రూ.500 నోటును ఐదు రోజులు కాపాడుకుంటున్నారు! | bellary city back to 20 years | Sakshi
Sakshi News home page

రూ.500 నోటును ఐదు రోజులు కాపాడుకుంటున్నారు!

Published Wed, Oct 21 2015 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

రూ.500 నోటును ఐదు రోజులు కాపాడుకుంటున్నారు!

రూ.500 నోటును ఐదు రోజులు కాపాడుకుంటున్నారు!

బెంగళూరు : ఒకప్పుడు వెయ్యి రూపాయల నోటును ఓ గంటలో ఖర్చు చేసిన నగర వాసులకు నేడు రూ.500లు ఖర్చు చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.500ల నోటును ఐదు రోజులు కాపాడుకుంటున్నారు. గత మూడు నాలుగేళ్ల క్రితం బళ్లారిలో ఐదేళ్ల పాటు మైనింగ్ ప్రభావం ఓ మెరుపు మెరిసింది. దీంతో కర్ణాటక బళ్లారి జిల్లా వాసులు రోజూ వేలాది రూపాయలు నీళ్లలా ఖర్చు చేశారు. ఒకప్పుడు ఐశ్వర్యవంతులుగా జీవించిన వారంతా పైకం కరువుతో కంగు తింటున్నారు.
 
ఈరోజు ఎలాగో గడిచింది, రేపటి పరిస్థితి ఏమిటని ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మైనింగ్ ప్రభావంతో చిన్నా చితక వ్యాపారాలతో పారిశ్రామిక వేత్తలకు కూడా వ్యాపారాలు బాగానే ఊపందుకున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, గృహోపకరణాలు పెద్ద పెద్ద గార్మెంట్ కంపెనీల దుకాణాలు వచ్చిపడ్డాయి. అయితే ఈ వ్యాపారాలు బళ్లారిలో స్థిరంగా ఉంటాయని భావించి తమ తమ దుకాణాలను ఎంతో అందచందాలతో తీర్చిదిద్దారు. కానీ నేడు వారికి జరుగుతున్న వ్యాపారాలు అద్దెకు కూడా సరిపోవటం లేదు.
 
స్థానిక ఇన్‌ఫ్యాంట్రీ రోడ్డులో దుర్గమ్మ దేవాలయం నుంచి సుధాక్రాస్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల పొడవునా ఇలాంటి దుకాణాలు ఎన్నో నెలకొన్నాయి. ప్రస్తుతం దుకాణాలను నడపాలా లేక బంద్ చేసుకోవాలా అనే సందిగ్ధంలో పలు కంపెనీల వ్యాపారులు ఉన్నారు. ఇక రియల్ ఎస్టేట్ రంగం కార్యకలాపాలు కూడా పూర్తిగా స్తంభించి పోయాయి. కానీ బార్లు, పలు రెస్టారెంట్లు మాత్రం గుడ్డి కన్నా మెల్ల మేలన్నట్టుగా నడుస్తున్నాయి.

ఇటీవల బార్లు, రెస్టారెంట్లలో ఖరీదు ఎక్కువ కావడంతో మద్యం ప్రియులు ఫుట్‌పాత్ తినుబండారాలు తీసుకుని, బీడు పడిన లేఔట్లు, ఖాళీగా ఉన్న రోడ్ల పక్కన, భవనాలను ఆశ్రయిస్తూ ఉన్నదాంట్లో సర్దుకుపోతున్నారు. ఏది ఏమైనా ఒకనాడు విలాస జీవనాలు సాగించిన బళ్లారి నగర వాసులకు నేడు మళ్లీ ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement