సాక్షి,బళ్లారి: రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనం చోటు చేసుకున్నా దాని మూలాలు బళ్లారిలోనే ఉంటాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అందుకే ఎప్పుడు ఎన్నిక జరిగినా రాష్ట్ర ప్రజలందరూ బళ్లారిపైనే దృష్టి పెడుతుంటారు. ఈసారి బళ్లారి నగర అసెంబ్లీ ఎన్నికల పోరులో చతుర్ముఖపోటీ నెలకొంది. అయితే ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, కేఆర్‌పీపీల మధ్యనే పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో బళ్లారి కోటపై ఏ పార్టీ జెండా ఎగురుతుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, కాంగ్రెస్ తరఫున నారాభరత్‌రెడ్డి, కేఆర్‌పీపీ తరఫున గాలి లక్ష్మీ అరుణ బరిలో ఉన్నారు. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడి భంగపడిన అనిల్‌లాడ్ జేడీఎస్‌లో చేరి ఆ పార్టీ తరఫున పోటీలో ఉన్నారు.
మహిళా ఓటర్లే ఎక్కువ
బళ్లారి సిటీ నియోజకవర్గంలో 2,58,588 ఓటర్లు ఉండగా 1,32,780 మంది మహిళలు, 1,25,779 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో విజేతలు ఎవరనేది మహిళలే నిర్ణయించనున్నారు. బళ్లారి సిటీలో 39 వార్డులు ఉండగా, సిటీ నియోజకవర్గం పరిధిలోకి 26 వార్డులు వస్తాయి.
తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువ
బళ్లారిలో తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువ. ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు ఇక్కడే స్థిరపడి వ్యవసాయం, సివిల్ కాంట్రాక్టు పనులు, వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. బళ్లారి అసెంబ్లీ పోరులో తలపడుతున్న అభ్యర్థులు బళ్లారిలోనే పుట్టి పెరిగిన వారు అయినప్పటికీ వీరి పూర్వికులు ఏపీవారే. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, కేఆర్‌పీపీ తరఫున బరిలో ఉన్నది ఒకే సామాజికవర్గానికి చెందినవారే. వీరంతా ఆర్థికంగా స్థితిమంతులు. పైగా బీజేపీ తరఫున బరిలో ఉన్న గాలి సోమశేఖరరెడ్డి, కేఆర్‌పీపీ తరఫున పోటీలో ఉన్న గాలి లక్ష్మీ అరుణలు స్వయానా బావ,మరదులు కావడం విశేషం. దీంతో ఇక్కడ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
ఎవరి ధీమా వారిదే
కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్‌రెడ్డి, గాలి జనార్దనరెడ్డి సతీమణీ గాలి లక్ష్మీ అరుణ తొలిసారిగా పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టి బళ్లారి ప్రజల వాణి వినిపించేందుకు హోరా–హోరీగా తలపడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ఇప్పటికే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖరరెడ్డి మూడో పర్యాయం విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. బళ్లారి నగరంలో తాను చేసిన అభివృద్ధి పనులే తన విజయానికి కారణమవుతాయని గాలిసోమశేఖరరెడ్డి ధీమాతో ఉన్నారు. ఈమేరకు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందువల్ల ప్రజలు బీజేపీని వీడి తమను గెలిపిస్తారని, కాంగ్రెస్, కేఆర్‌పీపీ అభ్యర్థులు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. జేడీఎస్ అభ్యర్థి అనిల్ లాడ్ విషయానికొస్తే 2008లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గాలి సోమశేఖరరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ కోసం యత్నించి విఫలమై జేడీఎస్ తీర్థం పుచ్చుకుని ఎన్నికల బరిలో తలపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment