సాక్షి, బళ్లారి : బళ్లారి జెడ్పీ కోటపై మహిళలే సారథులవుతున్నారు. 2010లో జిల్లా పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా, 18 బీజేపీ, 17 కాంగ్రెస్, ఒకరు జేడీఎస్ పార్టీ తరుపున జెడ్పీ మెంబర్లుగా గెలుపొందారు. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరిగా కర్ణాటక రాష్ట్రంలో జెడ్పీ అధ్యక్షులు ఐదు సంవత్సరాలు కొనసాగేందుకు అవకాశం ఉండదు. ప్రతి 20 నెలలకు ఒకసారి జెడ్పీ అధ్యక్షులను మారుస్తున్న నేపథ్యంలో ఈ నాలుగేళ్లు అవధిలో నలుగురు జెడ్పీ అధ్యక్షులు ఎంపికయ్యారు. ఇప్పటి వరకు మహిళలే జెడ్పీ అధ్యక్షురాలుగా ఎంపిక కావడంతో జెడ్పీ కోటకు మహిళలే సారథులయ్యారు. 2010లో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన జెడ్పీ మెంబర్లలో సహజంగా మహిళలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం అధ్యక్ష స్థానాలు దక్కించుకుంటే, చివరి అవధిలో ఎస్‌టీ జనరల్‌కు అవకాశం ఉన్నప్పటికీ తిరిగి మహిళే జెడ్పీ అధ్యక్షురాలిగా అనిత ఎంపిక కావడంపై హర్షాతిరేకం వ్యక్తం అవుతోంది.
2010లో ఎన్నికల అనంతరం జెడ్పీ అధ్యక్షురాలిగా అరుణా తిప్పారెడ్డి ఎంపికయ్యారు. తొలి అవధిలో జెడ్పీ ఉపాధ్యక్ష స్థానం జనరల్ కేటగేరికి కేటాయించడంతో కూడ్లిగి నియోజకవర్గానికి చెందిన గజాపుర జెడ్పీ మెంబర్ చెన్న బసవనగౌడ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. అది మినహా ఇప్పటి వరకు జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలు మహిళలనే వరిస్తున్నాయి. 20 నెలల అనంతరం తిరిగి జెడ్పీ అధ్యక్షస్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన సుమంగళమ్మ గుబాజీ, ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మమతా సురేష్‌లను ఎంపిక చేశారు. మూడవ అవధిలో జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్లపై కొందరు కోర్టుకు పోవడంతో తాత్కాలిక అధ్యక్ష ఎంపిక చేశారు.
అప్పుడు కూడా జెడ్పీ తాత్కాలిక అధ్యక్షురాలిగా మహిళే (సునందా బాయి) ఎంపికయ్యారు. ఎట్టకేలకు మూడవ అవధి కింద జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు రిజర్వేషన్లు ఖరారై జెడ్పీ అధ్యక్ష స్థానం ఎస్‌టీ జనరల్, ఉపాధ్యక్ష స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. జెడ్పీ అధ్యక్షుడిగా ఎస్‌టీ కేటగిరికి చెందిన పురుషుడిని ఎంపిక చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, నాలుగోసారి జెడ్పీ అధ్యక్ష ఎంపికలో కూడా మహిళకే (అనితకు) జెడ్పీ అధ్యక్ష స్థానం దక్కింది. బీజేపీకి జెడ్పీ అధ్యక్షస్థానంలో జేడీఎస్ పార్టీ నుంచి గెలుపొందిన మహిళా జెడ్పీ మెంబర్ ఇవ్వడంతో సునాయాసంగా బీజేపీ జెడ్పీ అధ్యక్షస్థానం దక్కించుకునేందుకు వీలైంది. ఇలా బళ్లారి జెడ్పీ కోటపై మహిళలే నిర్ణయాత్మక శక్తిగా మారారు.
బళ్లారి జెడ్పీ కోటకు మహిళలే సారథులు
Published Wed, Aug 6 2014 3:41 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement