మోడీ వచ్చేనా..!
Published Tue, Apr 8 2014 12:35 AM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం నిమిత్తం తమిళనాడుకు ఎప్పుడు వస్తారోనని కమలనాథులు ఎదురు చూస్తున్నారు. ఆయన పర్యటన వివరాలు సిద్ధం చేసుకున్నారు. ఐదుచోట్ల ప్రచార సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాక్షి, చెన్నై:రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నా య శక్తిగా బీజేపీ నేతృత్వంలో కూటమి ఆవిర్భవించింది. సార్వత్రిక సంగ్రామంలో తమ సత్తా చాటుకుని, రానున్న రోజుల్లో ఈ కూటమిని పదిలం చేయడమే లక్ష్యంగా కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. అలాగే అత్యధిక స్థానాలను కైవశం చేసుకోవడమే లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా డీఎండీకే నేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, ఎండీఎంకే నేత వైగో ప్రచారం చేస్తున్నా రు. కమలనాథులు తమకు పట్టున్న స్థానాల్లో ప్రచారంలో ఉన్నారు. మోడీ ద్వారా రాష్ట్ర ప్రజల ఆశీస్సుల్ని దక్కించుకోవాలనే లక్ష్యంగా కమలనాథులు చర్యలు తీసుకుంటున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని రాష్ట్రానికి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల నగారా మోగడానికి ముందుగా మోడీ చెన్నైలో పర్యటించారు. మిగిలిన చోట్ల కూడా ఆయన ద్వారా ప్రచార సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఎప్పుడొచ్చేనో: అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళుతున్నారుు. తమ పార్టీ జాతీయ నాయకుల్ని రాష్ట్రానికి ఆహ్వానించేందుకు క మలనాథులు తీవ్రంగా కుస్తీలు పడుతున్నారు. జాతీయ నేతలందరూ ఎన్నికల బరిలో ఉండడం, వారివారి నియోజకవర్గాల్లో తిష్టవేయడంతో ఇరకాటంలో పడ్డారు. జాతీయ నేతలు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారోలేదో తెలియకపోవడంతో ఇక తమ ఆశల్ని మోడీ మీదే పెట్టుకున్నారు. మోడీని ఇక్కడికి ఆహ్వానించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఆయన పర్యటన తేదీలు కుదరని దృష్ట్యా ఎప్పుడొచ్చేనో అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
రెండు రోజుల పర్యటన: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతి శ్రీనివాసన్ నేతృత్వంలోని కమిటీ ఈ నెల 14, 15 తేదీల్లో మోడీ పర్యటన సాగేలా చర్యలు తీసుకుంది. అలాగే కూటమిలోని ముఖ్య నాయకులు అన్బుమణి రాందాసు (ధర్మపురి), ఎల్‌కే సుదీష్ (సేలం), పొన్ రాధాకృష్ణన్ (కన్యాకుమారి), వైగో (విరుదునగర్)లో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి గెలుపు లక్ష్యంగా నాలుగు చోట్ల ప్రచార సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిత్ర పక్షాల నాయకులు అందరూ ఒకే వేదిక మీద ఉండేలా చెన్నై వేదికగా భారీ బహిరంగ సభకు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ఆ తేదీల్లో మోడీ ఇక్కడికి వచ్చేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంగా వానతి శ్రీనివాసన్ పేర్కొంటూ మోడీ కోసం రెండు రోజుల పర్యటన వివరాలు సిద్ధం చేశామన్నారు. ఆయన తప్పకుండా ఇక్కడికి వస్తారని, ముందుగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో ప్రచార సభల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. తేదీ విషయంలో జాతీయ పార్టీ నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు.
Advertisement
Advertisement