
బంధువుల వివాహానికి హాజరై సొంతూరికి తిరిగి వెళ్తుండగా ఘోర విషాదం వెంటాడింది. ఎదురుగా వస్తున్న కారు అదుపు తప్పి ఢీకొనడంతో మరో కారులోని ఆరుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు వదిలారు. మరికొద్ది గంటల్లో స్వగ్రామానికి వెళ్లేలోపునే ఘోరం దాపురించింది.
సాక్షి, బళ్లారి: పెళ్లి సంబరాలు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి చేరుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. గదగ్ జిల్లా ముండ్రిగి రింగ్‌రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ధార్వాడ జిల్లా హుబ్లి సమీపంలోని అగసి గ్రామానికి చెందిన ఆనంద్ బట్టగేరి, సిద్ధు కోరిశెట్టి, మనోజ్‌కుమార్, అమృత్, చన్నువాడద్, వినయ్‌కౌడి అనే యువకులు మృతి చెందారు.
అతివేగంతో అదుపు తప్పి..
ఒక ఐ–టెన్ కారు.. గదగ్ సమీపంలో ముండ్రిగి రింగ్ రోడ్డులో వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతే వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న పెళ్లివారితో కూడిన ఐ– 20 కారును ఢీకొట్టింది. ఆ తాకిడికి ఐ–20 కారు నుజ్జునుజ్జయింది, అందులో ప్రయాణిస్తున్న 6 మంది ఘటనాస్థలంలోనే మరణించారు. నలుగురికి తీవ్ర గాయాలు తగిలాయి. ఒకరు చేసిన తప్పునకు మరో కారులో ప్రయాణిస్తున్నవారు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై గదగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి సంబరాలు ముగించుకుని స్వగృహానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పెళ్లి వేడుకలో విషాదం అలముకుంది. మృతదేహాలను, క్షతగాత్రులను గదగ్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment