రైల్లో స్నాచింగ్ | Chain snacing in Chennai trains | Sakshi
Sakshi News home page

రైల్లో స్నాచింగ్

Published Sun, Apr 27 2014 11:58 PM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

Chain snacing in Chennai trains

సాక్షి, చెన్నై:రైళ్లల్లో ప్రయాణికులకు భద్రత కరువు అవుతోంది. ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. మత్తు మందు చల్లడం, అర్ధరాత్రి వేళ సూట్ కేసులు ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూ వస్తున్నాయి. రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశామంటూ అధికారులు చెబుతున్నా, వినూత్న రీతిలో దోపిడీలకు పాల్పడే ముఠాలు తమ పనితనాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. అర్ధరాత్రి వేళ అత్యంత వేగంతో పరుగులు తీస్తున్న రైలు చైన్ లాగి మరి రిజర్వుడ్ కోచ్‌లోకి ఓ ముఠా దూరడం, మహిళ మెడల్లోని తాళి బొట్లను లాక్కెళ్లడం కలకలం రేపుతోంది.
 
 చైన్ స్నాచింగ్: నాగపట్నం జిల్లా మైలాడుతురై నుంచి మైసూర్‌కు శనివారం రాత్రి ఇంటర్ సిటీ రైలు బయలు దేరింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ధర్మపురి సమీపంలోని కరుపల్లి వద్దకు రైలు రాగానే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చైన్ లాగారు. దీంతో మార్గ మధ్యలో రైలు ఉన్నట్టుండి ఆగింది. అదే సమయంలో రిజర్వుడ్ కోచ్‌లోకి ఐదుగురు చొరబడ్డారు. నిద్రిస్తున్న ముగ్గురు మహిళల మెడల్లోని నగలను లాక్కున్నారు. వారు పెట్టిన కేకలతో మరో ఇద్దరు మహిళలు అప్రమత్తం అయ్యారు. కానీ తమ చేతికి చిక్కినంత బంగారాన్ని దోచుకుని ఆ వ్యక్తులు చీకట్లో కలిశారు.
 
 భద్రత కరువు: చైన్ లాగిన బోగి వైపుగా గార్డు పరుగులు తీస్తున్న సమయంలో రిజర్వుడ్ కోచ్‌లో నుంచి వస్తున్న కేకలతో ఆందోళన నెల కొంది. అక్కడికి పరుగులు తీసిన గార్డు, డ్రైవర్లు జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. వారికి భద్రత, భరోసా కరువైనా, ఇక  చేసిది లేక రైలును ముందుకు నడిపారు. ధర్మపురి రైల్వే పోలీసు స్టేషన్‌లో బాధిత మహిళలు భవాని, మంజు, సరస్వతిని దించేసి రైలు ముందుకు కదిలింది. బాధితుల ఫిర్యాదుతో సేలం డివిజన్ ఉన్నతాధికారులకు అక్కడి పోలీసులు సమాచారం అందించారు. 17 సవ ర్లు అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని రైల్వే పోలీసు యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది.
 
 మొదలైన వేట: ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి రైల్వే యంత్రాంగం రంగంలోకి వంద బృందాల్ని దించింది. ఎక్కడికక్కడ రైల్వే స్టేష న్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆ రైలు వెళ్లిన మార్గాల్లోని స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల్లోని దృశ్యాల్ని పరిశీలిస్తున్నారు. సంఘటన జరిగిన స్టేషన్‌కు పక్క స్టేషన్లో దిగిన వారికి సంబంధించిన సమాచారాల్ని సేకరిస్తున్నారు. చైన్ లాగిన బోగీ చుట్టు దర్యాప్తు జరుపుతున్నా రు. ఎవరో ఆ బోగీలో ముందుగా ఎక్కినట్టు, పథకం ప్రకారం భారీ దోపిడీకి యత్నించి, చివరకు గొలుసులను లాక్కెళ్లినట్టుగా పోలీసు లు భావిస్తున్నారు.చిమ్మ చీకటిగా ఉండే, కరువల్లి ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారంటే, ఆ పరిసరాల్లో ఏదేని ముఠా నక్కి ఉందా? అన్న కోణంలోనూ విచారణ వేగవంతం చేశారు. ఇక, ఈ ఘటనతో ఆదివారం చెన్నై సెంట్రల్, ఎగ్మూర్  నుంచి దక్షిణాది జిల్లాలకు వెళ్లిన అన్ని రైళ్లల్లో అదనంగా   ఇద్దరు సాయుధ సిబ్బందిని రంగంలోకి దించడం గమనార్హం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement