారుడే మోసిన్ అలీ షా. చిన్నప్పటి నుంచీ నేరాలు చేస్తుండటంతో కుటుంబానికి దూరమయ్యాడు. కాచిగూడలోని ఛాపెల్ బజార్లో ఓ గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఓ యువతితో అయిన పరిచయం ప్రేమగా మారింది. ప్రేయసితో కలిసి జల్సాలు చేయడం కోసం స్నాచింగ్స్ బాటపట్టాడు. ఏడాదిన్నర కాలంలో ఆసిఫ్‌నగర్, హుమాయూన్‌నగర్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్నగర్, రాంగోపాల్‌పేట్, చిక్కడపల్లి, చిలకలగూడ, నాంపల్లి, అబిడ్స్, నల్లకుంట, సుల్తాన్‌బజార్ ఠాణాల పరిధిలో 18 గొలుసు దొంగతనాలు చేశాడు. కొన్ని నేరాలు చేయడానికి కోఠికి చెందిన విద్యార్థి సయ్యద్ జమీల్ హుస్సేన్‌ను వాడుకున్నాడు. అతడికి ఉన్న అవసరాలకు ఆసరాగా చేసుకుని నేరాలు చేసేప్పుడు తన వెంట తిప్పుకున్నాడు. పక్కా ప్లాన్ తో.. తన అవసరాలకు తగ్గట్టు సిటీలో వరుస స్నాచింగ్స్ చేసిన ఘరానా దొంగ మోసిన్ అలీ పోలీసులకు చిక్కకుండా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. వీరు ఓ నేరం చేసిన తర్వాత ఆ సొత్తును సొమ్ము చేసుకునేవాడు. అది ఖర్చయ్యే వరకు మరో స్నాచింగ్ చేసే వాడు కాదు. గతేడాది మేలో అలిషా అనే వ్యక్తి నుంచి చోరీ వాహనమైన నీలి రంగు పల్సర్ ఖరీదు చేశాడు. అబిడ్స్ స్నాచింగ్‌తో పాటు మిగిలినవీ దీని పైనే తిరుగుతూ చేశాడు. కేవలం స్నాచింగ్స్ చేయడానికి మాత్రమే దీన్ని వినియోగించే వాడు. ఇతడి ప్రేయసి కాచిగూడలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెను కలవడానికి వెళ్తున్న నేపథ్యంలోనే వివిధ కారణాలు చెప్పి అక్కడి పార్కింగ్ నిర్వాహకుడితో పరిచయం పెంచుకున్నాడు. ఓ స్నాచింగ్ చేసిన తర్వాత వాహనాన్ని ఆ పార్కింగ్‌లోనే పెట్టి మిగిలిన సమాయాల్లో యాక్టివా వాహనంపై తిరిగేవాడు. వాట్సాప్ ద్వారా క్రై మ్ అప్డేట్స్... మోసిన్ షాను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ బందం అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో టాస్క్‌ఫోర్స్‌తో పాటు శాంతిభద్రతల విభాగం పోలీసులు అరెస్టు చేసిన దొంగలు, నగరంలో జరుగుతున్న స్నాచింగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉండటం చేసి అవాక్కయ్యారు. ఆరా తీయగా... వార్తల్ని మార్పిడి చేసుకునే ఓ వాట్సాప్ గ్రూప్‌లో తాను సభ్యుడిగా మారానని చెప్పాడు. ఆ గ్రూప్ ద్వారానే పోలీసుల కదలికలు, నగరంలో స్నాచింగ్స్ తీరుతెన్నులు తెలుసుకుంటూ పంజా విసిరేవాడినని వివరించాడు. మోసిన్ షా తాను స్నాచింగ్ చేసిన మర్నాడు ఈ గ్రూప్‌తో పాటు పత్రికల్నీ క్షుణ్ణంగా పరిశీలించే వాడట. ఎక్కడైనా సీసీ కెమెరాల్లో తన ఫొటో రికార్డు అయిందా? ఆ వివరాలు పోలీసులు గుర్తించారా? తదితర అంశాలు తెలుసుకోవడానికి ఇలా చేసే వాడినని టాస్క్‌ఫోర్స్ విచారణలో బయటపెట్టాడు. అబిడ్స్ ఠాణా పరిధిలో 2015 అక్టోబర్ 29న ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై సింగిల్‌గా పంజా విసిరిన ఫుటేజ్ కొన్ని రోజుల తర్వాత బయటకు రావడంతో కాస్తంత ఉలిక్కిపడ్డాడట ఈ ఘరానా స్నాచర్. మోసిన్, జమీల్‌లను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన ఆసిఫ్‌నగర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
దైవ దర్శనానికి వెళ్తుండగా..
కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో దైవ దర్శనానికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేటకు చెందిన సులోచన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని అటునుంచి కొండగట్టుకు వస్తుండగా.. వీరిని అనుసరిస్తూ.. పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
మంగళసూత్రాన్ని తెంపుకెళ్లిన దుండగలు
బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఓ మహిళ మెడలోంచి మంగళసూత్రాన్ని తెంపుకుపోయారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన లక్ష్మమ్మ (51) ఆదివారం ఉదయం నడుచుకుంటూ వెళుతుండగా... వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అమె మెడలో ఉన్న మూడు తులాల మంగళ సూత్రాన్ని తెంపుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. -
చిత్తూరు జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
చిత్తూరు జిల్లాలో పలు దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఉత్తర్‌ప్రదేశ్ వాసిని పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ రాజేంద్రప్రసాద్ కథనం..ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన సంజయ్‌కుమార్ యాదవ్(27) గత కొంతకాలంగా తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్ద తిప్పసముద్రం మండలాల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నాడు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. బుధవారం ఉదయం అతడు తంబళ్లపల్లె వద్ద ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ2.50 లక్షల విలువైన 97 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. -
గొలుసును పోగొట్టుకుని..చైన్ స్నాచింగ్ అంటూ ఫిర్యాదు
తన గొలుసును ఎక్కడో పోగొట్టుకున్న ఓ మహిళ.. కుటుంబసభ్యులకు చెప్పేందుకు భయపడి... చైన్‌స్నాచింగ్ జరిగిందంటూ నాటకమాడింది. చివరికి పోలీసుల దర్యాప్తులో దొరికిపోయింది. సరూర్‌నగర్ సీఐలు లింగ య్య, సునీల్ తెలిపిన వివరాలివీ... తమ ఇంటి సమీపంలోని దుకాణానికి నడిచి వెళుతుండగా వెనక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తన మెడలోని మూడు తులాల బంగారు గొలుసు తెంచుకు పోయారని మాతాలక్ష్మీనగర్ కాలనీలోని సాయి ఎన్క్లేవ్ అపార్టుమెంటులో నివసించే గెంటి వనజాక్షి(43) బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సీఐ సునీల్, సీఐ శ్రీనివాసులు కేసు విచారణలో భాగంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు చేసిన మహిళ వనజాక్షిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె ఉండే అపార్టుమెంట్లో ఉన్న సీసీ ఫుటేజి పరిశీలించగా చైన్‌స్నాచింగ్ సమయంలో కానీ, అంతకు ముందు కానీ వనజాక్షి బయటకు వెళ్లలేదని గుర్తించారు. దీంతో ఆమెను గట్టిగా ప్రశ్నించగా చైన్ స్నాచింగ్ జరగలేదని స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితం గొలుసు ఎక్కడో పడిపోయిందని కుటుంబ సభ్యులు ఏమైనా అంటారేమోనని అబద్ధం చెప్పినట్లు ఒప్పుకుంది. ఇంటి పక్కన నివసించే ఓ వ్యక్తి స్నాచింగ్ జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎలాగోలా గొలుసు రికవరీ చేసి ఇస్తారని చెప్పటంతో ఈ పని చేసినట్టు చెప్పింది. తప్పుడు పిర్యాదు చేస్తే చర్యలు... ఎవరైనా ఇలాంటి తప్పుడు పిర్యాదుచేస్తే వారిపైనే కేసులు నమోదు చేస్తామని సీఐలు లింగయ్య, సునీల్ స్పష్టం చేశారు. తప్పుడు ఫిర్యాదుల కారణంగా వాస్తవంగా నష్టపోయిన వారికి అన్యాయం జరిగే ప్రమాదముందని తెలిపారు. -
పట్టపగలే చైన్ స్నాచింగ్‌లు
13 తులాల బంగారు గొలుసులు అపహరణ పోలీసులమని నమ్మించి బంగారు గొలుసులు లాక్కొన్న వైనం భయాందోళనలో మహిళలు బళ్లారి : బళ్లారి నగరంలో పట్టపగలే, జన సంచారం ఉన్న ప్రాంతాల్లో మహిళల మెడలో బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన ఘటనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో నగరంలోని పార్వతీనగర్, నెహ్రు కాలనీల్లో ఏకకాలంలో ఇద్దరు మహిళల మెడలలోని గొలుసులను చాకచక్యంగా దోచుకెళ్లారు. నగరంలోని ప్రగతి కృష్ణా గ్రామీణ బ్యాంకు ఎదురుగా నెహ్రుకాలనీలో పార్వతమ్మ అనే మహిళ వద్ద ఇద్దరు వ్యక్తులు ఆగి తాము పోలీసులమని నమ్మించి, నగరంలో చోరీలు జరుగుతున్నాయని, బంగారు ఆభరణాలను ఎందుకు వేసుకుని తిరుగుతారని హెచ్చరిస్తూనే ఆమె మెడలోని బంగారు ఆభరణాలను చాకచక్యంగా లాక్కొని పరారయ్యారు. ఆమె గట్టిగా ఆరిచేలోపు దొంగలు ద్విచక్ర వాహనంలో పరారయ్యారు. అదే సమయంలో నగరంలో పార్వతీనగర్‌లోని టీవీఎస్ షోరూం సమీపంలో సిద్దమ్మ అనే మహిళపై ఇద్దరు వ్యక్తులు బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యారు. ఈ విషయం తెలిసిన జిల్లా ఎస్పీ ఆర్.చేతన్, ఏఎస్పీ, డీఎస్పీ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని బాధితుల వద్ద వివరాలు సేకరించారు. ఈ ఘటనలపై గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగర మహిళల్లో ఆందోళన : బళ్లారి నగరంలో పట్టపగలే మహిళల మెడలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లుతుండటంతో మహిళలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. నగరంలో ఇటీవల మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దోచుకెళుతున్న సంఘటనలు పదే పదే చోటు చేసుకుంటుండటంతో నగర ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పోలీసులకు కూడా దొంగలు సవాల్ విసురుతూ తమ పని తాము చేసుకుని వెళుతున్నారు. అసలే భగభగ మండుతున్న ఎండలకు రాత్రిళ్లు ఇళ్ల లోపల పడుకునేందుకు చేతకాకపోవడంతో ఇంటి బయట, మిద్దెలపైన కొందరు నిద్రిస్తున్నారు. దీంతో ఇప్పటికే బళ్లారి నగరంలోని ఏదో ఒక కాలనీలో ప్రతి రోజు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో దొంగతనాలను ఆరికట్టేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
దమ్మాయిగూడలో చైన్ స్నాచింగ్
జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అన్నపూర్ణ అనే మహిళ మెడలోని 5 గ్రాముల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతా నేరమయం
♦ జిల్లాలో పెరుగుతున్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు ♦ ఆగని ఎర్రచందనం అక్రమ రవాణా ♦ నేరాల నియంత్రణకు పటిష్ట ప్రణాళిక అవసరం కడప అర్బన్: జిల్లాలో ఇటీవలి కాలంలో నేరాలు పెరిగాయి. దొంగతనాలు, దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లు విపరీతంగా జరుగుతున్నాయి. దొంగతనాలను అరికట్టడంలో జిల్లా పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అపారమైన ఎర్రచందనం సంపదను అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్లు దోచుకెళుతున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాటీ నేతృత్వంలో గత ఏడాది ఎర్రచందనం అక్రమ రవాణా నివారణ విభాగం (ఆర్‌ఎస్‌టీఎఫ్) ఆధ్వర్యంలో అప్పటి ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ, ప్రస్తుత ఓఎస్డీ సత్య ఏసుబాబులు తమ సిబ్బందితో అంతర్జాతీయ, జాతీయ స్థాయి స్మగ్లర్లను అరెస్టు చేసి కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ నిత్యం ఎర్రచందనం తరలిపోతూనే ఉంది. ♦ 2014లో 152 దొంగతనాలు జరగ్గా, వాటిలో ఇంకా 41 దొంగతనాల గురించి పోలీసులు తేల్చలేకపోయారు. 77 హత్యలు జరగ్గా ఇంకా 57 హత్యల వ్యవహారం కోర్టులో నడుస్తోంది. 10 హత్య కేసులు విచారణలో ఉన్నాయి. 31 కిడ్నాప్ కేసులు నమోదు కాగా వాటిలో 6 కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. 29 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 22 కేసులకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతోంది. 212 చీటింగ్ కేసులు నమోదు కాగా, 345 కేసులను కోర్టులో విచారిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల ద్వారా 616 మంది మృతి చెందారు. మొత్తం 5924 కేసులు నమోదు కాగా, 1852 కోర్టులో విచారణలో ఉన్నాయి. 301 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 353 పోలీసు దర్యాప్తులో ఉన్నాయి. ♦ 2015లో దొంగతనాలు 198 జరగ్గా, 91 కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయి. 107 పోలీసు స్టేషన్లలో విచారణలో ఉన్నాయి. 66 హత్యలు జరగ్గా 41 కోర్టులో విచారణలో ఉన్నాయి. 26 కేసులను పోలీసులు దర్యాప్లు చేస్తున్నారు. కిడ్నాప్ కేసులు 41 నమోదుకాగా, 22 కోర్టుల్లోనూ, 12 పోలీసుస్టేషన్లలోనూ విచారిస్తున్నారు. అత్యాచారం కేసులు 33 కాగా, 17 కోర్టుల్లోనూ, 16 పోలీసుస్టేషన్లలోనూ విచారిస్తున్నారు. 297 చీటింగ్ కేసులు నమోదు కాగా, వాటిల్లో 61 కోర్టుల్లోనూ, 177 పోలీసుస్టేషన్లలోనూ విచారిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో 453 మంది మృతి చెందగా, 232 కోర్టులోనూ, 112 పోలీసుస్టేషన్లలోనూ ఇంకా విచారణ కొనసాగుతోంది. జిల్లా మొత్తం మీద 2015లో 8614 కేసులు నమోదు కాగా, 2212 కేసులు కోర్టులో విచారిస్తున్నారు. 1839 పోలీసు స్టేషన్లలో విచారణ కొనసాగుతోంది. ♦ 2016వ సంవత్సరం ఈ నెల 21వ తేదీ వరకు 1642 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 52 దొంగతనాల కేసులు, 17 హత్యలు , 211 రోడ్డు ప్రమాదాలు, 7 కిడ్నాప్‌లు ఉన్నాయి. పోలీసులపై పనిభారం జిల్లాలో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు మూడు వేల మందికి పైగా పనిచేస్తున్నారు. హోం గార్డులు 900 మంది పనిచేస్తున్నారు. జిల్లా జనాభా సుమారు 30 లక్షలు కాగా, కనీసం ప్రతి వెయ్యి మందికి ఒక పోలీసు కూడా లేరు. అంతేకాకుండా వివిధ రకాల బందోబస్తులు, అంతర్జిల్లా, జిల్లా స్థాయి బందోబస్తులు నిరంతరం ఉంటూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలీసులపై మరింత భారం పడింది. దీనికితోడు నేరస్తులు రకరకాల పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతూ ఎప్పటికప్పుడు పోలీసులకు సవాలుగా మారుతున్నారు. ఏది ఏమైనా జిల్లాలో నేరాల నివారణకు పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రికార్డులను పరిశీలిస్తే 2015 సంవత్సరంలో ట్రిపుల్ సీ (సెంట్రల్ కంప్లైంట్ సెల్)కు 4255 ఫిర్యాదులు రాగా, వాటిల్లో 4166 పరిష్కరించారు. ఇంకా 89 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. 2016 సంవత్సరం ఇప్పటివరకు 937 ఫిర్యాదులు ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌కు రాగా, 521 ఫిర్యాదులను పరిష్కరించారు. ఇంకా 416 పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఎక్కువ భాగం పోలీసు స్టేషన్లలో నిజమైన బాధితులకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుకుబడి, అధికారం, డబ్బు ఉన్న వారికే న్యాయం జరుగుతోందనే విమర్శలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారులు స్పందించినా కింది స్థాయి సిబ్బంది సరిగా స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. -
చైన్ స్నాచింగ్‌కు ఆగంతుకుల యత్నం
మహిళ మెడలో పుస్తెలతాడును తెంపుకుపోయేందుకు ఇద్దరు ఆగంతకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో స్నేహపురి కాలనీరోడ్ నంబర్14లో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు జీఎహెచ్ఎంసీ స్వీపర్‌గా విధుల్లో ఉన్న శారద (58) అనే మహిళ మెడలోని పుస్తెలతాడును తెంపుకుపోయేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు వేయడంతో పరారయ్యారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అర్థరాత్రి చైన్ స్నాచింగ్
సికింద్రాబద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అగంతకులు మహిళ మెడలో పుస్తెల తాడును తెంచుకుపోయారు. శ్రీనివాసనగర్ కు చెందిన సంగీత(28) గురువారం బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై.. భర్తతో కలిసి అర్థరాత్రి సమయంలో తిరిగి వస్తున్నారు. స్కందగిరి ఆలయ సమీపంలో బైక్ పై వచ్చిన అగంతకుడు ఆమె మెడలో ఉన్నగొలుసు తెంపుకు పోయాడు. బంగారు గొలుసు రెండున్నర తులాలు ఉంటుందని బాధితులు తెలిపారు. దీనిపై బాధితురాలు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నలుగురు దొంగలు అరెస్ట్..
- రూ. 7 లక్షల బంగారం స్వాధీనం తెనాలి(గుంటూరు) రెండు తెలుగు రాష్ట్రాలలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను తెనిలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో చైన్‌స్నాచింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించగా.. చోరీల విషయం బయటపడింది. ఈ ముఠా ఇప్పటి వరకు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్‌లతో పాటు చోరీలకు పాల్పడినట్లు తేలడంతో.. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
శ్రీకాకుళంలో చైన్ స్నాచింగ్
శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణవేణి మెడలోంచి బంగారు చైన్‌ను దుండ గుడు లాక్కెళ్లాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. కృష్ణవేణి పీల్డ్ నుంచి ఇంటికి సైకిల్‌పై వెళుతుండగా మోటార్‌బైక్‌పై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ విషయమై ఆమె సరిబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
బోయిన్‌పల్లిలో చైన్ స్నాచింగ్
రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం తమ్మంపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చె ందిన పులి మంజుల(32) బీడీల ఫ్యాక్టరీకి వెళ్లి వస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించేది లేదని డీజీపీ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. మావోయిస్టులైనా, ఉగ్రవాదులైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమన్నారు. బుధవారం డీజీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో అనురాగ్‌శర్మ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఈ సంవత్సరం 92,685 కేసులు నమోదు చేశామని చెప్పారు. గతంతో పోల్చితే నేరాలు స్వల్పంగా తగ్గడంతో పాటు పోలీసుల పనితీరు చాలా మెరుగుపడిందన్నారు.సొత్తు కోసం హత్యలు, కిడ్నాప్‌లు, ఘర్షణలు, సైబర్ నేరాలు కాస్త తగ్గాయన్నారు. చైన్ స్నాచింగ్‌కు సంబంధించిన కేసులు పెరిగాయన్నారు. గతేడాది 678 సైబర్ నేర కేసులు నమోదవగా.. ఈ ఏడాది 634కు తగ్గాయన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద గతేడాది 1171 కేసులు నమోదవగా ఈ ఏడాది 1288కు పెరిగాయన్నారు. అలాగే వివిధ రకాల నేరాలపై అనురాగ్‌శర్మ వెల్లడించిన విషయాలను ఆయన మాటల్లోనే... మహిళలపై పెరిగిన నేరాలు.. ఈ ఏడాది మహిళలపై నేరాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది 1020 అత్యాచార కేసులు నమోదయ్యాయి. సీఐడీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని చంద్రపూర్, కర్నూలు, హైదరాబాద్‌లో దాడులు నిర్వహించి మొత్తం 808 మంది మహిళలను వ్యభిచార కూపాల నుంచి రక్షించాం. వీరిలో 308 మంది బాలికలున్నట్లు గుర్తించి వారిని రెస్క్యూ హోమ్‌లకు తరలించాం. మహిళల అక్రమ రవాణాకు సంబంధించి మొత్తం 554కేసులు నమోదవగా 381 మంది ట్రాఫికర్స్‌ను అరెస్టు చేశాం. మహిలపై వేధింపులను అరికట్టడంలో ‘షీ’టీమ్స్ సమర్థవంతంగా పనిచేశాయి. మొత్తం 660 కేసులలో 825 మంది పోకిరీల(ఈవ్‌టీజర్లు)ను అరెస్టు చేశాం. అలాగే ఆపరేషన్ స్మైల్ ద్వారా 2,552 తప్పిపోయిన చిన్నారులను గుర్తించామని, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2,729 మంది గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 1108 మందిని తల్లిదండ్రుల చెంతకు చేరవేశామని, మిగతా వారు రెస్క్యూహోంలలో ఉంచాం. రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం... రోడ్డు ప్రమాదాల బారినపడి ఏటా పెరుగుతున్న మరణాల దృష్ట్యా జాతీయ, రాష్ట్ర రహదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాం. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18,534 కేసులు నమోదవగా, 6,495 మంది మృత్యువాతపడ్డారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన వారి నుంచి ఈఏడాది రూ.35.53 కోట్లు వసూలు చేశాం. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఉన్న ఈ చలాన్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నాం. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది... రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలను సమర్థవంతంగా నిలువరించగలిగాం. ఈ ఏడాది 11 మందిని అరెస్టు చేయగా, 12 మంది లొంగిపోయారు. ఎదురు కాల్పుల్లో ఆరుగురు మరణించగా... వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. నిఘా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడం వల్ల మావోయిస్టులతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించగలిగాం. ముగ్గురు యువకులు ఐఎస్ఐఎస్లో చేరడానికి ఇంట్లో నుంచి పారిపోయిన 24 గంటల్లోనే గుర్తించగలిగాం. సంస్కరణలకు ప్రాధాన్యం... పోలీసుశాఖలో సంస్కరణలో భాగంగా స్టేషన్ల ఆధునీకరణకు పెద్ద పీట వేస్తున్నాం. హైదరాబాద్, సైబరాబాద్ మాదిరిగా అన్ని జిల్లాల పోలీస్ స్టేషన్లను ఆధునీకరించేందుకు మొదటి విడుతలో రూ.26 కోట్లు మంజూరు చేశాం. అలాగే... జిల్లాలోని ఎస్పీలతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ కోసం ఏర్పాట్లను పూర్తిచేశాం. పోలీసు శాఖలో త్వరలో పది వేలకు పైగా రిక్రూట్‌మెంటులు నిర్వహించబోతున్నాం. -
పొద్దున్నే తెంపేశారు
-
పొద్దున్నే తెంపేశారు
లంగర్‌హౌజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయాన్నే చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళ తన ఇంటి ముందు ఉండగా బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్రస్ అడుగుతూనే ఆమె మెడలోని ఆరు తులాల బంగారు గొలుసును లాక్కుని క్షణాల్లో మాయమయ్యారు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
'తూర్పు' దారిలో నేత్తుటేరులు
‘తూర్పు’న ఈ సంవత్సరం రక్తచరిత్రను లిఖించింది. అత్యంత ఘోరంగా జరిగిన ప్రమాదాలు, వివిధ సంఘటనలు జిల్లావాసులను తీవ్ర కలవరపాటుకు గురి చేశాయి. పుష్కరాల తొలిరోజున జరిగిన తొక్కిసలాటలో 29 మంది.. ధవళేశ్వరం బ్యారేజి పైనుంచి తూఫాన్ వ్యాన్ బోల్తా పడి 22 మంది.. గండేపల్లివద్ద లారీ బోల్తా పడి 16 మంది మృత్యువాత పడిన సంఘటనలు రాష్ర్టవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ఇంకా హత్యలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు.. దోపిడీలు, దొంగతనాలు, చైన్స్నాచింగ్లవంటి ఘటనలతో జిల్లావాసులు బెంబేలెత్తారు. - కాకినాడ క్రైం/రాజమండ్రి క్రైం రహదారులు రక్తసిక్తం ఫిబ్రవరి 1 : రాజమండ్రి మోరంపూడి సెంటర్లో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. వేమగిరివైపు వెళ్తున్న స్కూల్ బస్సు.. బ్రేక్‌లు ఫెయిలవడంతో అదుపుతప్పి ఒక కారును, మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొని, పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మండపేట గొల్లపుంతకు చెందిన ఇనుపకోళ్ళ దుర్గాప్రసాద్ (13), రాజమండ్రి గాంధీపురానికి చెందిన ర్యాలి వెంకన్న (55), కాకినాడ రూరల్ కరప మండలం కోదాడకు చెందిన శివనేని మహాలక్ష్మి (70) దుర్మరణం పాలయ్యారు. జూన్ 4 : రంపచోడవరం సమీపంలో పెళ్లిబృందం వ్యాన్ బోల్తా పడి తొమ్మిది మంది మృతి చెందారు. జూన్ 13 : ధవళేశ్వరం బ్యారేజి పైనుంచి దిగువన ఉన్న స్కవర్ స్లూయిజ్లోకి తూఫాన్ వ్యాన్ అర్ధరాత్రి బోల్తా పడిన దుర్ఘటనలో.. అందులో ప్రయాణిస్తున్న 22 మంది నిద్రలోనే మృత్యువాత పడ్డారు. మృతులందరూ విశాఖ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు. సెప్టెంబర్ 14 : గండేపల్లివద్ద జాతీయ రహదారిపై లారీ బోల్తాపడి 16 మంది వలస కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 18 మంది గాయాలతో బయటపడ్డారు. ఈ ఏడాది జిల్లా పోలీసుల పరిధిలో 556 రోడ్డు ప్రమాదాలు జరగగా, వాటిలో 592 మంది మృతి చెందారు. 1163 మంది గాయపడ్డారు. రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లా పరిధిలో 483 ప్రమాదాలు జరగగా, 163 మంది మృతి చెందారు. 492 మంది గాయపడ్డారు. వణికించిన హత్యలు జిల్లాలో గత ఏడాది నమ్మకద్రోహం కేసులు 96 నమోదైతే, ఈ సంవత్సరం ఆ సంఖ్య 102కు చేరుకుంది. మహిళలపై లైంగిక దాడులు గత ఏడాదికంటే ఈసారి 13 పెరిగాయి. జనవరి 23 : పిల్లలు పుట్టలేదన్న కోపంతో రామచంద్రపురంలో భార్య వెంకటలక్ష్మి మెడకు తాడు బిగించి భర్త పడగ అంజి హత్య చేశాడు. దీనిని ఆత్మహత్యగా చిత్రించేందుకు ప్రయత్నించాడు. ఫిబ్రవరి 5 : రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డు కోకా భాస్కరరావు వీధిలో గంటా నరసింహమూర్తి, గంటా సంతోషి(24)లకు 2, 3 ఏళ్ల పిల్లలు ఇద్దరున్నారు. తన పిన్ని కొడుకుతో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో సంతోషిని నరసింహమూర్తి రాడ్డుతో కొట్టాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఫిబ్రవరి 7 : మండపేటకు చెందిన దుర్గాదేవి(35)కి కపిలేశ్వరపురం మండలం కాలేరుకు చెందిన మేనమామ బూరుల వీరబాబుతో పద్దెనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. రెండేళ్ల క్రితం దుర్గాదేవి మండపేటకు చెందిన తాపీమేస్త్రి గణేష్‌తో వెళ్లిపోయింది. కాకినాడలోని ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారు. వారిమధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. ఈ నేపథ్యంలో దుర్గాదేవిని గణేష్ గొంతు నులిమి హత్య చేశాడు. ఫిబ్రవరి 20 : సఖినేటిపల్లి చర్చిపేటలో ఉంటున్న చింతపల్లి మంగాదేవి(28)ని భర్త సత్యనారాయణ గొంతు నులిమి చంపాడు. ఖత్తర్‌లో ఉండగా 2010లో వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీనికి సత్యనారాయణ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తిరిగి ఖత్తర్ వెళ్లిపోయాడు. మూడు నెలల తరువాత ఖత్తర్ నుంచి వచ్చిన సత్యనారాయణ భార్యతో ఘర్షణకు దిగాడు. బంధువులపై పెట్టిన కేసు ఉపసంహరించుకునే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న భార్యను సత్యనారాయణ హత్య చేశాడు. మార్చి 2 : కొత్తపేట మండలంలో అంతటి శిరీష(25)ను ఆమె భర్త గెడ్డం జగదీష్ చీరకొంగుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని స్నేహితుల సహాయంతో ఆటోలో తీసుకువెళ్లి, పాశర్లపూడి డ్రైనేజీ గట్టున పాతిపెట్టాడు. మార్చి 13 : రాయవరం మండలం చెల్లూరు కొత్తపేట కాలనీకి చెందిన గుత్తుల సూర్యారావుకు, కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన వీర రాఘవమ్మ(44)తో 24 ఏళ్లక్రితం వివాహమైంది. ఆమెపై అనుమానంతో కర్రతో విచక్షణా రహితంగా కొట్టి చంపాడు. మే 19 : రాజోలు మండలం వేగివారిపాలేనికి చెందిన బొక్కా మధుసూదనరావుకు, పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన దుర్గభవాని(26)తో వివాహమైంది. గల్ఫ్‌లో ఉంటున్న అతడు వివాహహానంతరం భార్యను అక్కడకు తీసుకువెళ్ళాడు. గర్భవతి కావడంతో తిరిగి ఇంటికి పంపించాడు. గొడవల నేపథ్యంలో అత్తవారిపై దుర్గాభవాని కేసు పెట్టింది. గల్ఫ్ నుంచి వచ్చిన మధుసూదనరావు అత్తవారింటికి వెళ్లి భార్యను తనతో తీసుకువెళ్లాడు. ఆ రోజు రాత్రి తాటిపాకలో ఒక హోటల్లో గడిపారు. ఉదయం గదులు శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది దుర్గాభవాని మృతి చెంది ఉండడం గమనించారు. సెప్టెంబర్ 29 : గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన గుదే శ్రీనివాస్ తాపీపని చేసుకుని జీవిస్తాడు. భార్య ఝాన్సీ టైలరింగ్ చేస్తుంది. రాజమండ్రి తుమ్మలావలోని అద్దె ఇంట్లో వారు నివసిస్తున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాస్ ఆమెను కత్తెరతో పొడిచి హత్య చేశాడు. డిసెంబర్ 11 : యానాం దరియాలతిప్పవద్ద గౌతమీ గోదావరిలో కారు జలసమాధి అయి ఆరుగురు మృతి చెందారు. లక్షల రూపాయలు అప్పు చేసిన కొప్పాడ పవన్‌కుమార్.. వాటిని తీర్చే దారి కానరాక, ఒత్తిళ్లకు తాళలేక.. ఆత్మహత్యకు పథకం వేశాడు. తనతోపాటు కారులో కుటుంబ సభ్యులను కూడా తీసుకువెళ్లి గోదావరిలో జలసమాధి అయ్యాడు. పేట్రేగిన చైన్‌స్నాచర్లు జిల్లాలో చైన్‌స్నాచర్లు పేట్రేగిపోయారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ముఠాలు, చెడు వ్యసనాలకు బానిసైన విద్యార్థులు, చదువు మధ్యలో ఆపేసినవారు వీటికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని వారి మెడలోని బంగారు ఆభరణాలు దోచుకుపోతున్నారు. రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లాలో 120 చైన్ స్నాచింగ్ కేసులు నమోదవగా.. మూడింటిలో మాత్రమే నిందితులను అరెస్టు చేయగలిగారు. కొందరు ఆటో డ్రైవర్లుగా అవతారమెత్తి, కిరాయికి ఎక్కిన మహిళలను నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి వారిపై దాడులకు పాల్పడుతున్నారు. పెరుగుతున్న గంజాయి మత్తు గంజాయి కేసులు కూడా ఈ ఏడాది రికార్డు స్థాయిలోనే నమోదయ్యాయి. గత ఏడాది 27 కేసులలో 73 మందిని అరెస్టు చేసి రూ.82.59 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది 46 కేసులలో 115 మందిని అరెస్టు చేసి, రూ.1.61 కోట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహాపర్వం వేళ.. మాయని మచ్చ పావనవాహిని గోదావరి మహాపర్వం.. పుష్కరాల తొలి రోజైన జూలై 14న రాజమండ్రి పుష్కరాల రేవులో జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. పుష్కరాల చరిత్రలోనే ఈ సంఘటన మాయని మచ్చగా మిగిలింది. ఆ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా పుష్కరాల రేవులో పుష్కర స్నానం ఆచరించడం.. పుష్కరాల ప్రారంభంపై డాక్యుమెంటరీ ఫిల్మ్ చిత్రీకరణ కోసం మూడు గంటలపాటు అక్కడే ఉండిపోవడంతో వేలాదిగా వచ్చిన భక్తులను నిలిపివేశారు. ముఖ్యమంత్రి వెళ్లిన తరువాత ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. సీఎం బాధ్యతారాహిత్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇది జరిగిన చాలా నెలల తరువాత ఈ సంఘటనపై విచారణకు ప్రభుత్వం సోమయాజులు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఈ నెల 12న విచారణ జరపనున్నట్టు ప్రకటించింది. కానీ ఆ రోజు విచారణ జరపలేదు. -
హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్
హైదరాబాద్ లో చైన్ స్నాచర్ లు మరో సారి రెచ్చి పోయారు. సరూర్ నగర్ ప్రాంతంలో శనివారం ఉదయం చైన్ స్నాచింగ్ ఘనట చోటు చేసుకుంది. స్థానిక మహిళ పద్మ(25) ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా.. బైక్ పై వచ్చిన యువకులు ఆమె మెడలో ఉన్న గొలుసు తెంచుకెళ్లారు. చోరీ అయిన బంగారం నాలుగున్నర తులాలు ఉంటుందని బాధితులు తెలిపారు.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో సైదాబాద్ పరిధిలోని రెడ్డి కాలనీ కి చెందిన శాంతి లత ఉదయం పాల కోసం రోడ్డు పై నడిచి వెళుతుండగా.. వెనక నుంచి బైక్ పై వచ్చిన అగంతకులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్
-
అడ్రస్ అడిగి తెంచుకుపోయాడు!
సిటీబ్యూరో: ఒక పల్సర్ బైక్... ఇద్దరు దొంగలు... 45 సెకన్ల సమయం.. సీన్ కట్ చేస్తే మూడు తులాల బంగారు గొలుసు స్నాచింగ్. లంగర్‌హౌస్ ఠాణా పరిధిలోని మొఘల్ కా నాలా ప్రాంతంలో బుధవారం జరిగిన చైన్ స్నాచింగ్ తీరు ఇది. ఈ ఘటన మొత్తం బాధితురాలి ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ ఫీడ్‌ను నగర పోలీసు అధికారిక వెబ్సైట్ ద్వారా గురువారం విడుదల చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ తెలిస్తే వాట్సాప్ నెం:9490616555, లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్: 9490616124, ఎస్సై: 9490616461లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సీసీ కెమెరా ఫీడ్ ప్రకారం... ► జ్యోతి ముందు నుంచే బైక్‌పై వెళ్లిన ఇద్దరు దుండగులు ఆమె ఇల్లు దాటిన తర్వాత ఆగారు. ఒకడు బైక్ పైనే ఉండగా... వెనుక కూర్చున్న వ్యక్తి దిగి జ్యోతి వైపు నడుచుకుంటూ వచ్చాడు. ► జ్యోతి వెనుక నుంచి వేగంగా వచ్చాడు. ఆమె వెనక్కి తిరగడంతో ఆగి బైక్ వైపు రెండు అడుగులు వేసి మళ్లీ వెనక్కి తిరిగాడు. ►జ్యోతికి సమీపంలోకి వచ్చి.. ఆమెను ఓ చిరునామా అడుగుతున్నట్లు నటించాడు. ► సమాధానం చెప్పిన ఆమె ఇంటి గేటు వద్దకు వెళ్తుండగా... వెనుక నుంచి మెడలోని పుస్తెలతాడు లాగేశాడు. అప్పటికే ఇంజిన్ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్న మరో దుండగుడు బైక్‌ను ముందుకు కదిలించగా... పరిగెత్తుకుంటూ వెళ్లి రెండోవాడు బైక్ ఎక్కాడు. ► జ్యోతి అరుస్తూ ఆ బైక్ వెంటపడింది. ఆమె అరుపులు విని ఇంట్లోంచి బయటకు వచ్చిన మరో యువకుడూ వెంబడించినా అప్పటికే స్నాచర్లు సందు దాటేశారు. ► దొంగలు 45 సెకన్ల కాలంలోనే ఈ ‘పని’ పూర్తి చేశారు. ఇదే సమయంలో నాలా వంతెనకు అవతలి వైపు హైదర్గుడలో జరిగిన మరో స్నాచింగ్ కూడా వీరి పనిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. -
