
ఆకాష్ నాయక్ హత్య కేసులో మరోనలుగురి అరెస్ట్
బళ్లారి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 2వ తేదీన బెళగల్లు తండాకు చెందిన ఆకాష్ నాయక్ హత్య కేసులో మరో
బళ్లారి టౌన్ : బళ్లారి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 2వ తేదీన బెళగల్లు తండాకు చెందిన ఆకాష్ నాయక్ హత్య కేసులో మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఆర్.చేతన్ తెలిపారు. ఆయన సోమవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులలో ఇప్పటికే ఆరుగురిని ఈనెల 15న అరెస్ట్ చేయగా, సోమవారం మిగతా నిందితులు రమేశ్‌నాయక్, మంజునాథ్, గోపాలనాయక్, సందీప్‌లను అరెస్ట్ చేశామన్నారు. ఈకేసు మిస్టరీని చేధించగా బెళగల్లు తాండాకు చెందిన మాజీ జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షురాలు సవితాబాయి భర్త హీరా నాయక్‌ను అప్పు ఇవ్వలేదనే కారణంగా 2012లో రమేశ్ నాయక్, మంజు నాయక్ ఇతరులు కలిసి హత్య చేశారని, ఈ కేసులో రమేశ్ నాయక్ ఇంతవరకు తప్పించుకుని తిరిగాడన్నారు.
అనంతరం ఇదే ద్వేషంతో హీరానాయక్ వర్గం వారు ఆకాష్ నాయక్, అజయ్, ఉమేశ్, ఏసు, బండిహట్టి నాగ తదితరులు కలిసి 2014 మార్చి 14 రమేశ్ నాయక్ తమ్ముడు రవినాయక్ అలియాస్ రవిని హత్య చేశారన్నారు. దీనిపై 2014లో నిందితులను బంధించి కోర్టు కస్టడీకి అప్పగించామన్నారు. అనంతరం సీడీ రవి హత్యకేసులో నిందితులు జామీనుపై బయటకు వచ్చారన్నారు. పాత కక్షల కారణంగా ఈనెల 2న ఆకాష్ నాయక్‌ని హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విజయ్ రాంబాబు, డీఎస్పీ టీవీ.సురేష్ తదితరులు పాల్గొన్నారు.