వార్ వన్ సైడే! | narendra modi hawa in elections | Sakshi
Sakshi News home page

వార్ వన్ సైడే!

Published Sat, May 17 2014 4:05 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

వార్ వన్ సైడే! - Sakshi

వార్ వన్ సైడే!

దుమ్ము దులిపిన బీజేపీ....రాష్ట్రాలకు రాష్ట్రాలే స్వీప్
 
న్యూఢిల్లీ: ‘నమో’ మంత్రం రామబాణంలా పని చేసింది. ఆ దెబ్బకు గుజరాత్ (26), రాజస్థాన్ (25), ఢిల్లీ (7), ఉత్తరాఖండ్ (5), హిమాచల్‌ప్రదేశ్ (4), గోవా (2)... ఇలా రాష్ట్రాలకు రాష్ట్రాలే గుండుగుత్తగా బీజేపీ ఖాతాలో చేరిపోయాయి. మధ్యప్రదేశ్ (29)లోనూ రెండు మినహా అన్ని సీట్లనూ కైవసం చేసుకుంది. అంతేకాదు... జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలను చేజిక్కిం చుకుంది. వీటికి తోడు బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లోనూ అద్భుత ఫలితాలు రాబట్టింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఉత్తరప్రదేశ్‌లో ఒక్క దాంట్లోనే బీజేపీ సృష్టించిన ప్రభంజనం ఒక్కటీ ఒకెత్తు! రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాలకు గాను ఏకంగా 73 చోట్ల కాషాయ జెండా రెపరెపలాడిందంటే బీజేపీ ఎంతటి ఏకపక్ష విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అస్సాం వంటి కాంగ్రెస్ కంచుకోటలనూ బద్దలు కొట్టింది. జమ్మూ కాశ్మీర్‌తో పాటు తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ పాగా వేసింది. మోడీ గాలిలో కాంగ్రెస్ అక్షరాలా కొట్టుకుపోయింది. అన్ని రాష్ట్రాల్లోనూ అత్తెసరు సీట్లతో కుదేలైంది...
 
 గుజరాత్
 మోడీ నామ జపంతో గుజరాత్ ఊగిపోయింది. రాష్ట్రంలోని మొత్తం 26 లోక్‌సభ సీట్లూ బీజేపీ వశమయ్యాయి. వారిలోనూ 24 మంది ఏకంగా లక్షకు పై చిలుకు మెజారిటీతో విజయబావుటా ఎగురవేయడం మరో విశేషం! రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలపడింది. కేంద్ర మంత్రులు దిన్షా పటేల్, తుషార్ చౌదరి, భరత్ సోలంకీ వంటివారంతా మట్టికరిచారు.
 
 ఉత్తరాఖండ్
 కాంగ్రెస్ పాలిత ఉత్తరాఖండ్‌లో ఐదుకు ఐదు స్థానాలనూ బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. 2009లో అన్ని సీట్లనూ కాంగ్రెస్ గెలుచుకోగా, ఈసారి తాను ఆ ఫీట్ సాధించి చూపించింది. అందులోనూ నాలుగు స్థానాల్లోనైతే భారీ మెజారిటీతో విజయం సాధించింది.
 
 రాజస్థాన్
 రాజస్థాన్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలూ బీజేపీ ఖాతాలో పడ్డాయి. అక్కడ కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోవడం 1989 తర్వాత ఇదే తొలి సారి. అప్పుడు బీజేపీ 13, జనతాదళ్ 11, సీపీఎం ఒక స్థానం గెలిచా యి. అప్పుడెప్పుడో 1977లో చౌధురీ చరణ్‌సింగ్ నేతృత్వంలోని భారతీయ లోక్‌దళ్ రాజస్థాన్‌లో ఏకంగా 24 సీట్లలో నెగ్గగా కాంగ్రెస్ ఒక్క స్థానం (నగౌర్)తో సరిపెట్టుకుంది. సచిన్ పైలట్, జితేంద్ర సింగ్, చంద్రేశ్ కుమారి, నమో నారాయణ్ మీనా, గిరిజా వ్యాస్ వంటి కాంగ్రెస్ కేంద్ర మంత్రులంతా మట్టికరిచారు. బీజేపీపై తిరుగుబాటు చేసి స్వతంత్రుడిగా బరిలో దిగిన జశ్వంత్‌సింగ్ వంటి దిగ్గజం కూడా ఏకంగా 87 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూడటం విశేషం.
 
 ఢిల్లీ
 హస్తిన అధికార పీఠంతో అక్కడి లోక్‌సభ సీట్లన్నింటినీ కమల దళమే చేజిక్కించుకుంది. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్లోనూ విజయ దుందుభి మోగించింది. ఐదు నెలల క్రితం ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కళ్లు చెదిరే విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. కాంగ్రెస్ అభ్యర్థులంతా భారీ ఓట్ల తేడాతో మట్టికరిచారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్షవర్ధన్ తదితరులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి మీనాక్షీ లేఖీ 1.62 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మూడో స్థానానికి పడిపోవడం విశేషం. కృష్ణ తీరథ్ వంటి కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మంత్రులంతా మట్టికరిచారు.
 
 హిమాచల్‌ప్రదేశ్
 కాంగ్రెస్ పాలిత హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభాసింగ్ కూడా ఓటమి పాలవడం విశేషం! ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచడటం ఇదే తొలిసారి.
 
 యూటీల్లోనూ మోడీ జోరే
 కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ మోడీ హవాయే కన్పించింది. మొత్తం 6 స్థానాలకు గాను ఏకంగా నాలుగింటిని బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. అండమాన్ నికోబార్, దాద్రా-నగర్ హవేలీ, డామన్-దియూ, చండీగఢ్‌లలో మంచి మెజారిటీలతో నెగ్గింది. లక్షద్వీప్‌లో మాత్రం ఎన్సీపీ అభ్యర్థి మహ్మద్ ఫైజల్ తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ సిటింగ్ ఎంపీ హందుల్లా సయీద్‌ను ఓడించారు. ఇక పుదుచ్చేరిలో ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణస్వామి తన సమీప ప్రత్యర్థి ఆర్.రాధాకృష్ణన్ (ఆలిండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్) చేతిలో ఏకంగా 60,854 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement