బళ్లారి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం అంటే ఏప్రిల్ 17న బళ్లారి లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి.
తేలనున్న లోక్‌సభ అభ్యర్థుల భవితవ్యం
రావ్ బహుదూర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు
సాక్షి, బళ్లారి : బళ్లారి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం అంటే ఏప్రిల్ 17న బళ్లారి లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఫలితాలు ప్రకటించేందుకు నెల రోజులు ఆలస్యమైంది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 28 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బళ్లారి లోక్‌సభ స్థానానికి బీజేపీ తరుపున బీ.శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్‌వై హనుమంతప్ప, ఏఏపీ తరుపున శివకుమార్ మాళగి పోటీ చేశారు.
ఇందులో ప్రధానంగా బీజేపీ అభ్యర్థి శ్రీరాములు, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై హనుమంతప్ప మధ్య పోటీ జరిగింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పని చేసిన బీ.శ్రీరాములు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి, చిత్రదుర్గం మాజీ ఎంపీ ఎన్‌వై. హనుమంతప్ప పోటీ చేయడంతో బళ్లారి లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇద్దరు ఉద్దండులే కావడంతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బళ్లారి లోక్‌సభ పరిధిలోని బళ్లారి సిటీ, కంప్లి, హడగలి, హగరిబొమ్మనహళ్లి, కూడ్లిగి, హొస్పేట, సండూరు నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బళ్లారి లోక్‌సభ పరిధిలో 14,87,661 మంది ఓటర్లుండగా, వీరిలో 10,45,454 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ నేపథ్యంలో 70.28 శాతం ఓటింగ్ జరిగినట్లయింది. కాంగ్రెస్ అభ్యర్థి స్థానికేతరుడు కావడం, బీజేపీ అభ్యర్థి స్థానికుడు కావడం మోడీ గాలి బలంగా ఉండటంతో బీజేపీ నేతలు గెలుస్తామని ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతోపాటు గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైన సానుభూతి, అధికార పార్టీ జారీ చేసిన సంక్షేమ పథకాలతో తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
నగరంలోని రావ్ బహుదూర్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు వేదిక సిద్ధమైంది. నెల రోజుల పాటు ఈవీఎంలు ఉంచిన రావుబహుదూర్ కళాశాలలో పోలీసులు చీమ చిటుక్కుమన్నా కదిలేలా భద్రత కల్పించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం మీద నెల రోజుల పాటు ఎదురు చూసిన లోక్‌సభ ఎన్నికలు నేడు వెలువడనున్న నేపథ్యంలో రావ్ బహుదూర్ కళాశాల పోలీసు వలయంలో చిక్కింది.
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ప్రత్యేక గేట్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారులు, మీడియా ప్రతినిధులు ఇలా ఓట్ల లెక్కింపు వద్దకు చేరుకునే వ్యక్తులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్థులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోకుండా ముందస్తుగానే విజయోత్సవ ర్యాలీలను నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.