హైదరాబాద్ లో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
హైదరాబాద్ లో చైన్ స్నాచర్ లు మరో సారి రెచ్చిపోయారు. పట్టపగలే దోపిడీలకు దిగారు. కంచన్ బాగ్ పరిధిలోని మారుతీ నగర్ వద్ద నాగమణి అనే మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేశారు. రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న ఐదున్నర తులాల బంగారు గొలుసు తెంచుకెళ్లారు. బాధితురాలు కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదవ నగర్ కాలనీ రోడ్ నంబర్ 5లో జరిగింది. రోడ్డు మీద నదుచుకుంటూ వెళుతున్న రాధా దేవి(63) అనే మహిళ మెడలో చైన్ తెంపుకు పోయారు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. పోయిన బంగారు గొలుసు 4తులాలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన యువతి అరెస్టు
గుంటూరు ఈస్ట్: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న యువతిని కొత్తపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నాలుగు సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 1వ తేదీ వెంకటేశ్వరవిజ్ఞాన మందిరం రోడ్డులో పెదకూరపాడు మండలం అబ్బురాజుపాలెం గ్రామానికి చెందిన అమరనేని అనసూయమ్మ సిటీ బస్సు దిగుతుండగా ఓ యువతి ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారం నానుతాడు తెంచుకుని పరారైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం తమిళనాడుకు చెందిన ప్రభుమారి అనే యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె నుండి నానుతాడు స్వాధీనం చేసుకున్నారు. కేసు పురోగతిలో పాల్గొన్న హెడ్‌కానిస్టేబుల్ ఎం డీఎ ఖాన్, సిబ్బంది తనూజా, లక్ష్మి తిరుపతమ్మలను ఎస్సై అభినందించారు. -
మూడు గంటలు.. మూడు చోరీలు
ఒక వైపు హైదరాబాద్ నగరం నిమజ్జనంలో బిజీగా ఉంటే... మరో వైపు దొంగలు అదును చూసి.. చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. వరస చోరీలతో జనాన్ని బెంబేలెత్తించారు. పట్టపగలు ముషీరాబాద్, కాచిగూడ, నల్లకుంటల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. మూడు గంటల్లో 11 తెలాల బంగారాన్ని అపహరించారు. -
కొత్త ‘బంగారు’ దొంగలు
చైన్‌స్నాచింగ్ చేస్తున్న వారంతా కొత్తవారే ఈజీమనీ కోసం యువత అక్రమ మార్గం సిటీబ్యూరో: మొన్న...కంప్యూటర్ హార్డ్‌వేర్ టెక్నీషియన్ పుట్టి వేదవ్యాస్, కారు డ్రైవర్ గంగాపురం నరేశ్, డిగ్రీ చదివిన పుణుగొటి కృపాకర్...తమ జల్సాల కోసం సులభ పద్ధతిన డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్ చేస్తూ నల్లకుంట పోలీసులకు దొరికిపోయారు. వీరిపై గతంలో ఎటువంటి చోరీ కేసులు లేవు. చైన్ స్నాచింగ్‌లు చేయడం వీరికి కొత్త. వీరంతా 30 ఏళ్లలోపు వారే. నిన్న...అక్షయ్ శర్మ, సుమీత్ కుమార్. వీరి వయస్సు 20, 21 సంవత్సరాలే. పదో తరగతి వరకు చదివిన అక్షయ్ శర్మ క్యాటరింగ్ పని చేస్తుండగా, సుమీత్ కుమార్ బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాడు. సయ్యద్ అబ్దుల్ హయ్ అజీమ్ మోహదీతో ఏర్పడిన పరిచయం కాస్తా వీరిని చైన్ స్నాచింగ్‌ల వైపు నడిపించింది. గతంలో అక్షయ్, సుమీత్లపై చోరీ కేసులు లేవు. ఈజీ మనీ కోసమే ఈ బాట పట్టారు. వీరు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, నారాయణగూడ క్రైమ్ టీమ్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో దొరికిపోయారు. ఈ రెండు కేసులే కాదు...ఇటీవల పోలీసులు ఛేదించిన వివిధ చైన్‌స్నాచింగ్ కేసుల్లో గతంలో ఏ మాత్రం దొంగతనాలతో సంబంధం లేని వారే పట్టుబడ్డారు. దీన్నిబట్టి చూస్తే ఈజీమనీ కోసం యువకులు రెచ్చిపోతున్నారన్నది స్పష్టమవుతోంది. ఇంటి వద్ద నుంచి పంపించే డబ్బులు సరిపోకపోవడం, సిటీ లైఫ్‌స్టైల్ జీవితానికి అలవాటుపడటం...ఉద్యోగం ద్వారా వచ్చే జీతం చాలకపోవడం...ప్రియురాళ్ల కోరికలను తీర్చేందుకు...ఇలా కారణం ఏదైతేనేం దొంగలుగా మారిపోతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్న తేడా లేకుండా బంగారు గొలుసు దొంగతనాలు చేస్తూ నగర పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. తనిఖీలు చేస్తున్నా ... ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెల వరకు 213 చైన్ స్నాచింగ్ కేసులు ఆయా పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. వీటిలో 63 శాతం వరకు కేసుల్లో దొంగలను పట్టుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉందని తెలుస్తోంది. సంచలనం సృష్టించిన సుమిత్రా మృతి కేసులో దొంగపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినా పోలీసులు ఇప్పటివరకు ఆ దొంగను పట్టుకోకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోందని సిటీవాసులు అంటున్నారు. చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రతి జోన్లో ఏసీపీ స్థాయి అధికారి వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నా...చైన్ స్నాచర్లు తమ పని తాము కానిచ్చుకొని పోతుండటం పోలీసులను కలవరపెడుతోంది. అయితే బంగారు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నది కొత్తవారే కావడంతో వారిని పట్టుకోవడం తలకు మించిన భారమవుతోందని పోలీసు అధికారి ఒకరు వాపోవడం క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతోంది. ఘరానా దొంగలు జైల్లోనే... జంట కమిషనరేట్ల పరిధిలో వివిధ కేసుల్లో 176 మందిపై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. వీరిలో 162 మందిని జైల్లో పెట్టామని, నిందితుల్లో ఎక్కువ మంది చైన్‌స్నాచర్లు ఉన్నారని పోలీసు ఉన్నతాధికారి బషీర్‌బాగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇటీవల నగరంలో పెరిగిపోయిన దొంగతనాలు ఎవరూ చేస్తున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్తోంది. ఘరానా దొంగలను జైలు ఊచలు లెక్కిస్తున్నా మరీ బయట పెట్రేగిపోతున్న నవయువ దొంగలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కాలేజీ విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న యువత ఈజీమనీ కోసం చైన్ స్నాచర్ల అవతారమెత్తుతున్నారు. వీరికి దొంగతనాలు చేయడం కొత్త అయినా, బైక్ రేసింగ్‌లో మంచి అనుభవం ఉండటంతో అలావచ్చి ఇలా క్షణాల్లో గొలుసులు కొట్టుకెళ్తుతున్నారు. ఈ క్రమంలో బాధితురాళ్లు తీవ్రంగా గాయపడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గత నెలలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో సుమిత్రా తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన ఇప్పటికీ పోలీసుల ముందు కదలాడుతోంది. సీసీటీవీ కెమెరాల నాణ్యత డొల్ల... నిఘా నగరం వైపు అడుగులు వేస్తున్న మన సిటీలో వేలాది సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. అయితే చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న యువకులు ఈ కెమెరాల కంటబడుతున్నారు. అయితే నిఘా నేత్రాల నాణ్యత ఉండకపోవడంతో ఆ దృశ్యాలు స్పష్టంగా కనబడటం లేదు. ఒకవేళ ఆ కెమెరాకు చిక్కిన దొంగ మన కళ్ల ముందు వచ్చి నిలబడిన గుర్తుపట్టలేని పరిస్థితి ఉందని ఓ పోలీసు అధికారి వాపోయారు. ఫొటోలున్నా వారిని పట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫలించిన ప్రయోగాలు
గణనీయంగా తగ్గిన స్నాచింగ్‌లు గతేడాది మొదటి నాలుగు నెలల్లో 220 కేసులు ఈ ఏడాది 103 మాత్రమే నమోదు చైన్స్నాచర్లపై పీడీ యాక్ట్ నమోదే ప్రధాన కారణం సిటీబ్యూరో: నేరాల నివారణ కోసం నగర పోలీసులు చేస్తున్న సరికొత్త ప్రయోగాలు ఫలితాలిస్తున్నాయి. చైన్‌స్నాచింగ్‌లు గణనీయంగా తగ్గడమే ఇందుకు నిదర్శనం. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 2013 (జనవరి నుంచి ఏపిల్)్రలో 265 స్నాచింగ్ కేసులు నమోదు కాగా... 2014లో 220కి తగ్గాయి. ఈ ఏడాదిలో ఆ సంఖ్య 103కు తగ్గింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సాధారణంగా నేరాలు కూడా పెరుగుతుంటాయి. అయితే చైన్‌స్నాచింగ్‌ల విషయంలో మాత్రం పెరగాల్సిన కేసులను మరింత తగ్గించగలిగారు. కరుడుగట్టిన 33 మంది చైన్ స్నాచర్లపై ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం (పీడీ యాక్ట్) ప్రయోగించడంతో పాటు మరో 70 మంది స్నాచర్లను జైళ్లకు పంపడమే ఇందుకు కారణం. నగర పోలీసు కమిషనర్‌గా గతేడాది జూన్ 2న బాధ్యతలు చేపట్టిన ఎం.మహేందర్ హైదరాబాద్‌ను నేర రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగానే చైన్స్నాచర్లపై పీడీయాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించారు. గతంలో కేవలం కరుడు గట్టిన రౌడీషీటర్లపైనే పీడీయాక్ట్ ప్రయోగించేవారు. అయితే, తొలిసారిగా మహేందర్‌రెడ్డి చైన్స్నాచర్లపై పీడీయాక్ట్ ప్రయోగించే కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. గడిచిన 10 నెలల కాలంలో కరుడుగట్టిన 33 మంది స్నాచర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ప్రస్తుతం వీరంతా చర్లపల్లి జైలులో ఉన్నారు. ఏడాది పాటు వీరంతా అక్కడ ఉండాల్సిందే. గతంలో చైన్స్నాచర్లను అరెస్టు చేసి జైలుకు పంపితే ఒకటి రెండు రోజుల్లోనే వారికి బెయిల్ వచ్చేది. బెయిల్‌పై బయటకు వచ్చిన వారు మళ్లీ నేరాలు మొదలుపెట్టేవారు. దీన్ని పసిగట్టిన మహేందర్‌రెడ్డి వారికి బెయిల్ లభించకుండా ఉండేందుకు పీడీ యాక్ట్‌ను ఆయుధంగా చేసుకోవడంతో స్నాచింగ్‌లు తగ్గుతున్నాయి. గతంలో నగరంలోని 60 శాంతి భద్రతల పోలీసుస్టేషన్ల పరిధిలో రోజుకు రెండు చొప్పున స్నాచింగ్‌లు జరగగా.. ఇప్పుడు ఒకటి చొప్పున జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో స్నాచింగ్‌లను పూర్తిగా నివారిస్తామని పోలీసులంటున్నారు. పీడీ యాక్ట్ నమోదైన చైన్‌స్నాచర్లు వీరే... ఈస్ట్‌జోన్: మహ్మద్ సైఫుద్దీన్, మహ్మద్ ఇమ్రాన్, సయ్యద్ముజీబ్. సౌత్‌జోన్: షరీఫ్, అహ్మదుద్దీన్ సిద్దిఖ్, జావేద్, సాలమ్జాబ్రీ, పి.లక్ష్మణ్, సంతోష్‌కుమార్, ఎం.భాస్కర్, సయ్యద్అబ్దుల్మాజీద్, సయ్యద్ అస్లమ్. సెంట్రల్‌జోన్: మహ్మద్‌అమీర్, దాసరి సురేందర్, షేక్‌సలీం, నరేష్బాల్కీ, జి.విజయ్కుమార్చౌదరి, మహ్మద్ఫైసల్, సయ్యద్‌ఇమ్రాన్, అబ్దుల్బిన్హాజీ. వెస్ట్‌జోన్: మహ్మద్ఫైసల్, ఇర్ఫాన్‌ఖాన్, ఖాజాఫరీదుద్దీన్, మహ్మద్అబ్దుల్గఫూర్, మహ్మద్మెహరాజ్, మహ్మద్అఫ్రోజ్, మహ్మద్ఇఫ్తేకర్, మహ్మద్ఫైసల్షాఅలీజాబ్రీ, మహ్మద్ఫర్హాన్, బి.జైకిషోర్సింగ్, వెంకటేష్. నార్త్‌జోన్: మహ్మద్‌ఖలీల్, మహ్మద్ముజీబ్అహ్మద్ మరింత తగ్గిస్తాం బంగారు నగలు ధరించి ఒంటరిగా వెళ్లే మహిళలకు పోలీసులకు అండగా ఉంటారు. మేము తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గత మూడేళ్లలో చైన్‌స్నాచింగ్‌లు తగ్గాయి. రానున్న రోజుల్లో నేరాలను మరింత తగ్గిస్తాం. ఎక్కడైనా స్నాచింగ్ జరిగితే కేవలం నెలరోజుల్లోనే నిందితుడ్ని గుర్తించి బాధితులకు న్యాయం చేస్తాం. ఇందులో భాగంగా ప్రతి స్టేషన్‌పరిధిలో సీసీ కెమెరాల ప్రాజెక్ట్ వర్క్ చురుగ్గా జరుగుతోంది. - మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ -
ప్రేమించలేదనే అక్కసుతో డాక్టర్ దురాగతం
ఢిల్లీ బ్యూరో: తనను ప్రేమించలేదని తోటి డాక్టర్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దానిని చైన్‌స్నాచింగ్‌గా చిత్రీకరించేందుకు యత్నించారు. కానీ మొబైల్ ఆధారంగా అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇందులో ఒకరు మైనర్ కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు మహిళా డాక్టరు అమృత్ కౌర్ బెలారుస్‌లో ఎంబీబీఎస్ చదువుతుండగా ఆమెతోపాటు అశోక్‌యాదవ్ చదువుతున్నాడు. ఈ సమయంలోనే అతను కౌర్‌పై ప్రేమను పెంచుకున్నాడు. కౌర్ అతనిని ప్రేమించలేదు. ఇదిలాఉండగా కౌర్ వివాహం వేరే అతనితో కుదిరింది. ఈ నేపథ్యంలో యాదవ్ అతని స్నేహితుడి సహాయంతో కౌర్‌పై దాడికి వ్యూహం పన్నాడు. మంగళవారం ఉదయం కౌర్ హరినగర్‌లోని తన ఇంటి నుంచి స్కూటీపై ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్తుండగా రాజోరీగార్డెన్‌లో ఫోన్ కాల్ రావడంతో స్కూటీని రోడ్డు పక్కగా ఆపి మాట్లాడుతోంది. మోటారుసైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి బైక్‌పై ముందున్న వ్యక్తి బ్యాగ్ లాక్కోవడానికి చూడగా ఆమె ప్రతిఘటించింది. వెనకాల ఉన్న వ్యక్తి ఆమెపై యాసిడ్‌తో దాడికి పాల్పడ్డాడు. దీంతో కౌర్ ముఖం కుడివైపు భాగం దెబ్బతింది. ఆమె కుడి కన్ను పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనను బ్యాగ్ స్నాచింగ్ ఘటనగా చూపడానికి ప్రయత్నించిన్పటికీ పోలీసులు అనుమానంతో దర్యాప్తు చేశారు. 12 పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు జరిపాయి. కౌర్ చేతి నుంచి లాక్కొన్న బ్యాగు పశ్చిమ ఢిల్లీలోని ఖయాలా ప్రాంతంలో, మొబైల్ ఫోన్ యమునా విహార్ ప్రాంతంలో పోలీసులకు దొరికాయి. మహిళపై దాడి చేసిన తరువాత నిందితులు బ్యాగ్‌లో నుంచి మొబైల్ ఫోన్ తీసుకొని దానిని స్విచాఫ్ చేసి బ్యాగును పారవేశారని,ట్రాన్స్ యమునా ప్రాంతంలో మళ్లీ మొబైల్ ఆన్ చేశారని పోలీసులు పేర్కొంటున్నారు. మొబైల్ ఫోన్ ఆధారంగానే పోలీసులు నిందితులను గుర్తించారు. పశ్చిమ ఢిల్లీలోని మాదీపుర్ ప్రాంతంలో నిందితులను అరెస్టు చేశారు. ఇదిలాఉండగా దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నగరంలో మహిళా డాక్టర్‌పై జరిగిన యాసిడ్ దాడి కేసులో నిందితులైన డాక్టర్, అతడి స్నేహితుడిని అరెస్టు చేసి, ఇద్దరు బాలురను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. -
పోలీస్ రికార్డ్
సాక్షి, సిటీబ్యూరో: చైన్ స్నాచింగ్‌లతో నగరవాసులు, పోలీసుల కంటిమీద కునుకు లేకుండా చేసింది శివ గ్యాంగ్. నిర్మానుష ప్రాంతాల్లోని రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలే వీరి టార్గెట్. బైకుల్లో వేగంగా వచ్చి మహిళల మెడల్లోని పుస్తెలతాడుసహా ఇతర బంగారు ఆభరణాలను లాక్కొని క్షణాల్లో మాయమయ్యేవారు. ఇలా జంట కమిషనరేట్ల పరిధిలో 700 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఆగస్టు 14న అర్ధరాత్రి గ్యాంగ్ లీడర్ శివ పోలీసు కాల్పుల్లో మృతి చెందడం.. ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. శివ స్నాచింగ్ గ్యాంగ్ నుంచి సైబరాబాద్ సీసీఎస్ పోలీ సులు భారీగా సొత్తు రికవరీ చేశారు. రికవరీ చేసుకున్న మంగళసూత్రాలను మహిళలకు అందజేసి రికార్డ్ సృష్టించారు. నెల్లూరు జిల్లాకు చెందిన కడవలూరి శివ (35) తన గ్రామానికి చెందిన నారాయణ తో కలిసి 2002 నుంచి నేర జీవితాన్ని ప్రారంభించాడు. నారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని సోదరుడు మందపాటి జగదీష్ (34), వైజాగ్‌కు చెందిన రాజ్‌కుమార్‌లతో కలిసి నేర సామ్రాజ్మాన్ని విస్తరించాడు.2005లో కృష్ణానగర్‌కు చెందిన నాగమణిని శివ ప్రేమ వివాహం చేసుకున్నాడు. తిరుపతి, విజయవాడ, వైజాగ్, నెల్లూరు, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, కూకట్పల్లి, కుషాయిగూడ, మల్కాజ్‌గిరిలో స్నాచింగ్‌లకు పాల్పడి జైలు కెళ్లాడు. 2012లో జైలు నుంచి విడుదలైన శివ తన భార్య, గ్యాంగ్ సభ్యులు నార్సింగ్‌లో మకాం ఉంటూ జంట పోలీసు కమిషనరేట్లలో 700 స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఈ గ్యాంగ్ కోసం క్రైమ్స్ అదనపు డీసీపీ జానకీషర్మిల ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపగా.. ఆగస్టు 14న అర్ధరాత్రి శివ తన బైక్‌పై శంషాబాద్ పరిసరాల్లో సంచరిస్తున్నాడనే సమాచారం రాగానే సీసీఎస్ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి, ఎస్ఐ వెంకటేష్ ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే.. పోలీసులపై కత్తితో దాడి చేసి పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో శివ మృతి చెందాడు. అతని ఇంటిపై పోలీసులు దాడి చేయడంతో ఆ గ్యాంగ్ నేరాల చిట్టా బహిర్గతమైంది. స్నాచింగ్‌కు పాల్పడిన బంగారు గొలుసులను ముత్తూట్, శ్రీరామ్ సిటీ ఫైనాన్స్‌లలో తాకట్టు పెట్టిన రసీదులు పెద్ద సంఖ్యలో లభించాయి. ఆ తరవాత రెండు రోజులకే అతని భార్య నాగమణి, జగదీష్, రాజ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. రికవరీకి రెండు నెలల ప్రయాస... జైలులో ఉన్న నాగమణి, జగదీష్, రాజ్‌కుమార్‌లను కోర్టు ఆదేశాల మేరకు నాలుగైదుసార్లు పోలీసులు విచారణ చేశారు. తాకట్టు పెట్టిన ముత్తూట్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ (కర్మన్‌ఘాట్, చంపాపేట బ్రాంచ్)ల నుంచి బంగారు నగలు రికవరీ చేసుకునేందుకు పోలీసులు రెండు నెలలు కష్టపడాల్సి వచ్చింది. ఈ రెండు కంపెనీల నుంచి రూ. 3.75 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ నగలు తాకట్టు పెట్టుకోవడంతో రిజర్వు బ్యాంకు నిబంధనలు ఉల్లఘించడంతో పాటు మనీలాండరింగ్‌కు పాల్పడిన ముత్తూట్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల మేనేజర్లు అనీష్‌కుమార్ (30), నాగుల మీరన్ (29)లను అరెస్టు చేశారు. ఈ రెండు ఫైనాన్స్ కంపెనీలకు విజిలెన్స్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న రిటైర్ట్ అదనపు ఎస్పీ అష్వాక్ ఆలం ఖాన్, రిటైర్ట్ ఏసీపీ శ్యాంసుందర్‌లను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. వీరు పరారీలో ఉన్నారు. లెసైన్స్ రద్దు కోసం ఆర్బీఐకి సిఫార్స్... నిబంధనలను ఉల్లంఘించి చోరీ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని, మనీలాండరింగ్‌కు పాల్పడిన ముత్తూట్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల లెసైన్స్ రద్దు చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అధికారులకు సైబరాబాద్ పోలీసులు సిఫారసు చేశారు. ఇలాంటి కంపెనీల సహకారంతోనే స్నాచర్లు, దొంగలు రెచ్చిపోతున్నారని కమిషనర్ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. చోరీ బంగారం ఎవరు తాకట్టు పెట్టుకున్నా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ వై.గంగాధర్, క్రైమ్స్ ఇన్చార్జి డీసీపీ జి.జానకీషర్మిల, అదనపు డీసీపీ క్రైమ్స్-2 కె.ముత్తయ్య, సీసీఎస్ ఏసీపీలు బి.రాములునాయక్, కె.రాంకుమార్, ఇన్స్పెక్టర్లు పి.శ్రీశైలం, ఎన్.సి.హెచ్.రంగస్వామి, పి.శ్రీధర్‌రెడ్డి, ఎస్.లింగయ్య, పి.కసిరెడ్డి, వి.శ్రీకాంత్‌గౌడ్, ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పర్యవేక్షణలో అలసత్వం వద్దు
పగలు జరిగే దొంగతనాలపై దృష్టి పెట్టండి అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు వరంగల్‌క్రైం : శాంతిభద్రతల పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు అర్బన్ పోలీసు అధికారులకు సూచించారు. అర్బన్ పోలీసు విభాగం పనితీరుపై శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి అర్బన్ పరిధిలోని సబ్‌డివిజనల్ పోలీసు అధికారులు, సీఐలు, సబ్ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు, పరిశోధన పురోగతి, గతంలో నమోదైన పెండింగ్ కేసుల పురోగతితోపాటు నిందితులను అరెస్టు చేయకపోవడానికిగల కారణాలపై అర్బన్ అధికారులతో ఎస్పీ సమీక్ష జరిపారు. శుక్రవారం హన్మకొండలోని గణేష్‌నగర్‌లో జరిగిన దోపిడీపై స్పందిస్తూ దోపిడీ జరిగిన తీరుపై ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. అర్బన్ పరిధిలో రాత్రి సమయంలో పోలీస్ సిబ్బంది ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించడంతో రాత్రి పూట జరిగే దొంగతనాలకు అడ్డుకట్ట వేశామని తెలిపారు. అరుుతే కొద్దికాలంగా నగరంలో పగటి పూట చోరీలు జరగడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు కూడా ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అలాగే అధికారులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ తీరు ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ముఖ్యంగా చోరీలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల సమయంలో జరుగుతున్నాయన్నారు. ఈ సమయంలో అధికారులు తమ సమయాన్ని విశ్రాంతికి కేటాయించకుండా తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముమ్మర గస్తీ నిర్వహించాలన్నారు. నగరంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠా కదలికలను గుర్తించాలన్నారు. అధికారులు తమ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించి గ్రామాల స్థితిగతులు తెలుసుకోవాలన్నారు. జులాయిలపై దృష్టి పెట్టడంతోపాటు వారి వ్యక్తిగత అలవాట్లపై నజర్ పెట్టాలన్నారు. సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ యాదయ్య, ఓఎస్డీలు వాసుసేన, నాగరాజు కుమార్, అర్బన్ స్పెషల్ బ్రాంచ్, వరంగల్, హన్మకొండ, కాజీపేట, ట్రాఫిక్, క్రైం డీఎస్పీలు జనార్దన్, హిమవతి, దక్షిణామూర్తి, రాజిరెడ్డి, ప్రభాకర్, రాజమహేంద్రనాయక్‌తో పాటు ఇన్స్పెక్టర్లు , ఆర్ఐలు, సబ్ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
నలుగురు చైన్‌స్నాచర్లు రిమాండ్
బంగారం ఆభరణాలు స్వాధీనం నిందితుల్లో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి సీఐ సంజయ్‌కుమార్ తూప్రాన్ : చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంజయ్‌కుమార్ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు వివరించారు. రంగారెడ్డి జిల్లా జీడీమెట్లలో నివాసం ఉండే రామావత్ సాయికిరణ్, డోలి నాగరాజు, సలిమడుగు మస్తాన్‌రెడ్డి, టేకి చక్రధర్లు నలుగురు స్నేహితులు. వీరు క్రికెట్ బెట్టింగులు, జల్సాలకు అలవాటుపడి ఓ ముఠాగా ఏర్పడి బైక్‌లపై తిరుగుతూ ఒంటరిగా కనిపించిన మహిళ మెడల్లోంచి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఈ ఏడాదిలో రెండు చోట్ల పుస్తెలు తెంపెకెళ్లగా, ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించి కొంత మొత్తంలో నగదును వద్ద నగదును లాక్కొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని సీఐ సంజయ్‌కుమార్ తెలిపారు. అయితే నర్సాపూర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పైనేరాలు అంగీకరించినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుల నుంచి నాచారానికి చెందిన రాణి, ఇమాంపూర్ గ్రామానికి చెందిన నర్సమ్మలకు చెందిన బంగారు పుస్తెల తాడులను, నేరాలకు ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకుని నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ సంతోష్‌కుమార్, పోలీసులు వెంకట్, వాలు, కిష్టాగౌడ్‌లు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే నిందితుల్లో సాయికిరణ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సర విద్యార్థి కావడం విశేషం. -
రైల్లో స్నాచింగ్
సాక్షి, చెన్నై:రైళ్లల్లో ప్రయాణికులకు భద్రత కరువు అవుతోంది. ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. మత్తు మందు చల్లడం, అర్ధరాత్రి వేళ సూట్ కేసులు ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూ వస్తున్నాయి. రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశామంటూ అధికారులు చెబుతున్నా, వినూత్న రీతిలో దోపిడీలకు పాల్పడే ముఠాలు తమ పనితనాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. అర్ధరాత్రి వేళ అత్యంత వేగంతో పరుగులు తీస్తున్న రైలు చైన్ లాగి మరి రిజర్వుడ్ కోచ్‌లోకి ఓ ముఠా దూరడం, మహిళ మెడల్లోని తాళి బొట్లను లాక్కెళ్లడం కలకలం రేపుతోంది. చైన్ స్నాచింగ్: నాగపట్నం జిల్లా మైలాడుతురై నుంచి మైసూర్‌కు శనివారం రాత్రి ఇంటర్ సిటీ రైలు బయలు దేరింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ధర్మపురి సమీపంలోని కరుపల్లి వద్దకు రైలు రాగానే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చైన్ లాగారు. దీంతో మార్గ మధ్యలో రైలు ఉన్నట్టుండి ఆగింది. అదే సమయంలో రిజర్వుడ్ కోచ్‌లోకి ఐదుగురు చొరబడ్డారు. నిద్రిస్తున్న ముగ్గురు మహిళల మెడల్లోని నగలను లాక్కున్నారు. వారు పెట్టిన కేకలతో మరో ఇద్దరు మహిళలు అప్రమత్తం అయ్యారు. కానీ తమ చేతికి చిక్కినంత బంగారాన్ని దోచుకుని ఆ వ్యక్తులు చీకట్లో కలిశారు. భద్రత కరువు: చైన్ లాగిన బోగి వైపుగా గార్డు పరుగులు తీస్తున్న సమయంలో రిజర్వుడ్ కోచ్‌లో నుంచి వస్తున్న కేకలతో ఆందోళన నెల కొంది. అక్కడికి పరుగులు తీసిన గార్డు, డ్రైవర్లు జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. వారికి భద్రత, భరోసా కరువైనా, ఇక చేసిది లేక రైలును ముందుకు నడిపారు. ధర్మపురి రైల్వే పోలీసు స్టేషన్లో బాధిత మహిళలు భవాని, మంజు, సరస్వతిని దించేసి రైలు ముందుకు కదిలింది. బాధితుల ఫిర్యాదుతో సేలం డివిజన్ ఉన్నతాధికారులకు అక్కడి పోలీసులు సమాచారం అందించారు. 17 సవ ర్లు అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని రైల్వే పోలీసు యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. మొదలైన వేట: ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి రైల్వే యంత్రాంగం రంగంలోకి వంద బృందాల్ని దించింది. ఎక్కడికక్కడ రైల్వే స్టేష న్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆ రైలు వెళ్లిన మార్గాల్లోని స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల్లోని దృశ్యాల్ని పరిశీలిస్తున్నారు. సంఘటన జరిగిన స్టేషన్‌కు పక్క స్టేషన్లో దిగిన వారికి సంబంధించిన సమాచారాల్ని సేకరిస్తున్నారు. చైన్ లాగిన బోగీ చుట్టు దర్యాప్తు జరుపుతున్నా రు. ఎవరో ఆ బోగీలో ముందుగా ఎక్కినట్టు, పథకం ప్రకారం భారీ దోపిడీకి యత్నించి, చివరకు గొలుసులను లాక్కెళ్లినట్టుగా పోలీసు లు భావిస్తున్నారు.చిమ్మ చీకటిగా ఉండే, కరువల్లి ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారంటే, ఆ పరిసరాల్లో ఏదేని ముఠా నక్కి ఉందా? అన్న కోణంలోనూ విచారణ వేగవంతం చేశారు. ఇక, ఈ ఘటనతో ఆదివారం చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ నుంచి దక్షిణాది జిల్లాలకు వెళ్లిన అన్ని రైళ్లల్లో అదనంగా ఇద్దరు సాయుధ సిబ్బందిని రంగంలోకి దించడం గమనార్హం. -
హడల్
రాష్ర్టంలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోతుండడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఒకే రోజు ఐదు సంఘటనల్లో కోటి రూపాయల విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. బంగారం ధర పెరగడం ఒక కారణమైతే, ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ కాకపోవడం మరో కారణం. దీంతో దొంగలు చేతికి పగ్గాలు వేయడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రం దొంగలమయమైపోయింది. ఇళ్లలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లు వంటి వరుస సంఘటనలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రెండేళ్లుగా బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడంతో నగల చోరీలు పెరిగి పోతున్నారుు. విదేశాల నుంచి బంగారు బిస్కెట్ల స్మగ్లింగ్ కూడా పెరిగిపోయింది. చెన్నై విమానాశ్రయం లో సగటున రోజుకు ఒకరు చొప్పున బంగారం స్మగ్లిం గ్ చేస్తూ పట్టుబడుతున్నారు. స్మగ్లింగ్ చేయలేని దొంగ లు ఆభరణాల చోరీపై దృష్టి సారిస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేయాలంటే భయం, బయటికి వెళ్లాంటేనే వణుకు, గుట్టుగా ఇంటిలోనే కాలం గడుపుదామన్నా రక్షణ లేని పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఒక్కరోజే.. చెన్నై శివారులోని ఈక్కాడుతాంగల్ డిఫెన్స్ ఆఫీసర్ కాలనీకి చెందిన పారిశ్రామికవేత్త జయప్రకాష్ కుటుం బ సభ్యులతో కలిసి ఈనెల 16వ తేదీన తిరుమలకు వెళ్లారు. 17వ తేదీ రాత్రికి ఇంటికి చేరుకోగా దొంగలు పడ్డట్లు గుర్తించారు. ఇంటి వెనుక తలుపుతెరిచి లోనికి ప్రవేశించిన దొంగలు బీరువా లాకర్‌ను పగులగొట్టి రూ.3.50 లక్షల నగదుతోపాటూ మొత్తం 50 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. ఆ రంబాకం పూందమల్లి హైరోడ్డుకు చెందిన ఏకాంబరం ఈ నెల 17వ తేదీ రాత్రి తన భార్యతో ఆలయానికి వెళ్లి వచ్చాడు. భార్య ఇంటి తలుపు తెరుస్తుండగా మోటార్ సైకిల్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని 3 తులాల బంగారు చైను లాక్కెళ్లారు. వలసరవాక్కంకు చెందిన సురేష్ భార్య కవిత ఈనెల 17వ తేదీ రాత్రి గాలికోసం కిటికీ తలుపులు తెరిచి పక్కనే నిద్రపోయింది. కిటికీకి అమర్చిన దోమతెరను కట్ చేసి ఆమె మెడలోని 12 పౌన్ల బంగారు నగను దొంగిలించాడు. పూందమల్లి కుమరన్ చావడికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నిర్మలా దేవీ యథావిధిగా తన విధులను ముగించుకుని ఇంటికి నడిచివెళుతుండగా మోటార్‌సైకిల్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన వ్యక్తి ఆమె మెడలోని 7 పౌన్ల చైనును అపహరించుకు వెళ్లాడు. మొత్తం కోటి రూపాయలకు పైగా నగలు చోరీ అయ్యూరుు. అరుుతే ఇవన్నీ ఒకే రోజు జరగడం గమనార్హం. కొడంగయ్యూర్‌లో వరుస చోరీలు నగరంలోని మరో శివారు ప్రాంతమైన కొడంగయ్యూర్ సైతం దొంగల క్షేత్రంగా మారిపోయింది. కృష్ణమూర్తి నగర్‌కు చెందిన వరలక్ష్మి సమీపంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లి నడిచి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఆసామి ఆమె మెడలోని 3 పౌన్ల చైనుపై చేయివేశాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో చేతికి చిక్కిన సగం చైనుతో ఉడాయించాడు. కాటంగలూర్ గాంధీనగర్‌కు చెందిన రహ్మదా ఇదే విధంగా 5 పౌన్ల చైనును కోల్పోయింది. ముత్తమిళ్ నగర్‌కు చెందిన ఉషారాణి అనే గృహిణి ఇంటి ముందు నిలబడి తన బిడ్డకు అన్నం తినిపిస్తుండగా 5 పౌన్లు చైనును దొంగలు లాక్కెళ్లిపోయారు. వివేకానందనగర్‌కు చెందిన తంగవేలు అనేవ్యక్తిపై కట్టెతో దాడిచేసి 7 పౌన్ల చైనును అపహరించారు. నకిలీ డాక్టర్... నగలు చోరీ ఒక నకిలీ డాక్టర్ రాష్ట్రమంతా తిరుగుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రవేశించి రోగుల నగలు కాజేస్తున్నాడు. తూత్తుకూడికి చెందిన నాచ్చియమ్మాళ్ (78), జయశేఖరి (83) స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చూసేం దుకు హీరోలా ఉండే ఈ నకిలీ డాక్టర్ ఈనెల 16వ తేదీన వీరిద్దరికీ మాయమాటలు చెప్పి వారిమెడలోని నగలు ఎత్తుకెళ్లాడు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో అతని ఫోటో స్పష్టంగా నమోదైంది. ఈ ఫొటోను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపగా, కోయంబత్తూరు, తిరుచ్చిరాపల్లీ, మధురైతోపాటూ అనేక నగరాల్లో నకిలీ డాక్టర్ చేతివాటాన్ని ప్రదర్శించినట్లు గుర్తించారు. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో సైతం ఇదే తరహా చోరీ జరిగిన ట్లు కేసు నమోదుకాగా ఇది కూడా ఆ నకిలీ డాక్టర్ పనేనని అనుమానిస్తున్నారు. ఫొటో సాయంతో అతని కోసం పోలీసులు రాష్ట్రమంతా గాలిస్తున్నారు. రాష్ట్రంలో దొంగలు విచ్చలవిడిగా సంచరిస్తుండగా ప్రజలు హడలెత్తిపోతున్నారు -
అతని పేజీకి 16,000 మంది ఫాలోవర్లు! అతనో ఖైదీ!
ఫేస్బుక్ పాడయ్యిందో.. లేక సమాజమే పాడవుతోందో అంత ఈజీగా తేల్చుకోలేని సంఘటన ఇది. అనగనగా ఒక క్రిమినల్.. హత్యా, హత్యాయత్నం, దొంగతనం, చైన్ స్నాచింగ్ తదితర నేరాలన్నీ చేసిన అతడిపై ఏకంగా 40 కి పైగా కేసులున్నాయి. వీటి ఫలితంగా అతడు అనేకసార్లు జైలుకు వెళ్లాడు. అతడి పేరు సుఖా కాలన్. ఈ క్రిమినల్ ప్రత్యేకత ఏమిటంటే..ఇతడు ఫేస్బుక్లో తన పేరు మీద ఒక పేజ్‌ను ప్రారంభించాడు. దాంట్లో తన క్రైమ్ రికార్డును భద్రపరుస్తూ వస్తున్నాడు. తను చేసిన నేరాలను వీడియోలకు ఎక్కించి మరీ ఫేస్‌బుక్‌లోకి అప్ లోడ్ చేస్తూ వస్తున్నాడు. నెట్సేవీ అయిన ఈ క్రిమినల్ ఇంత ధైర్యంగా ఫేస్బుక్లో క్రైమ్ రికార్డును మెయింటెయిన్ చేస్తుండటం ఒక విశేషం అయితే.. ఆ పేజ్‌కు 16,000 మంది ఫాలోవర్లు ఉండటం మరో విశేషం, విషాదం! ఇతడు తన చేసిన క్రైమ్స్‌ను అప్డేట్గా ఇస్తుంటే ఆ ఫాలోవర్లు వాటికి లైకులు కొడుతూ, షేర్ చేస్తూ పొద్దుపుచ్చుతున్నారు! మరి ఇది క్రైమ్‌కు ఉన్న క్రేజ్ అనుకోవాలేమో! ఈ దొంగగారి చేష్టలు ఈ మధ్య పరాకాష్టకు చేరాయి. ఒక కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం పంజాబ్‌లోని ఒక జైల్లో ఉన్న ఇతడు అక్కడ తన తోటి ఖైదీలపై దాడి చేశాడు. దాన్ని వీడియోగా చిత్రీకరించి తన ఫేస్బుక్ పేజ్‌లోకి అప్లోడ్ చేశాడు! ఒక ఖైదీ ఇంత దర్జాగా జైలు నుంచి ఫేస్బుక్ ఆపరేట్ చేస్తుండటం, అక్కడి తోటి ఖైదీలపై కిరాతకంగా వ్యవహరించి ఆ వీడియోను ఫేస్‌బుక్‌లోకి అప్లోడ్ చేయడం సంచలనంగా మారింది. చివరాఖరుకు ఈ విషయం పోలీసుల వరకూ చేరింది. దీనిపై విచారణ జరుపుతామని, ప్రస్తుతం సుఖాను వేరే జైల్లోకి మారుస్తున్నామని పోలీసులు ప్రకటించారు.