ఫేస్‌బుక్ పాడయ్యిందో.. లేక సమాజమే పాడవుతోందో అంత ఈజీగా తేల్చుకోలేని సంఘటన ఇది. అనగనగా ఒక క్రిమినల్..
ఫేస్‌బుక్ పాడయ్యిందో.. లేక సమాజమే పాడవుతోందో అంత ఈజీగా తేల్చుకోలేని సంఘటన ఇది. అనగనగా ఒక క్రిమినల్.. హత్యా, హత్యాయత్నం, దొంగతనం, చైన్ స్నాచింగ్ తదితర నేరాలన్నీ చేసిన అతడిపై ఏకంగా 40 కి పైగా కేసులున్నాయి. వీటి ఫలితంగా అతడు అనేకసార్లు జైలుకు వెళ్లాడు. అతడి పేరు సుఖా కాలన్. ఈ క్రిమినల్ ప్రత్యేకత ఏమిటంటే..ఇతడు ఫేస్‌బుక్‌లో తన పేరు మీద ఒక పేజ్‌ను ప్రారంభించాడు. దాంట్లో తన క్రైమ్ రికార్డును భద్రపరుస్తూ వస్తున్నాడు. తను చేసిన నేరాలను వీడియోలకు ఎక్కించి మరీ ఫేస్‌బుక్‌లోకి అప్ లోడ్ చేస్తూ వస్తున్నాడు.
నెట్‌సేవీ అయిన ఈ క్రిమినల్ ఇంత ధైర్యంగా ఫేస్‌బుక్‌లో క్రైమ్ రికార్డును మెయింటెయిన్ చేస్తుండటం ఒక విశేషం అయితే.. ఆ పేజ్‌కు 16,000 మంది ఫాలోవర్లు ఉండటం మరో విశేషం, విషాదం! ఇతడు తన చేసిన క్రైమ్స్‌ను అప్‌డేట్‌గా ఇస్తుంటే ఆ ఫాలోవర్లు వాటికి లైకులు కొడుతూ, షేర్ చేస్తూ పొద్దుపుచ్చుతున్నారు! మరి ఇది క్రైమ్‌కు ఉన్న క్రేజ్ అనుకోవాలేమో! ఈ దొంగగారి చేష్టలు ఈ మధ్య పరాకాష్టకు చేరాయి.
ఒక కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం పంజాబ్‌లోని ఒక జైల్లో ఉన్న ఇతడు అక్కడ తన తోటి ఖైదీలపై దాడి చేశాడు. దాన్ని వీడియోగా చిత్రీకరించి తన ఫేస్‌బుక్ పేజ్‌లోకి అప్‌లోడ్ చేశాడు! ఒక ఖైదీ ఇంత దర్జాగా జైలు నుంచి ఫేస్‌బుక్ ఆపరేట్ చేస్తుండటం, అక్కడి తోటి ఖైదీలపై కిరాతకంగా వ్యవహరించి ఆ వీడియోను ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ చేయడం సంచలనంగా మారింది. చివరాఖరుకు ఈ విషయం పోలీసుల వరకూ చేరింది. దీనిపై విచారణ జరుపుతామని, ప్రస్తుతం సుఖాను వేరే జైల్లోకి మారుస్తున్నామని పోలీసులు ప్రకటించారు.