ఏదైనా ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే..! | Water for Tungabhadra project after Tribunal Verdict only | Sakshi
Sakshi News home page

ఏదైనా ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే..!

Published Sat, Oct 26 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

Water for Tungabhadra project after Tribunal Verdict only

కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని తుంగభద్ర ప్రాజెక్టు కిందకు వచ్చే రాష్ట్ర రైతుల కష్టాలు ఇప్పట్లో తీరే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయంలో కర్ణాటకపై పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే ఈ విషయంలో ఒక నిర్ణయానికి వద్దామని, అప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలకు తాము సుముఖంగా లేమని ఆ రాష్ట్రం స్పష్టం చేసింది. దాంతో రెండు రాష్ట్రాల ప్రతినిధుల సమక్షంలో జరిగిన సమావేశం ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండానే ముగిసినట్టయింది. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి అనంతపురం జిల్లాకు సాగు, తాగు నీటిని అందించే హై లెవెల్ కెనాల్ విషయమై పలు ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. జిల్లాకు సాగునీరు సరిగ్గా అందేలా చూసేందుకు కెనాల్ ఆధునీకరణతో పాటు సమాంతరంగా మరో కాల్వను తవ్వాలనే ప్రతిపాదనను మన రాష్ర్టం రూపొందించింది. దీనిపై చర్చించేందుకు శుక్రవారం బెంగళూరులోని ఆ రాష్ట్ర సచివాలయంలో ఇరు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ర్టం తరఫున మంత్రులు రఘువీరారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శైలజానాథ్, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎంఎల్‌ఏ మధుసూదన్‌గుప్తాతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 
  కర్ణాటక నుంచి ఆ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఎంబి పాటిల్, రెవెన్యూమంత్రి వి.శ్రీనివాసప్రసాద్, న్యాయ శాఖ మంత్రి టీబీ జయచంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. సమావేశం అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ నాలుగు వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న హెచ్‌ఎల్‌సీ నుంచి అనంతపురం జిల్లాకు 2,575 క్యూసెక్కుల నీరు అందాల్సి ఉందన్నారు. అయితే ప్రస్తుతం 1,000-1,200 క్యూసెక్కులకు మించి రావడం లేదని తెలిపారు. ఈ విషయంలో ట్రిబ్యునల్ తీర్పు రావాల్సి ఉండగా.. ఉభయ రాష్ట్రాల సాంకేతిక, న్యాయ బృందాలు చర్చలు కొనసాగిస్తాయని చెప్పారు. బెంగళూరు-బళ్లారి మధ్య దూరం తగ్గించే రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గానికి అవసరమైన భూ సేకరణను సత్వరమే పూర్తి చేయాలని కూడా కర్ణాటకను కోరినట్లు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి అనంతపురం జిల్లాలో భూ సేకరణ పూర్తయిందని, రెండు స్టేషన్ల మధ్య ప్రయోగాత్మకంగా రైలు నడపడం కూడా ప్రారంభమైందని ఆయన చెప్పారు.
 
 సరిహద్దు వివాదంపై తటస్థ సంస్థ సర్వే
 ఈ సమావేశం తర్వాత మన ప్రతినిధుల బృందం కర్ణాటక రెవిన్యూ మంత్రితో సమావేశమయ్యింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదంపై చర్చించింది. అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం, సిద్ధాపురం, మలపనగుడి గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందినవో సత్వరమే తేల్చాల్సిందిగా సుప్రీంకోర్టు ఇరు రాష్ట్రాలను ఆదేశించిన నేపథ్యంలో సర్వే ఆఫ్ ఇండియాకు ఈ బాధ్యతను అప్పగించాలని రాష్ట్ర ప్రతినిధి బృందం సూచించింది. ఈ సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలతో సంబంధం లేని తటస్థ సంస్థతో సర్వే చేయించడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. అనంతరం రఘువీరారెడ్డి, సుదర్శన్‌రెడ్డిలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement