మోడీకి వైట్‌హౌస్ స్వాగతం
ప్రపంచ నేతల నుంచి అభినందనల వెల్లువ
వాషింగ్టన్/లండన్/ఇస్లామాబాద్: భారత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి వివిధ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీని అమెరికా అభినందించింది. అమెరికా వచ్చేందుకు మోడీని స్వాగతిస్తున్నట్లు వైట్‌హౌస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గుజరాత్‌లో 2002 నాటి అల్లర్ల నేపథ్యంలో దాదాపు పదేళ్ల కిందట అప్పటి బుష్ ప్రభుత్వం మోడీకి వీసా నిరాకరించిన దరిమిలా, అమెరికా ఆయనకు వీసా మంజూరు చేసేందుకు సానుకూలంగా స్పందించడం గమనార్హం. మోడీ నేతృత్వంలో భారత్‌లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంతో కలసి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జే కార్నే చెప్పారు.
బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్ మోడీకి ఫోన్‌చేసి స్వయంగా అభినందనలు తెలిపారు. తమ దేశాలకు రావాల్సిందిగా వారు మోడీని ఆహ్వానించారు. మోడీపై పదేళ్లు బహిష్కరణ విధించిన బ్రిటన్, రెండేళ్ల కిందట ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో కామెరాన్ మోడీని బ్రిటన్ రావాల్సిందిగా ఆహ్వానించడం విశేషం. మోడీని ఆహ్వానించిన తొలి యూరోపియన్ దేశం బ్రిటన్ కావడం గమనార్హం. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, విపక్ష నాయకురాలు ఖలీదా జియా కూడా మోడీకి అభినందనలు తెలిపారు. భారత్‌లో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది.
అమెరికాలోని భారత సంతతి ప్రజల అభినందనలు
అమెరికాలోని భారత సంతతి ప్రజలు మోడీని అభినందనలతో ముంచెత్తారు. మోడీ విజయానికి సూచికగా ఇళ్లలో, ఆలయాల్లో, సామాజిక కేంద్రాల్లో మూడు రోజుల పాటు దీపాలు వెలిగించాలని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పటేల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అమెరికా విభాగం కూడా మోడీని అభినందించింది. అమెరికాలోని భారత సంతతి ప్రజల తరఫున, భారత మిత్రుల తరఫున యూఎస్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ మోడీకి అభినందనలు తెలిపింది. మోడీ విజయాన్ని అంతర్జాతీయ మీడియా స్వాగతించింది.