
సాక్షి, బళ్లారి: సాధారణంగా కోతులు, కొండ ముచ్చులంటే అందరూ భయపడతారు.. అవి చేసే చేష్టలే అందుకు కారణం. అయితే, ఎలాంటి జంకుగొంకూ లేకుండా రోజూ కొండముచ్చులతో గంటల తరబడి ఆడుకుంటున్న ఓ బుడతడు ఇప్పుడు కర్ణాటకలోని ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకా అల్లాపురం గ్రామంలో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
ఆ చిన్నారి వయస్సు కేవలం రెండున్నర ఏళ్లు మాత్రమే. పేరుకు తగ్గట్టే ఆ వానర మూకతో ‘సమర్థ’0గా బంధం ఏర్పర్చుకున్నాడు. వాటితో ఇట్టే కలిసిపోతాడు. అవికూడా అంతే. తన మేనమామ ఇంట్లో పెరుగుతున్న సమర్థకు ఇప్పుడు ఆ కొండముచ్చులంటే పంచ ప్రాణాలు. రోజూ రెండు గంటలపాటు వాటితోనే గడుపుతాడు. కొండముచ్చులు కూడా అందరూ ఆశ్చర్యపడే రీతిలో ఈ చిన్నారితో అలుపెరగకుండా కాలక్షేపం చేస్తాయి. రోజూ అతని ఇంటికి వచ్చి కాసేపు ఆడుకుని వెళ్తాయి. ఇలా సుమారు 20కి పైగా కొండముచ్చుల గుంపు.. సమర్థ మధ్య స్నేహబంధం ఏర్పడింది.
ఆర్నెల్ల క్రితం బంధానికి పునాది
ఆరు నెలల క్రితం సమర్థ ఇంటిబయట నిలబడి రొట్టె తింటుండగా, అటుగా వచ్చిన కొండముచ్చుల గుంపు రొట్టెని లాక్కొని తుర్రుమన్నాయి. దీంతో ఆ బుడతడు ఇంట్లోకి పరుగుతీశాడు. కొద్దిసేపటికి ఇంకొక రొట్టె తీసుకువచ్చి వాటికి వేశాడు. అంతే, అప్పటి నుంచి వాటికి.. సమర్థకు మధ్య స్నేహం కుదిరింది.
రోజూ వానర గుంపు ఉదయాన్నే రావడం.. అదే సమయానికి బాలుడు వాటి కోసం ఎదురుచూడటం మామూలైపోయింది. వాటిని చుట్టూ కూర్చొబెట్టుకుని ఆటలాడుతూ రొట్టెలు, ఇతరత్రా తినుబండారాలు పంచుతాడు. వాటితో కలసి డ్యాన్స్ చేయడం, ఆటలాడటం నిత్యకృత్యమైంది. బాలుడు తప్ప వేరెవరైనా దగ్గరకు వస్తే కొండముచ్చులు గుర్రుమంటాయి. ఒక్కోసారి సమర్థ బయటకు రాకపోతే కోతులే చొరవగా ఇంట్లోకి వెళ్లిపోతాయి. నీ దగ్గరకే మేం వచ్చాం స్నేహితుడా అనే సందేశం అందజేస్తాయి. ఇలా బాలుడు–కోతుల సఖ్యతను గ్రామస్తులు రోజూ ఆసక్తిగా తిలకిస్తుంటారు.
కోతులంటే పంచ ప్రాణాలు
సమర్థకు కోతులంటే పంచ ప్రాణాలు. తోటి స్నేహితులతో కూడా ఇంత హుషారుగా ఆడడు. కోతులే వాడికి స్నేహితులయ్యాయి. ఏదో జన్మలో వాటితో వాడికి ఏదో సంబంధం ఉండి ఉంటుంది లేదా మరేదైనా మహిమ కావచ్చు. – మల్లికార్జునరెడ్డి, సమర్థ మేనమామ
Comments
Please login to add a commentAdd a comment