- ఆగిపోయిన కనక దుర్గమ్మ ఆలయ లభివృద్ధి పనులు
- పట్టించుకోని జిల్లా మంత్రి,ఎమ్మెల్యేలు
సాక్షి, బళ్లారి : కనక దుర్గమ్మ బళ్లారి నగర ప్రజల ఆదిదేవత. ఆమెను తలచుకోనిదే జిల్లా ప్రజలు ఏపని మొదలు పెట్టరు. ఆమె దర్శనం కోసం జిల్లా వాసులే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి మంగళ, శుక్ర వారాలతోపాటు అమావాస్య రోజుల్లో వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దీంతో ఆలయం కిటకిటలాడుతుంటోంది. భక్తులపై అంతటి కరుణ చూపుతున్న అమ్మవారిపై పాలకులు అశ్రద్ధ కనబరుస్తున్నారు. అమ్మవారి ఆలయ పునరుద్ధరణ పనులు ఆగిపోవడమే ఇందుకు తార్కాణం.
2009లో పనులకు శ్రీకారం
2009లో అప్పటి జిల్లా ఇన్‌చార్‌జ మంత్రి గాలి జనార్దనరెడ్డి, బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూ. 10 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నాలుగు గోపురాలు, పుష్కరిణీ, ప్రహరీ, సముదాయ భవనం, రాతిక ట్టడాలు, స్నానపు గదులు నిర్మించాల్సి ఉంది. జనార్దనరెడ్డి హయాంలో పనులు ఊపందుకున్నా ప్రభుత్వాలు మారిన తర్వాత పనులు ఆగిపోయాయి. ఏ ఒక్క పని కూడా పూర్తి కాలేదు. దీంతో వ్యయం రూ.14 కోట్లుకు మేరకు చేరుకుందని, పైగా నిధుల కొరత ఉందని ఆలయ వర్గాలు పేర్కొంటున్నారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం దేదీప్యమానంగా వెలుగిపోతండగా వెలుపల మాత్రం కళావిహీనంగా కనబడుతోంది.
జిల్లా ఇన్‌చార్‌జ పరమేశ్వరనాయక్, బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్ ఆలయ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి చుట్టపుచూపులా జిల్లా, నగరానికి వచ్చిపోతుండటం వల్ల అభివృద్ధి జరగడం లేదని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. బళ్లారి నగర ఆదిదేవతనే పాలకులు పట్టించుకోనప్పుడు ఇక జిల్లాలో అభివృద్ధి పనులు గురించి ఏ పాటిగా పట్టించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పాలకులు శ్రీకనక దుర్గమ్మ ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టి వెంటనే పనులు పూర్తి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.