నమో ఉత్తరప్రదేశ్
లక్నో: అద్భుతం. అపూర్వం. అనితరసాధ్యం. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని వర్ణించేందుకు ఇలాంటి ఎన్ని విశేషణాలు వాడినా తక్కువే. ‘హస్తినకు దగ్గరి దారి’గా చెప్పే యూపీని కమల దళం గుండుగుత్తగా కొల్లగొట్టి చరిత్రాత్మక విజయం సాధిం చింది. 80 సీట్లకు గాను ఏకంగా 73 చోట్ల విజయబావుటా ఎగురవేసి చరిత్ర సష్టించింది. అధికార సమాజ్‌వాదీ పార్టీ ఐదు సీట్లకు, కాంగ్రెస్ పార్టీ రెండింటికి పరిమితం కాగా బహుజన్ సమాజ్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. కల్యాణ్‌సింగ్ జమానాలోనూ, వాజ్‌పేయి, అద్వానీ వంటి హేమాహేమీలతోనూ సాధ్యపడని ఘనతను నరేంద్ర మోడీ(నమో) సాధించి చూపించారు.
వారణాసి నుంచి బరిలో దిగాలన్న ఆయన వ్యూహం దిగ్విజయంగా ఫలించినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు దేశానికి తొలి దళిత ప్రధాని కావాలని కలలుగన్న బహుజన్ సమాజ్ పార్టీకి యూపీ ఓటర్లు ఎన్నటికీ మర్చిపోలేని పరాభవాన్ని మిగిల్చారు. 2009లో 20 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడమే గాక మరో 33 చోట్ల రెండో స్థానంలో నిలిచిన బీఎస్పీ ఈ దఫా కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. 2009లో 26 స్థానాలు గెలిచిన చోట ఈసారి తల్లీ కొడుకులు సోనియా, రాహుల్‌గాంధీ మాత్రమే గెలుపు ముఖం చూడగలిగారు!అందులోనూ రాహుల్ అయితే కేవలం లక్ష ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు.