పోలీస్ రికార్డ్
సాక్షి, సిటీబ్యూరో: చైన్ స్నాచింగ్‌లతో నగరవాసులు, పోలీసుల కంటిమీద కునుకు లేకుండా చేసింది శివ గ్యాంగ్. నిర్మానుష ప్రాంతాల్లోని రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలే వీరి టార్గెట్. బైకుల్లో వేగంగా వచ్చి మహిళల మెడల్లోని పుస్తెలతాడుసహా ఇతర బంగారు ఆభరణాలను లాక్కొని క్షణాల్లో మాయమయ్యేవారు. ఇలా జంట కమిషనరేట్ల పరిధిలో 700 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఆగస్టు 14న అర్ధరాత్రి గ్యాంగ్ లీడర్ శివ పోలీసు కాల్పుల్లో మృతి చెందడం.. ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. శివ స్నాచింగ్ గ్యాంగ్ నుంచి సైబరాబాద్ సీసీఎస్ పోలీ సులు భారీగా సొత్తు రికవరీ చేశారు. రికవరీ చేసుకున్న మంగళసూత్రాలను మహిళలకు అందజేసి రికార్డ్ సృష్టించారు.
నెల్లూరు జిల్లాకు చెందిన కడవలూరి శివ (35) తన గ్రామానికి చెందిన నారాయణ తో కలిసి 2002 నుంచి నేర జీవితాన్ని ప్రారంభించాడు. నారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని సోదరుడు మందపాటి జగదీష్ (34), వైజాగ్‌కు చెందిన రాజ్‌కుమార్‌లతో కలిసి నేర సామ్రాజ్మాన్ని విస్తరించాడు.2005లో కృష్ణానగర్‌కు చెందిన నాగమణిని శివ ప్రేమ వివాహం చేసుకున్నాడు. తిరుపతి, విజయవాడ, వైజాగ్, నెల్లూరు, మాదాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్, చందానగర్, కూకట్‌పల్లి, కుషాయిగూడ, మల్కాజ్‌గిరిలో స్నాచింగ్‌లకు పాల్పడి జైలు కెళ్లాడు.
2012లో జైలు నుంచి విడుదలైన శివ తన భార్య, గ్యాంగ్ సభ్యులు నార్సింగ్‌లో మకాం ఉంటూ జంట పోలీసు కమిషనరేట్లలో 700 స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఈ గ్యాంగ్ కోసం క్రైమ్స్ అదనపు డీసీపీ జానకీషర్మిల ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపగా.. ఆగస్టు 14న అర్ధరాత్రి శివ తన బైక్‌పై శంషాబాద్ పరిసరాల్లో సంచరిస్తున్నాడనే సమాచారం రాగానే సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ నరసింహారెడ్డి, ఎస్‌ఐ వెంకటేష్ ఆ ప్రాంతానికి వెళ్లారు.
అయితే.. పోలీసులపై కత్తితో దాడి చేసి పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో శివ మృతి చెందాడు. అతని ఇంటిపై పోలీసులు దాడి చేయడంతో ఆ గ్యాంగ్ నేరాల చిట్టా బహిర్గతమైంది. స్నాచింగ్‌కు పాల్పడిన బంగారు గొలుసులను ముత్తూట్, శ్రీరామ్ సిటీ ఫైనాన్స్‌లలో తాకట్టు పెట్టిన రసీదులు పెద్ద సంఖ్యలో లభించాయి. ఆ తరవాత రెండు రోజులకే అతని భార్య నాగమణి, జగదీష్, రాజ్‌కుమార్‌లను అరెస్టు చేశారు.
రికవరీకి రెండు నెలల ప్రయాస...
జైలులో ఉన్న నాగమణి, జగదీష్, రాజ్‌కుమార్‌లను కోర్టు ఆదేశాల మేరకు నాలుగైదుసార్లు పోలీసులు విచారణ చేశారు. తాకట్టు పెట్టిన ముత్తూట్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ (కర్మన్‌ఘాట్, చంపాపేట బ్రాంచ్)ల నుంచి బంగారు నగలు రికవరీ చేసుకునేందుకు పోలీసులు రెండు నెలలు కష్టపడాల్సి వచ్చింది. ఈ రెండు కంపెనీల నుంచి రూ. 3.75 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ నగలు తాకట్టు పెట్టుకోవడంతో రిజర్వు బ్యాంకు నిబంధనలు ఉల్లఘించడంతో పాటు మనీలాండరింగ్‌కు పాల్పడిన ముత్తూట్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల మేనేజర్లు అనీష్‌కుమార్ (30), నాగుల మీరన్ (29)లను అరెస్టు చేశారు. ఈ రెండు ఫైనాన్స్ కంపెనీలకు విజిలెన్స్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న రిటైర్ట్ అదనపు ఎస్పీ అష్వాక్ ఆలం ఖాన్, రిటైర్ట్ ఏసీపీ శ్యాంసుందర్‌లను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. వీరు పరారీలో ఉన్నారు.
లెసైన్స్ రద్దు కోసం ఆర్‌బీఐకి సిఫార్స్...
నిబంధనలను ఉల్లంఘించి చోరీ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని, మనీలాండరింగ్‌కు పాల్పడిన ముత్తూట్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల లెసైన్స్ రద్దు చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అధికారులకు సైబరాబాద్ పోలీసులు సిఫారసు చేశారు. ఇలాంటి కంపెనీల సహకారంతోనే స్నాచర్లు, దొంగలు రెచ్చిపోతున్నారని కమిషనర్ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. చోరీ బంగారం ఎవరు తాకట్టు పెట్టుకున్నా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ వై.గంగాధర్, క్రైమ్స్ ఇన్‌చార్జి డీసీపీ జి.జానకీషర్మిల, అదనపు డీసీపీ క్రైమ్స్-2 కె.ముత్తయ్య, సీసీఎస్ ఏసీపీలు బి.రాములునాయక్, కె.రాంకుమార్, ఇన్‌స్పెక్టర్లు పి.శ్రీశైలం, ఎన్.సి.హెచ్.రంగస్వామి, పి.శ్రీధర్‌రెడ్డి, ఎస్.లింగయ్య, పి.కసిరెడ్డి, వి.శ్రీకాంత్‌గౌడ్, ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.