నేటితో ప్రచారం సమాప్తం
Published Mon, Apr 7 2014 10:31 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తుండడంతో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, ఆప్, బీజేపీ అభ్యర్థులు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. ఇంటింటికీ తిరిగి ఓట్లడగడం, పాదయాత్రలు, రోడ్‌షోలు, పోస్టర్లు హోర్డింగులు పెట్టడం వంటి సంప్రదాయ పద్ధతులతోపాటు ఫేస్‌బుక్ ప్రచారం వంటి ఆధునిక విధానాలనూ ఉపయోగించుకుంటున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల కోసం గురువారం నిర్వహించే ఎన్నికల కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నిర్వహించిన ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల సమరంలో పోరాడుతున్న అభ్యర్థులు.. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరిగి ఓట్లడగడం, పాదయాత్రలు, రోడ్‌షోల నిర్వహణ, పోస్టర్లు హోర్టింగులు పెట్టడం, ప్రముఖ నేతల ర్యాలీలు ఏర్పాటు చేయడం వంటి సంప్రదాయ ప్రచార పద్ధతులు అన్ని పార్టీల్లోనూ కనిపించాయి. ఇక ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, సోషల్ మీడియా వంటి ఆధునిక పద్దతులనూ ఉపయోగించుకుంటున్నారు. కొందరు అభ్యర్థులు ప్రచారం కోసం పౌరసంబంధాల (పీఆర్) ఏజెన్సీలను కూడా నియమించుకున్నారు.
కాంగ్రెస్.. వ్యక్తిగత ఆకర్షణే ఆధారం
ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి గడువు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం సోమవారం పతాకస్థాయికి చేరింది. దక్షిణ ఢిల్లీలో తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం సాయంత్రం నిర్వహించిన ర్యాలీ విజయవంతం కావడం కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఢిల్లీలో తమ పార్టీకి మళ్లీ మంచిరోజులు వచ్చాయన్న ఉత్సాహంతో వీళ్లంతా సోమవారం జోరుగా ప్రచారం జరిపారు. ఏడు సీట్ల నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు సిట్టింగ్ ఎంపీలే కావడంతో గెలుపును వారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎంపీలు అజయ్ మాకెన్, కపిల్ సిబల్, కృష్ణాతీరథ్, సందీప్ దీక్షిత్‌కు ఈ ఎన్నికల్లో గెలుపు వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ తమ సొంత బలం, వ్యక్తిగత ఆకర్షణతో గెలవాలన్న తపన కపిల్ సిబల్, జైప్రకాశ్ అగర్వాల్,అజయ్ మాకెన్, సందీప్ దీక్షిత్‌లో కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి వీళ్లు తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి ఓట్లు అడుగుతున్నారు.
ప్రచారంలో అభ్యర్థులకు సాయమందించడానికి ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) కార్యాలయంలో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎనిమిది మంది కార్యకర్తల బృందంతో డాక్టర్ రాకేష్ సచ్‌దేవ్ ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచార అవసరాలు తీరుస్తున్నారు. కంట్రోల్‌రూమ్ ఎదుటే కాంగ్రెస్ కీలక కార్యాలయం వార్‌రూము ఉంటుంది. ఇందులోని ఐటీ నిపుణులతో కూడిన యువకార్యకర్తల బృందం సోషల్‌మీడియా ద్వారా అభ్యర్థులకు సహకారం అందిస్తోంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్‌పై జరుగుతోన్న దుష్ర్పచారాన్ని రాగిణి నాయక్ నేతృత్వంలోని యువకార్యకర్తల బృందం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఆప్.. ఆరోపణలే ప్రధానాస్త్రాలు
తమ పార్టీ అధికారాన్ని వదిలి పారిపోలేదని ప్రజలకు తెలియచెప్పడానికి ఆప్ అభ్యర్థులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా తన రోడ్‌షోల్లో ఇదే అంశంపై దృష్టిపెట్టారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీపై ఆరోపణాస్త్రాలను ఎక్కుపెడుతూ తమ పార్టీ ఢిల్లీని వదిలి ఎక్కడికీ పోలేదని సంజాయిషీ ఇస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ఆప్ మద్దతుదారుల్లో ఉత్సాహం పెరిగింది. అభ్యర్థులు కూడా రోడ్‌షోలు, పాదయాత్రలతో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉన్నతస్థాయి నియోజకవర్గంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న చాందినీచౌక్‌లో ఆప్ అభ్యర్థి ఆశుతోష్ రోడ్‌షోలు, పాదయాత్రల ద్వారా జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సౌత్ ఢిల్లీలో దేవేంద్ర సెహ్రావత్ తన నియోజకవర్గం పరిధిలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండేసి రోజులు గడుపుతూ తనదైన శైలిలో ప్రచారం జరుపుతున్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా ప్రజల మధ్య గడుపుతూ ఆయన తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. మహాత్మాగాంధీ పేరు చెప్పుకుని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి రాజ్‌మోహన్ గాంధీపై వచ్చాయి.
బీజేపీ.. మోడీపైనే ఆశలు
నరేంద్ర మోడీ ప్రభంజనం మీద పెద్దగా ఆశలు పెట్టుకున్న బీజేపీ అభ్యర్థులు కూడా ఏ ప్రయత్నాన్నీ వదలకుండా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. భారీగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. 23 రోజులుగా తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నానని, తన గెలుపు ఖాయమని చాందినీచౌక్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఈ మాటలు చెప్పడం లేదని, ప్రజల ఆలోచనలను గమనించి ఇలా చెబుతున్నానని అన్నారు. న్యూఢిల్లీ అభ్యర్థి మీనాక్షీ లేఖి, వెస్ట్ ఢిల్లీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ కూడా సంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో తీవ్రంగా ప్రచారం సాగిస్తున్నారు. మోడీ కూడా ఢిల్లీలో పలు ర్యాలీలు నిర్వహించడం బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.
Advertisement