- ఈ గెలుపు చరిత్రాత్మకం
- నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సాధించిన విజయం చరిత్రాత్మకమని, ఇదంతా నరేంద్ర మోడీ ఘనతేనని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశానికి నాయకత్వం వహించే సామర్థ్యం తమ ప్రధాని అభ్యర్థి అయిన ఆయనకే ఉందంటూ ప్రశంసలు కురిపించి, అభినందనలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఒక పార్టీ కాంగ్రెస్ కంటే పెద్ద పార్టీగా అవతరించడం, 1984 తర్వాత ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. రాజ్‌నాథ్ శుక్రవారమిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
శనివారం తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై, పార్లమెంటరీపక్ష నేత ఎంపికపై చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చగలనని మోడీ నిరూపించుకున్నారని వెంకయ్య నాయుడు కొనియాడారు. బీజేపీ గెలుపుతో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. నేతలు, కార్యకర్తలతో కార్యాలయం సందడిగా మారింది. రెండు ఏనుగులతో ఊరేగింపు నిర్వహించి, భారీగా బాణసంచా కాల్చారు. లక్ష లడ్డులను పంచారు. ‘న.మో’ పేరిట టీస్టాళ్లు పెట్టి ఉచితంగా టీ ఇచ్చారు.
మోడీకి పూర్తి క్రెడిట్ ఇవ్వని అద్వానీ: మోడీని పార్టీ అగ్రనేత అద్వానీ ఫోన్ చేసి అభినందించారు. అయితే గెలుపు ఘనతను పూర్తిగా మోడీకే కట్టబెట్టేందుకు విముఖత చూపారు. పార్టీ సాధించిన అపూర్వ విజయానికి మోడీ నాయకత్వం ఎంతమేరకు దోహ దం చేసిందో అంచనా వేయాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీని గెలుపు దిశగా నడిపించిన మోడీని ప్రధాని మన్మోహన్ సింగ్ అభినందించారు. దేశ ప్రజలు మార్పును కోరుకున్నారని, అందుకే బీజేపీకి పట్టం కట్టారని ఆరెస్సెస్ పేర్కొంది.